మంకమ్మతోట(కరీంనగర్): ఐసీడీఎస్‌లో అక్రమాల పర్వం బట్టబయలైంది. గర్భిణులు, బాలింతలకు సరఫరా చేసే పౌష్టికాహారం మాయమైంది. అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం, న్యూట్రీషియన్ పౌడర్ సరఫరా చేయకుండానే బిల్లులు కాజేశారు అధికారులు. దాదాపు 60 బిల్లుల్లో కోట్లాది రూపాయలు మింగేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతల కోసం పౌష్టికాహారం అందజేస్తున్నారు. అయితే వీటిని కేంద్రాలకు సరఫరా చేయకుండానే బిల్లులు కాజేసినట్లు ఐసీడీఎస్ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆడిట్ అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆడిట్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ప్రాజెక్టులకు గతంలో కరీంనగర్ నుంచే పౌష్టికాహారం, న్యూట్రిషీయన్ పౌడర్ సరఫరా చేసేవారు. ఈ వ్యవహారం అంతా జిల్లా పీడీ, సీడీపీవోల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరాలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో కరీంనగర్‌లోని పీడీ కార్యాలయంలో ఆడిట్ అధికారులు రికార్టులు పరిశీలించారు. 2011 నుంచి 2015 వరకు లోకల్‌ఫుడ్, 2015 నుంచి 2018 వరకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారం సరఫరాలోజగిత్యాల, మెట్‌పల్లి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. ఈ సమయంలో ఉమ్మడి జిల్లా పీడీలుగా రాములు, మోహన్‌రెడ్డి వ్యవహరించారు.
60 బిల్లులు రూ.2.15కోట్లు
రాములు, మోహన్‌రెడ్డి పీడీలుగా ఉన్న సమయంలో ఆరోగ్యలక్ష్మి పథకానికి సంబంధించిన మొత్తం 85 బిల్లులు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఎలాంటి పౌష్టికాహారం సరఫరా చేయకుండానే రూ.2.15కోట్లు చెల్లించినట్లు 60 బిల్లులు చేశారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందగా.. గతంలోనే విచారణ చేసిన అధికారులు పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఆర్జేడీకి ఫిర్యాదు చేశారు. దీంతో నెల రోజులుగా ఆయా ప్రాంతాల్లో ఆడిట్ నిర్వహిస్తున్నారు. గతంలో కరీంనగర్‌రూరల్, సుల్తానాబాద్, పెద్దపల్లి, భీమదేరవరపల్లి ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిని సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ప్రాజెక్టుల రికార్డులను కరీంనగర్ పీడీ కార్యాలయంలో పరిశీలిస్తున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా గతంలో వచ్చిన ఫిర్యాదులు నిర్ధారణవడంతో అన్ని ప్రాజెక్టుల రికార్డులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఎస్‌ఎన్‌పీలోనూ..
ప్రభుత్వం సరఫరా చేసే ఆహార పదార్థాలతోపాటు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఎస్‌ఎన్‌పీ (స్పెషల్ న్యూట్రీషియన్ ఫుడ్) సరఫరా చేస్తుంటారు. వీటి సరఫరాలోనూ పీడీ, సీడీపీవోలతోపాటు పైస్థాయి అధికారులు దాదాపు రూ.5కోట్ల బిల్లులు కాజేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయంపై 2014లోనే ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయంలో ఫిర్యాదులు అందాయి. వీటిపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలోనూ చర్చించారు. ప్రస్తుతం వీటిపై కూడా ఆడిట్ చేస్తున్నారు.
మెట్‌పల్లిలో బూడిదైన రికార్డులు
మెట్‌పల్లి ప్రాజెక్టులో 2009–2012 కాలంలో పౌష్టికాహారం సరఫరా వివరాలు ఇవ్వాలని సమాచారహక్కు చట్టం కింద పలువురు దరఖాస్తు చేసుకున్నారు. సరఫరా చేయకుండానే బిల్లులు కాజేయడంతో వివరాలు ఇస్తే దొరికిపోతామనే భయంతోనే రికార్డులు కాల్చి బూడిద చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే కార్యాలయంలో రికార్డులు లభించకపోవడంతో ఆరోపణలకు బలం చేకూరుతుంది. అధికారులు అండదండలతోనే కింది స్థాయి సిబ్బంది రికార్డులను కాల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment