ఏపీ డెయిరీ కార్యాలయం
అనంతపురం అగ్రికల్చర్: పదేళ్ల కిందట పాల విప్లవం సృష్టించిన ప్రభుత్వ డెయిరీ పరిస్థితి ఇప్పుడు పతనావస్థకు చేరుకుంది. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం, డెయిరీ అధికారుల అలసత్వం పాడి రైతులకు శాపంగా మారాయి. హెరిటేజ్ అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు ప్రైవేట్ డెయిరీలను ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ డెయిరీ సంక్షోభంలో కూరుకుపోయింది. పాలక పెద్దలకు పట్టించుకునే తీరిక లేకపోవడంతో ఇదే అదనుగా డెయిరీలో పనిచేస్తున్న అధికారులకు ఇష్టారాజ్యమైంది. ఫలితంగా పెద్ద ఎత్తున నష్టాలు మూటగట్టుకుని పాడి రైతులకు సేవలందించలేక మూతబడేందుకు సిద్ధమైంది.
పదేళ్ల కిందటే 70 వేల లీటర్లు
పదేళ్లు వెనక్కి తిరిగి చూస్తే 2006–2012 వరకు రోజుకు 20 వేల మందికి పైగా రైతుల నుంచి 70 నుంచి 80 వేల లీటర్లు పాలు సేకరిస్తూ క్షీరవిప్లవం సృష్టించిన ఏపీ డెయిరీ ఇప్పుడు చతికిలపడిపోయింది. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాయితీలు, సబ్సిడీలతో ఇచ్చిన ప్రోత్సాహంలో జిల్లాలో వ్యవసాయానికి ప్రధాన ప్రత్యామ్నాయంగా పాడి పరిశ్రమ అభివృద్ధి బాటలో దూసుకుపోయింది.
30 బీఎంసీలు మూత
జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీ డెయిరీ) ఆధ్వర్యంలో ఒక్కొక్కటి 50 వేల లీటర్లు చొప్పున అనంతపురం, హిందూపురంలో లక్ష లీటర్లు సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. 2006–12 మధ్యకాలంలో 42 బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లు (బీఎంసీ) పనిచేస్తుండగా వాటి పరిధిలో 74 పాలరూట్లు, 540 వరకు పాల సేకరణ సెంటర్లు పనిచేస్తూ రోజుకు ఎంతలేదన్నా 70 వేల లీటర్లు పాల సేకరిస్తూ... వాటిని జిల్లాతో పాటు హైరదాబాద్‌కు రవాణా చేసి లాభాలబాటలో పయనించింది. కానీ... ఇపుడు 30 బీఎంసీలు మూతబడ్డాయి. కేవలం 30 పాలరూట్ల పరిధిలో 230 పాల సేకరణ సెంటర్లు మిణుకు మిణుకు మంటూ పనిచేస్తున్నాయి. వాటి నుంచి రోజుకు కేవలం 5 వేల నుంచి 5,500 లీటర్లు పాల సేకరిస్తున్నారు. రైతులు తక్కువైనా వారికి కూడా నెలల తరబడి బిల్లులు చెల్లించలేకపోతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ డెయిరీ రైతులను బట్టులో వేసుకుంటూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాయి.
డెయిరీపై అవినీతి ముద్ర
డెయిరీలో పనిచేస్తున్న డీడీతో పాటు ఇతర అధికారులు, మేనేజర్లు, క్షేత్రస్థాయి సిబ్బందిలో చాలా మంది చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పాల సేకరణ, స్థానిక అమ్మకాలు, ఇతర రాష్ట్రాలకు అమ్మకం, చెల్లింపులు, నిర్వహణ విషయాల్లో అవినీతి అక్రమాలు పెరిగిపోవడం, అడిగేవారు లేకపోవడం, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, ఆ శాఖ కమిషనరేట్ అధికారులు సహకరించకపోవడంతో ఇక్కడ పనిచేస్తున్న డీడీల్లో ఇటీవల కాలంలో నాగేశ్వర్‌రావు, వై.శ్రీనివాసులు అనే ఇరువురు అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. మూడు నెలల్లో డెయిరీని అభివృద్ధి బాటలో పట్టిస్తానంటూ గొప్పలు చెప్పిన డీడీ ఎం.శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టి 9 నెలలైనా చేసిందేమీ లేదన్న విమర్శలు వ్యక్తమతున్నాయి.
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతుల బాగోగులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డెయిరీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో డెయిరీ అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది. ప్రైవేట్ డెయిరీల్లో లీటర్‌పై ఐదు నుంచి ఆరు రూపాయలు ఎక్కువగా ఇస్తున్నారు. సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయి. ఏపీ డెయిరీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, ఆ శాఖ కమిషనరేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిస్థితిలో మార్పు రాలేదు. – బుల్లే ఆదినారాయణ, పాల ఉత్పత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment