ప్రత్యేక ప్యాకేజీపై ‘ప్రాజెక్ట్ అనంత’ భవిత
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా వ్యవసాయ రంగ సంక్షోభ నివారణకు ఉద్దేశించిన ‘ప్రాజెక్టు అనంత’ భవితవ్యం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ‘ప్రత్యేక ప్యాకేజీ’పై ఆధారపడింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు రాయలసీమకు ఇస్తామని చెబుతోన్న ‘ప్రత్యేక ప్యాకేజీ’లో ‘ప్రాజెక్టు అనంత’కు పెద్దపీట వేస్తేనే జిల్లాలో కరువు రక్కసిని పారదోలవచ్చుననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైసల్మీర్ తర్వాత దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యేది మన జిల్లాలోనే. ఇక్కడ ఏడాదికి సగటున 552 మిల్లీమీటర్ల(మి.మీ) వర్షం కురుస్తుందని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. వాస్తవానికి 350 మి.మీ కూడా కురవడం లేదు. నైరుతి రుతుపవనాల వల్లే 398 మి.మీ వర్షం పడుతుందని భారత వాతావరణ సంస్థ అంచనా వేసింది. వీటిపై ఆధారపడి ఏటా ఖరీఫ్‌లో సగటున 9.50 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటను సాగుచేస్తున్నారు.
నష్టాలు మిగులుస్తున్న వేరుశనగ :
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, డ్రైస్పెల్స్ (వర్షపాత విరామాలు) అధికంగా ఉండడం వల్ల వేరుశనగ పంట రైతులకు నష్టాలనే మిగుల్చుతోంది. పెట్టుబడులు కూడా తిరిగి రావడం లేదు. రైతులు అప్పుల పాలై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 1997లో దేశంలో తొలి రైతు ఆత్మహత్యకు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని చియ్యేడు గ్రామం కేంద్రమైంది.
అప్పటి నుంచి నేటి వరకూ 1,102 మంది ఆత్మార్పణం చేసుకున్నారు. వేరుశనగ పండినా, పండకపోయినా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 ఖరీఫ్ నుంచి ప్రవేశపెట్టిన పంటల బీమా పథకాన్ని 2011 ఖరీఫ్ నుంచి కిరణ్ సర్కారు నీరుగార్చింది.
దాని స్థానంలో వాతావరణ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల రైతులకు 2011 ఖరీఫ్‌లో రూ.98 కోట్లు, 2012 ఖరీఫ్‌లో రూ.181 కోట్లు మాత్రమే పరిహారం దక్కింది. వాతావరణ బీమాపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో అప్పటి రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి.. అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌కు ఓ లేఖ రాశారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించాలని కోరారు. దీంతో కేంద్రం భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ నేతృత్వంలో 21 మంది సభ్యులతో అత్యున్నత సాంకేతిక కమిటీని నియమించింది.
మొదట ఐసీఏఆర్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ ఏకే సింగ్ అధ్యక్షతన కేంద్ర బృందం 2012 జనవరి 18, 19, 20 తేదీల్లో జిల్లాలో పర్యటించింది. జిల్లా వాతావరణ, పంటల పరిస్థితులను అధ్యయనం చేసింది. ఓ ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి అయ్యప్పన్‌కు అందించింది. ఆ నివేదికకు తుదిరూపం ఇవ్వడానికి అయ్యప్పన్ స్వయంగా 2012 ఫిబ్రవరి 24 నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో సేద్యాన్ని గాడిలో పెట్టేందుకు అనేక ప్రతిపాదనలు చేస్తూ మార్చి 8, 2012న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక అమలు కోసం వ్యవసాయ, అనుబంధ శాఖలు ఆర్నెళ్ల పాటు శ్రమించి రూ.7,676 కోట్లతో భారీ ప్రణాళికను రచించాయి. దీనికి అప్పటి కిరణ్ సర్కారు ఆమోదముద్ర వేసింది. ‘ప్రాజెక్టు అనంత’గా నామకరణం చేసింది. ఈ ప్రాజెక్టును 2013-14 నుంచి 2017-18లోగా అమలుచేయాలని నిర్ణయించారు.
ఆశలన్నీ ప్యాకేజీపైనే :
ఐదేళ్లలో జిల్లాలో వ్యవసాయ, అనుబంధ శాఖలకు రూ.4,387 కోట్లు విడుదలవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం.. ఆ నిధులను ‘ప్రాజెక్టు అనంత’కు మళ్లించాలని అధికారులను ఆదేశించింది. తక్కిన రూ.3,289 కోట్లను సర్దుబాటు చేసేందుకు అప్పటి కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అంగీకరించలేదు. దీంతో ‘ప్రాజెక్టు అనంత’ భవిత ప్రశ్నార్థకమైంది. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల ముందు రూ.100 కోట్లు కేటాయించి.. 14 గ్రామాల్లో ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు శ్రీకారం చుట్టింది. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. ఆ ప్యాకేజీలో ‘ప్రాజెక్టు అనంత’ అమలుకు నిధులను కేటాయిస్తే ఉపయుక్తంగా ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంపై స్పష్టత ఏదీ?
దుర్భిక్ష పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచే వంగడాలను తయారు చేసి, రైతులకు అందించగలిగితేనే ‘అనంత’లో వ్యవసాయాన్ని గాడిలో పెట్టేందుకు వీలుంటుందని అయ్యప్పన్ కమిటీ కేంద్రానికి సూచించింది. ఇందుకోసం జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు జాతీయ స్థాయి వేరుశనగ విత్తన పరిశోధన సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలను అప్పటి కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అహ్లువాలియా సూత్రప్రాయంగా అంగీకరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పుతామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. అయితే.. మన జిల్లాలో ఏర్పాటు చేస్తామని ఎక్కడా ప్రకటించడం లేదు. గుంటూరులో గానీ, బాపట్లలో గానీ ఏర్పాటుచేసే అవకాశం ఉన్నట్లు లీకులు ఇస్తోంది. ఇక వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రంపై నోరుమెదపడం లేదు.