ఇదొక హింస | It is a violence | Sakshi
Sakshi News home page

ఇదొక హింస

Published Wed, Jan 29 2014 2:19 AM | Last Updated on Fri, Aug 17 2018 5:18 PM

It is a violence

అనంతపురం టౌన్/ క్రైం, న్యూస్‌లైన్ : మహిళలపై వేధింపులు జిల్లాలో నిత్యకృత్యమయ్యాయి. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొస్తున్నా.. అవి సరిగా అమలు కావడం లేదు. గృహ హింస నిరోధక చట్టం-2005 కూడా ఇదే కోవలోకి చేరింది. అసలీ చట్టం గురించి చాలా మందికి తెలియదనడంలో వాస్తవం ఉంది. ఈ చట్టం అమలులో భాగంగా స్త్రీ,శిశు సంక్షేమ శాఖలో 2005లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యేక సిబ్బందిని నియమించి.. విధులు, నిధులు కేటాయించారు. అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు ఆయా ప్రాజెక్టుల సీడీపీఓలు కూడా గృహ హింసను నిరోధించడానికి ప్రత్యేకంగా కృషి చేయాల్సి ఉంటుంది. అయితే.. క్షేత్ర స్థాయిలో అలా జరగడం లేదు. కనీసం చట్టంపై మహిళలకు అవగాహన కల్పించలేకపోతున్నారు. అత్త వేధిస్తోందని, భర్త తాగొచ్చి చితకబాదుతున్నాడని బాధిత మహిళలు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు తప్ప ఐసీడీఎస్ కార్యాలయాలకు వెళ్లలేకపోతున్నారు. గృహ హింస నిరోధక చట్టం అమలును ఈ శాఖ పర్యవేక్షిస్తోందన్న విషయం చాలా మందికి తెలియకపోవడమే ఇందుకు కారణం.
 
 చట్టం అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా 577 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో 195 కేసులను ఐసీడీఎస్ అధికారులు పరిష్కరించారు. మిగతా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. చాలామంది బాధితులు కోర్టుల చుట్టూ తిరగలేక కేసులు విత్‌డ్రా చేసుకుంటున్నారు.
 
 పరిష్కరించిన కేసుల్లోనూ ఎంత మందికి ఆర్థిక సాయంతో ఇతరత్రా భద్రతను కల్పించారని అధికారులను ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానాలు రావడం లేదు. దీన్ని బట్టే చట్టం అమలు ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా చాలా మంది మహిళలు గృహ హింసకు గురవుతున్నారు. ఐసీడీఎస్ అధికారులను సంప్రదిస్తే తమకు న్యాయం జరుగుతుందని తెలియక  పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. అక్కడ దుప్పటి పంచాయితీలతో సరిపెడుతున్నారు. ఫలితంగా ఎక్కువ శాతం మంది అన్యాయానికి గురవుతున్నారు.
 
 ఒకే ఒక్కటి..
 జిల్లాలో మహిళల కోసం ప్రత్యేక పోలీస్‌స్టేషన్ జిల్లా కేంద్రంలో మినహా మరెక్కడా లేదు. ఇది కూడా గృహ హింస కేసుల్లో సమర్థవంతంగా వ్యవహరించలేకపోతోంది. అత్తింటి వేధింపులకు గురవుతున్న గ్రామీణ మహిళలు తమ బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ప్రాణాలు విడుస్తున్నారు. కొంతమంది ధైర్యంగా పోలీస్‌స్టేషన్లను ఆశ్రయిస్తున్నా అక్కడ మహిళల కోసం ప్రత్యేక విభాగం లేకపోవడంతో న్యాయం జరగడం లేదని తెలుస్తోంది. ఇటీవల కళ్యాణదుర్గం సర్కిల్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ వ్యవహరించిన తీరు ఓ కాపురాన్ని విచ్ఛిన్నం చేసింది.
 
 తన భర్త మరో మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ ఏమాత్రం ఆలోచించకుండా భర్తను సెల్‌లో 17 రోజుల పాటు నిర్బంధించాడు. దీంతో అతను పోలీసు స్టేషన్‌లో పెట్టించిందన్న కోపంతో భార్యను వదిలేశాడు. వాస్తవానికి గృహ హింస కేసులొస్తే వాటిలో ఎక్కువ శాతం కౌన్సిలింగ్‌తోనే పరిష్కరించే అవకాశం ఉంది. భార్య, భర్త, బంధువులకు వేర్వేరుగా కౌన్సిలింగ్ చేసి వారిలో మార్పు తీసుకురావాలి. అయితే.. ఎక్కువ శాతం పోలీస్‌స్టేషన్లలో ఇలా జరగడం లేదు. పోలీసులు తమ దైన ‘శైలి’లో వెళుతున్నారు.
 
 అనంతపురం నగరంలోని మారుతీనగర్‌కు చెందిన శ్రీనివాస్ (పేరు మార్చాం), ధర్మవరం పట్టణానికి చెందిన లత(పేరు మార్చాం)కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరి జీవితం రెండేళ్ల పాటు సాఫీగా సాగింది. ఆ తర్వాత శ్రీనివాస్ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. స్థానికంగా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్‌కు పెళ్లి సమయంలో అత్తామామలు కట్నకానుకలు భారీగా ఇచ్చారు.
 
 అయినా అతను సంతృప్తి చెందకుండా అదనపు కట్నం కోసం భార్యను రోజూ హింసించేవాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. గృహ హింస నిరోధక చట్టం(డీవీ యాక్టు) కింద కేసు పెట్టేందుకు ఐసీడీఎస్ అధికారులను సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఆమె అలాగే చేసింది. ఐసీడీఎస్ అధికారులు ఆ దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా శ్రీనివాస్ తీరు మారకపోవడంతో కేసు నమోదుకు సిద్ధమవుతున్నారు.
 
 పుట్టపర్తి మండలం కత్తివారిపల్లికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి ఈ నెల 7న పెనుకొండ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. భర్త రోజూ తాగొచ్చి హింస పెట్టడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తాను చనిపోతే కుమారులు అనాథలవుతారని భావించి వారినీ తన ‘వెంట’ తీసుకెళ్లింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement