అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో రాజకీయ జోక్యం మితిమీరిపోతుండడంతో వ్యవస్థ గాడి తప్పుతోంది. లక్షలు వెచ్చించి దొడ్డిదారిన పోస్టులు చేజిక్కించుకున్న వారు తొలి నుంచే నాలుగురాళ్లు వెనుకేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. దీంతో గర్భవతులు, పిల్లలు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. ఫలితంగా పౌష్టికాహార లోపంతో మాతాశిశు మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
2013లో జిల్లా వ్యాప్తంగా 14 మంది శిశువులు మరణించారని అధికారులు చెబుతున్నారు. అయితే వాస్తవంగా ఈ సంఖ్య పదింతలు ఎక్కువ ఉంటుందని అంచనా. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 17 ప్రాజెక్టుల పరిధిలో 4286 అంగన్‌వాడి(మెయిన్) సెంటర్లు ఉన్నాయి, మరో 840 మినీ అంగన్‌వాడీ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇందులో 39,526 మంది గర్భవతులు, 38,975 మంది బాలింతలు, 2,95,991 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికీ అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా రోజూ పౌష్టికాహారం అందజేయాలి. వారంలో రెండు రోజులు ఉడికించిన కోడిగుడ్లు అందజేయాలి. ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలవుతున్న ప్రాజెక్టులో మధ్యాహ్న (ఫుల్‌మీల్స్) భోజనం అమలు చేస్తున్నారు. అయి తే ఇవి పూర్తి స్థాయిలో లబ్ధిదారుల చెంతకు చేరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ అమృతహస్తం అమలవుతున్న కణేకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర, కంబదూరు ప్రాజెక్టులో పథకం పక్కదారి పడుతోందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. నిబంధనల మేరకు అంగన్‌వాడీ సెంటర్లలోనే మధ్యాహ్నం భోజనం వండిపెట్టాలి.
రోజూ ఒక గ్లాసు పాలు
అందజేయాలి. వారంలో రెండు రోజులు కోడిగుడ్లు అందజేయాలి. ఒక్కో లబ్ధిదారురాలికి రోజుకు 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల కందిబేడలు, 16 గ్రాముల వంటనూనె చొప్పున మూడు నెలలకు సరిపడా సరుకులు ఒకేసారి ఆయా ప్రాజెక్టులకు పంపిణీ చేస్తారు. కోడిగుడ్డు, పాలు, కూరగాయలు స్థానికంగానే కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకు సరిపడా నిధులు కూడా ఆయా సీడీపీఓల ఖాతాలో జమ చేశారు.
సీడీపీఓలు సంబంధిత గ్రామైక్య సంఘం సభ్యుల ఖాతాలోకి మళ్లించి స్థానికంగానే కొనుగోలు చేయాలి. వంట చేయడానికి కట్టెల కోసం నెలకు అర్బన్ పరిధిలో రూ.200, గ్రామాల్లో రూ. 150 చెల్లిస్తారు. అయితే నిబంధనలేవీ గ్రామాల్లో అమలు కావడం లేదు. ఏపీ డెయిరీ పాలు సరఫరా చేస్తున్న ప్రాంతాల్లో మినహా మరెక్కడా గర్భవతులు, బాలింతలకు పాలు పంపిణీ చేస్తున్న దాఖలాలు లేవు. లబ్ధిదారుల సంఖ్యను బట్టి వారికి కేటాయించిన మోతాదులో కందిబేడలు, బియ్యం, నూనె వినియోగించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కోడిగుడ్డు అందేది దైవాధీనమే..
అంగన్‌వాడీ సెంటర్లలో కోడిగుడ్లు లబ్ధిదారులకు అందడం దైవాధీనంగా మారుతోంది. చిత్తూరు మార్కెట్‌లో కోడిగుడ్డు ధర పెరిగినా, సమైక్యాంధ్ర పేరుతోనో మరే ఇతర కారణాల వలన ఆందోళనలు జరుగుతున్నాయంటే పిల్లలు, గర్భవతులు, బాలింతలు కోడిగుడ్లు మరిచిపోవాల్సిందే. గతేడాది (2013)లో దాదాపు నాలుగు నెలలపాటు లబ్ధిదారులకు కోడిగుడ్లు సరఫరా చేసిన దాఖలాలు లేవు. సమైక్యాంధ్ర ఉద్యమం రూపంలో మూడు నెలలు నిరవధిక బంద్ చేస్తే.. చిత్తూరు మార్కెట్‌లో కోడిగుడ్డు ధర అమాంతం పెరిగిపోయిందని మరికొన్ని రోజులు సరఫరాను నిలిపివేశారు. దీన్ని బట్టి చూస్తే కోడిగుడ్డు సరఫరా అనేది టెండర్లు దక్కించుకున్న వారి ఇష్టాఇష్టాలపైనే ఆధారపడుతోంది. వారిపై ఐసీడీఎస్ అధికారుల అజమాయిషీ లేకుండా పోతోంది. దీంతో పాటు తక్కువ సైజు పరిమాణంలో ఉన్న కోడిగుడ్లను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తూ లక్షలకు లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకుపోయినా చిత్తూరు నుంచి పెద్ద సైజు కోడిగుడ్లను సరఫరా చేయడానికి ఇబ్బంది ఉంటుందని, పగిలిపోతాయని అధికారులు సాకులు చెబుతున్నారు. తక్కువ సైజు గుడ్డు ఇచ్చినా పర్వాలేదని పేర్కొంటున్నారు. అధికారుల ఆలోచనలు కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకోవడానికి సహకరిస్తుండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతోంది.
మితిమీరుతున్న రాజకీయ జోక్యం ఐసీడీఎస్‌పై రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. అంగన్‌వాడీ పోస్టుల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడం ద్వారా పరిపాలనాపరంగా అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి భర్తీ వరకూ వారి మాటే చెల్లుబాటు కావాలి.
కాదూ కూడదంటే నోటిఫికేషన్ విడుదల చేసిన స్థానం ఎన్నేళ్లయినా సస్పెన్స్‌లోనే ఉండాలి. గతేడాదిలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇలా దాదాపు 60 పోస్టుల వరకూ ఆగిపోయాయి. ఇది కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాలు కావడం గమనార్హం. 2012లో కొత్తగా 911 కార్యకర్తలు, 555 మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 987 ఆయా పోస్టులను భర్తీ చేశారు. అష్టకష్టాలు పడి జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాలలో అభ్యర్థులను నియమించినా కదిరి, పుట్టపర్తి డివిజన్‌లలో మాత్రం భర్తీ చేయలేక పోతున్నారు. తమ వారిని తప్ప వేరెవరినీ ఆ పోస్టుల్లో నియమించడానికి వీల్లేదని స్థానిక ఎమ్మెల్యేలు భీష్మించుకొని కూర్చోవడంతో దాదాపు 60 పోస్టులు వెనక్కుపోయే దశలో ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చెప్పిన వారే పోస్టుల్లో ఉండాలి.
లేదంటే ఇదే పరిస్థితి ఉంటుంది. కార్యాలయంలో ఎస్టాబ్లిష్‌మెంట్ సెక్షన్‌లో పనిచేసే కొందరు అధికారులు, ఎమ్మెల్యేల అనుచరులు కుమ్మక్కై అభ్యర్థుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వినపడుతున్నాయి. వారు డబ్బులు తీసుకున్న అభ్యర్థులను సీట్లో కూర్చోబెట్టే వరకు వదలక పోవడంతో అభ్యర్థుల ఎంపిక ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారుతోంది. ఈ వ్యవస్థ మారనంత వరకు అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతం కాదని... మాతాశిశు మరణాలను పూర్తి స్థాయిలో అరికట్టలేమని ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతానికి కృషి
అంగన్‌వాడీ వ్యవస్థను బలోపేతం చెయాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ అమృతహస్తం పథకం అమలవుతున్న ప్రాజెక్టులలో కొన్ని ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా పాలు సరఫరా కావడం లేదని ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయి. జనవరి నుంచి ఏపీ డెయిరీ ద్వారానే అన్ని కేంద్రాలకూ పాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం నడుస్తున్న ఆరు ప్రాజెక్టులతో పాటు కదిరి ఈస్ట్, కదిరి వెస్ట్, పెనుకొండ, గుత్తి ప్రాజెక్టులలో జనవరి నుంచి అమలు చేస్తాం.
- జుబేదాబేగం, పీడీ, ఐసీడీఎస్
పౌష్టికాహారాం..రాం
Published Thu, Jan 2 2014 2:57 AM | Last Updated on Fri, Aug 17 2018 5:18 PM
Advertisement
Advertisement