‘సాక్షి’తో మాట్లాడుతున్న హిమ బిందు, మానస
అనంతపురం సిటీ: తల్లిదండ్రుల్లేని పిల్లలని తెలిస్తే ఎవరైనా జాలి చూపుతాం. చేతనైనంత సాయం చేస్తాం. కానీ అట్టడుగు వర్గాలకు చెందిన ఆ అక్కాచెలెళ్ల పట్ల ఏపీ పోలీసులు నిర్దయగా ప్రవర్తించారు. తల్లి అనారోగ్యంతో చనిపోగా.. తండ్రిని నక్సలైట్ నాయకుడని ముద్ర వేసి బూటకపు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపారు. అంతేకాదు.. తండ్రి మరణానంతరం ఆ ఇంటిపై సోదాల పేరుతో దాడిచేశారు. ఆ చిన్నారుల పేరిట వేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు, ఎల్‌ఐసీ బాండ్లను తీసుకుపోయారు. వాటికోసం ఆ చిన్నారులు కాళ్లరిగేలా తిరిగినా జాలి చూపలేదు. రక్షించాల్సిన పోలీసులే తమ పట్ల నిర్దయగా ప్రవర్తించడంతో ఖిన్నులైన అక్కాచెల్లెళ్లు న్యాయంకోసం ప్రభుత్వ గడప తొక్కినా ప్రయోజనం లేకపోయింది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు తమ కష్టం గురించి పలుమార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదు. ఈ క్రమంలో బుధవారం అనంతపురానికి వచ్చిన కమిషన్ చైర్మన్ కారెం శివాజీని కలసి మొర పెట్టుకునేందుకు వచ్చిన ఆ చిన్నారులకు మళ్లీ ఆశాభంగమే ఎదురైంది. వినతిపత్రం తీసుకుని వెళ్లిపోయారు తప్ప వారికెటువంటి హామీ ఇవ్వలేదు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్లపల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు హిమబిందు, మానసల దీనగాథ ఇదీ.. వారి కన్నీటి వ్యథను ‘సాక్షి’కి వివరించారు.
వివరాలు హిమబిందు మాటల్లోనే.. ‘‘అమ్మ సుగుణమ్మ అనారోగ్యంతో చనిపోవడంతో అప్పటిదాకా ప్రజాఉద్యమాల్లో తిరుగుతున్న నాన్న ఆంజనేయులు మాకోసం ఉద్యమబాట వీడాడు. వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పోషించేవాడు. అయితే నక్సలైట్‌గా ముద్రవేసిన పోలీసులు 2008 ఆగస్టు 18న ఇంటినుంచి నాన్నను తీసుకెళ్లి బూటకపు ఎన్‌కౌంటర్ చేశారు. ఆ తర్వాత మా ఇంటిపై సోదాల పేరిట దాడులు చేశారు. అప్పటి సీఐ బి.శ్రీనివాసులు మా నాన్న మా పేరిట చేసిన ఫిక్సిడ్ డిపాజిట్ బాండ్లు, ఎల్‌ఐసీ బాండ్లను తీసుకెళ్లారు. వాటికోసం ఆయన చుట్టూ ఎన్నోమార్లు తిరిగాం. ఇస్తామని నమ్మబలికి ఇవ్వలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కాటికి కాలుచాచిన అవ్వాతాతల కష్టంమీద ఆధారపడి బతుకుతున్నాం. ఇంతకష్టంలోనూ మా తాత నన్ను టెన్త్ వరకు చదివించారు. ఇక చదివించడం కష్టం కావడంతో ఇంటివద్దే ఉంటున్నా. చెల్లి(మానస) 9వ తరగతి చదువుతోంది. పుట్టెడు కష్టాల్లో ఉన్న మాకు.. ఎంతో కష్టపడి మా నాన్న బ్యాంక్‌లో దాచిన ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు, ఎల్‌ఐసీ బాండ్లు ఇప్పించాలని కోరుతున్నాం. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ద్వారా మా జీవితాలకు దారిచూపండని పలుమార్లు కోరినా కనికరించలేదు. మా సమస్యకు పరిష్కారం చూపలేదు. తల్లిదండ్రుల్లేని మాపై దయ చూపి అధికారులు, ప్రజాసంఘాల నేతలు న్యాయం జరిగేలా చూడాలని ప్రార్థిస్తున్నాం’’ అంటూ కన్నీరుమున్నీరైంది.