అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపిన తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం చేపట్టిన బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడిక్కడ పార్టీ శ్రేణులు కదంతొక్కి బంద్‌ను జయప్రదం చేశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లు, హోటళ్లు, పెట్రోలు బంకులు మూతబడ్డాయి.
జిల్లా వ్యాప్తంగా 12 డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులకు తోడుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కుల సంఘాల నాయకులు, యువ జేఏసీ సభ్యులు బంద్‌లో పాల్గొన్నారు. అనంతపురం నగరంలో పార్టీ నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, యోగీంద్రరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, లింగాల రమేష్, రంగంపేట గోపాల్‌రెడ్డి, మారుతీనాయుడు, బోయ సుశీలమ్మ, శ్రీదేవి తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది బృందాలుగా ఏర్పడి బంద్ చేపట్టారు. కదిరి, గాండ్లపెంట, తనకల్లు, తలుపుల, ఎన్‌పీకుంట, హిందూపురం, చిలమత్తూరు, లేపాక్షిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బంద్ సంపూర్ణమైంది. కళ్యాణదుర్గం, శెట్టూరు, కుందుర్పి, బ్రహ్మసముద్రం, కంబదూరు కేంద్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మడకశిరలో పార్టీ అధికార ప్రతినిధి వైసీ గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీ చేపట్టారు.
ఆమిదాలగొంది, అమరాపురం, రొళ్లలో కూడా రాస్తారోకో చేశారు. పుట్టపర్తి, అమడగూరు, నల్లమాడ, పెనుకొండ, రొద్దం, గోరంట్ల, పరిగి, శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, యల్లనూరు, ధర్మవరంలో బంద్ విజయవంతమైంది. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి భారతి ఆధ్వర్యంలో ర్యాలీ, బైక్ ర్యాలీ చేపట్టారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి, ఆత్మకూరులో పార్టీ శ్రేణులు రాస్తారోకో, ధర్నాలతో హోరెత్తించాయి. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నేత పేరం నాగిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. ఉరవకొండలో ఆర్టీసీ సర్వీసులు ఆగిపోయాయి. బ్యాంకులు మూతపడ్డాయి.
ఉద్యమించిన సమైక్యవాదులు
సమైక్యాంధ్రకు మద్దతుగా ఎస్కేయూ ఎదుట విద్యార్థి, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యాన అనంతపురం నగరంలో ర్యాలీ చేశారు. విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మునిసిపల్ కార్పొరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ధర్మవరం, బత్తలపల్లిలో ఏఐఎస్‌ఎఫ్, టీడీపీ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హిందూపురంలో టీడీపీ, ఎన్‌జీవో సంఘాల నేతలు బంద్‌లో పాల్గొన్నారు. కదిరిలో రజక వృత్తిదారులు ‘సమైక్య’ ర్యాలీ చేశారు.
చిలమత్తూరులో విశాలాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు బంద్‌కు సహకరించారు. పుట్టపర్తిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు బంద్ విజయవంతమయ్యేలా పర్యవేక్షించారు. యువ జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రాయదుర్గంలో ఎంపీ పొన్నం ప్రభాకర్ దిష్టి బొమ్మను సమైక్యవాదులు దహనం చేశారు. తాడిపత్రిలో టీడీపీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్మించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగాయి.
ఎక్కడివక్కడే..
Published Sat, Jan 4 2014 2:44 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement