పెద్దపల్లి, న్యూస్‌లైన్ : అంగన్‌వాడీవాడీ కేంద్రాల్లో పిల్లల కడుపులు మాడుతున్నాయి. రెండు నెలలుగా బియ్యం సరఫరా లేక చిన్నారలకు పౌష్టికారం అందడంలేదు. ఈ దుస్థితి పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో రెండు నెలలుగా కొనసాగుతోంది. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సుమారు ఆరువందల కేంద్రాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో పిల్లలు ఇళ్ల నుంచి అన్నం తీసుకొచ్చుకుంటే.. అంగన్‌వాడీ కేంద్రాల్లో పప్పు మాత్రమే వడ్డిస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా నడుస్తున్న అంగన్‌వాడీల్లో అన్నం పెట్టకపోవడంతో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
జిల్లాలో మూడు వేలకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఒకపూట భోజనానికి బదులు బాలామృతం ప్యాకెట్లు ఇచ్చేందుకు శిశు సంక్షేమ శాఖ కొద్దికాలం క్రితం నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే అవి కూడా అరకొరగా సరఫరా చేస్తున్నారు. దీంతో ఇటు భోజనం.. అటు బాలామృతం( పౌష్టికాహార ప్యాకెట్లు) రెండింటికీ నోచుకోకుండా పోతున్నారు చిన్నారులు. కేంద్రాల్లో మిగులుగా ఉన్న పప్పును ఉడికించి పిల్లలు అన్నం తెచ్చుకుంటే తోడుగా వేస్తున్నారు. కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న గర్భిణులకు నెలనెలా ఇవ్వాల్సిన బియ్యం, పప్పు, నూనెలు రెండు నెలలుగా అందడం లేదు. చిన్నపిల్లలకు బియ్యం, పప్పు, నూనె నిలిపివేసి బాలామృతం ఇస్తామని చెప్పిన అధికారులు.. దానిని సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఇంటినుంచే సద్దిపట్టుకునే వెళ్లాల్సి వస్తోంది.
ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో 100 నుంచి 120 మంది పిల్లలు బాలామృతం ప్యాకెట్ల కోసం పేరు నమోదు చేసుకోగా 40 మందికి కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. వచ్చిన ప్యాకెట్లను ఎవరికి అందించాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 385 అంగన్‌వాడీ కేంద్రాలకు పేరు నమోదు చేసుకున్న ఒక్కో గర్భిణికి కిలో చొప్పున పప్పు మాత్రమే చేరిందని కార్యకర్తలు అంటున్నారు. పప్పు పంపిణీ చేయడం ద్వారా తాము బియ్యం, నూనె స్వాహా చేశామని మహిళలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయమై పెద్దపల్లి, సుల్తానాబాద్ ఐసీడీఎస్ సీడీపీవోలు శాంతకుమారి, సరస్వతిని ప్రశ్నించగా బియ్యం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు.
అన్నం మీది.. పప్పు మాది
Published Sat, Dec 14 2013 3:35 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement