Pedha pally
-
‘పచ్చ’ నోట్ల కేసులో టీడీపీ ఎమ్మెల్యే పరారీ
హైదరాబాద్, ఆర్టీసీ బస్సులో రూ. 90 లక్షలు ‘పచ్చ’నోట్లు పట్టుబడిన కేసులో నిందితుడైన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు (టీడీపీ) పరారీలో ఉన్నారు. ఆయనతో పాటు ఈ సొమ్ము వ్యవహారంలో ప్రమేయం ఉన్న నాగరాజు అనే వ్యక్తి కోసం గాలిస్తున్నామని బొల్లారం పోలీసులు తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీతో విజయరమణరావు పీఏ రాజమౌళి వద్ద రూ. 90 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. రాజమౌళికి నగదును అందించిన నాగరాజుతో పాటు విజయరమణరావును పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. రాజమౌళిని అరెస్టు చేశారు. నాగరాజుకు ఈ డబ్బు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చాడు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజమౌళి వాంగ్మూలం: ‘‘పెద్దపల్లి ఎమ్మెల్యే రమణరావు తనకు బేగంపేట్‌లో ఉన్న నాగరాజు ఫోన్ నంబరు (9989396721) ఇచ్చి నగదు తీసుకురావాలని చెప్పాడు. దీంతో నేను గురువారం ఉదయం 9 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ జూబ్లీస్టేషన్కు 11.30 గంటలకు చేరుకున్నాను. ఆ తర్వాత నాగరాజుకు ఫోన్ చేశా. అతను నన్ను బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన నాకు నాగరాజు నగదుతో ఉన్న నీలం రంగు పోలో బ్యాగ్ ఇచ్చాడు. దానిని తీసుకుని జూబ్లీ బస్‌స్టేషన్‌కు వచ్చి 3.30 గంటలకు కరీంనగర్ బస్సు ఎక్కాను. ఈ నగదును ఎన్నికల నిధుల కింద కరీంనగర్ జిల్లా టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్తున్నాను...’’ అని రాజమౌళి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. -
ఏసీబీకి చిక్కిన ఏఈ
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. చేసిన పనులను ఎంబీ రికార్డు చేసేం దుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో పంచాయతీరాజ్ ఏఈ. సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో గ్రామంలోని గాంధీనగర్‌లో మాజీ సర్పంచ్ గుండా మురళి రూ.2లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మించారు. గత నెలలో పనులు పూర్తి కావడంతో బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరగగా ఎంబీ రికార్డు చేసేందుకు పంచాయతీరాజ్ ఏఈ మంచాల శ్రీధర్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనన్నా ఏఈ వినకపోవడంతో రూ.15 వేలు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మురళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం పెద్దపల్లిలోని ఈఈ కార్యాలయానికి వెళ్లిన మురళి ఏఈని కలిశాడు. కార్యాలయం గేటు వద్ద మురళి నుంచి ఏఈ శ్రీధర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోయిందని, అరికట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, విద్యావంతులపై ఉందని చెప్పారు. మిగతా జిల్లాలతో పోల్చితే మన జిల్లాలో అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఇది మంచి పరిణామమని అన్నారు. పనిచేస్తే ఏం మిగల్లేదు - మురళి, బాధితుడు ఎమ్మెల్సీ భానుప్రసాదరావు కోటా నిధుల నుంచి రూ.2 లక్షల విలువ గల సీసీ రోడ్డు డిసెంబర్లో మంజూరైంది. వెంటనే నిర్మాణం పూర్తి చేశా. బిల్లు కోసం నెల రోజులుగా తిరుగుతున్న. రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సహించలేకపోయా. మొత్తం పని చేస్తేనే రూ.20 వేలు కూడా మిగలలే. ఏసీబీ అధికారులను ఆశ్రయించా. -
శివపల్లిలో కోడిపందేలపై.. ఎస్పీ సీరియస్
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎలిగేడ్ మండలం శివపల్లిలో బుధవారం నిర్వహించిన కోడిపందే లపై ఎస్పీ శివకుమార్ సీరియస్ అయ్యారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్.విజయరమణారావుతోపాటు వేలాది మంది ఈ పందేల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుల్తానాబాద్ స్టేషన్‌కు, 8కిలోమీటర్ల దూరంలో ఉన్న జూలపల్లి పోలీసులకు కోడి పందేల గురించి తెలియకపోవడంపై ఎస్పీ మండిపడినట్లు సమాచారం. దీనిపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక సమర్పించాల్సిం దిగా పెద్దపల్లి డీఎస్పీ వేణుగోపాల్‌రావును ఆదేశించినట్లు తెలిసింది. -
ఆకుల భూమన్న.. అమర్ రహే..
పెద్దపల్లి, న్యూస్‌లైన్: దోపిడీ రహిత సమాజం, ప్రజాస్వామిక తెలంగాణ సాధనే ధ్యేయంగా జీవితాంతం పోరాడిన యోధుడు ‘ఆకుల భూమన్న అమర్ రహే’ అంటూ విప్లవాభిమానులు, ఉద్యమకారులు, హక్కుల సంఘాల నాయకులు, బంధుమిత్రులు పిడికితెల్తి నివాళులర్పించారు. మంగళవారం హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భూమన్న అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన జూలపల్లి మండ లం కాచాపూర్‌లో జరిగాయి. భౌతికకాయంపై ఎర్రజెండాలు కప్పి, కంజర డప్పుచప్పుళ్ల మధ్య గురువారం తన ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మూడు కిలోమీటర్ల వరకు కొనసాగింది. బాల్యమిత్రులు, ఉద్యమ సహచరులు, అభ్యుదయవాదులు తమ మిత్రుడి అంతిమయాత్రలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చారు. భూమయ్య పార్థివదేహాన్ని తన ఆరుగురు సోదరులతోపాటు గ్రామస్తులు తమ భుజాలపై ఎత్తారు. ముందు వరుసలో ఎర్రదండాలు.. ఎర్రై దండాలు భూమన్న.. పోరుబాట నడిపిన భూమన్న.. అన్నా చార్బాటల నడిచిన భూమన్న.. అంటూ విప్లవగీతాలతో గ్రామం ఒక్కసారి నాటి రోజులను గుర్తు చేసింది. ఎర్రజెండాలతో కాచాపూర్ ఎరుపెక్కింది. నక్సలైట్ ఉద్యమకాలం నాటి అనుభవాలను, జ్ఞాపకాలను అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మిలిటెంట్లు, విప్లవోద్యమం నుంచి వైదొలగిన మాజీ మిత్రులు నెమరేసుకున్నారు. వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొని భూమన్న మృతదేహంపై పూలదండలు వేసి జోహార్లు అర్పించారు. తీవ్రమైన నిర్భంధం మధ్య విప్లవ కార్యాచరణ నుంచి దూరమై మళ్లీ తెలంగాణ ఉద్యమం పేరిట కలిసిన పాత మిత్రులు ఐదారేళ్లుగా మళ్లీ భూమన్నతో కరచాలనం చేశామని, ఆయన ఇంట్లో భోజనం చేశామని ఒక్కొక్కరు తమ అనుభవాలను పంచుకున్నారు. గ్రామంలో మూడు గంటల పాటు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం చితి వద్ద మరో రెండు గంటలు వివిధ హక్కుల, ప్రజా, ప్రజాస్వామిక సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ కేంద్ర రీజినల్ కమిటీ కార్యదర్శి కటుకం సుదర్శన్ ఉరఫ్ ఆనంద్.. గ్రీన్‌హంట్‌లో భాగంగానే భూమన్న హత్యజరిగిందంటూ పంపిన లేఖను విరసం నేత వరవరరావు చదివి వినిపించారు. పలువురు ప్రజాసంఘాల, పౌరహక్కుల సంఘాల, ప్రజాప్రతినిధులు భూమన్న మరణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పలువురి నివాళి భూమన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రాంలింగారెడ్డి, బిరుదు రాజమల్లు, చాడ వెంకట్‌రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, హక్కుల సంఘాల నాయకులు రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్, నందిని సిద్దారెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మణ్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉస్మానియా జేఏసీ నాయకుడు రాకేశ్, దళిత బహుజన నేత భూషణ్‌రావు, కిషోర్, హమీద్, పద్మకుమారి, నర్సన్న, విజయ్, కోట శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ శంకర్‌ముదిరాజ్, మాధవి, ఖాసిం, జగన్, రవీందర్, నర్సింహారెడ్డి, రాఘవాచారి, డాక్టర్ లక్ష్మణ్, ఏనుగు మల్లారెడ్డి, రమేశ్, రియాజ్, డాక్టర్ ప్రసాద్, హుస్సేన్, వెంకట్‌రెడ్డి, భూమన్న, దాసరి మనోహర్‌రెడ్డి, అర్జున్‌రావు, వెంకటస్వామి, రఘువీర్‌సింగ్, నల్లమనోహర్‌రెడ్డి, చల్ల నారాయణరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, రామరాజు, ఆర్.మోహన్ తదితరులున్నారు. కాచాపూర్ పులిబిడ్డకు జోహార్లు ఉద్యమాల పురిటిగడ్డ కాచాపూర్ పులిబిడ్డగా ఉద్యమానికి ఊపిరి పోసిన భూమన్న మరణంతో ఏర్పడ్డ ఖాళీ భర్తీ చేయలేనిది. ఆయన కలలుగన్న ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం పీడిత ప్రజలు పోరాడాల్సిన అవసరముంది. -విరసం నేత వరవరరావు రాజ్యం హక్కుల కోసం గొంతెత్తి ప్రశ్నించేవారిని హతమార్చడానికి కొత్తరకం కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే భూమన్నను లారీ ప్రమాదం పేరిట హత్య చేయించింది. ప్రజల పక్షాన పోరాడే వారిని హతమార్చడం ద్వారా తమ దోపిడీ విధానాన్ని కొనసాగించవచ్చని పాలకులు వేసిన ఎత్తుగడలే భూమన్న ప్రాణాలు తీశాయి. - తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ వేదవ్యాస్, కార్యదర్శి నలమాసు కృష్ణ రాజ్యం చేసిన హత్యగానే భూమయ్య మరణాన్ని చూడాల్సి వస్తోంది. - న్యూడెమొక్రసీ నేత చలపతిరావు తమ కాళ్లకింది పీఠం కదిలిపోతుందన్న భయంతోనే సీమాంధ్రులు భూమన్నను లారీ ప్రమాదం పేరిట హత్య చేయించారు. -టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ -
అనంతతీరాలకు ఆకుల భూమయ్య
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : అభ్యుదయ భావాలకు ఆశా కిర ణం ఆకుల భూమయ్య ఇకలేరు. కరీంనగర్ జిల్లా ఉద్యమాల చరిత్రకు, ఉపాధ్యాయుల పోరాటాలకు దారిచూపిన భూమయ్య.. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఉద్యమకారులు విషాదంలో మునిగిపోయారు. జూలపల్లి మండలం కాచాపూర్‌కు చెందిన వెంకటయ్య, రత్నమ్మలకు ఏడుగురు కుమారుల్లో భూమ య్య పెద్దవాడు. 1948లో జన్మించారు. 6వ తరగతి వరకు కాచాపూర్‌లో, ఓల్డ్ హెచ్ఎస్సీ పెద్దపల్లిలో చదివారు. పీయూసీ కరీంనగర్లో పూర్తిచేసి, డిగ్రీ జమ్మికుంటలో చదివారు. బీఈడీ చదివే సమయంలో రాడికల్ స్టూడెంట్ యూని యన్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా వ్యవహరించారు. అదే సమయంలో దొరలకు వ్యతిరేకంగా పాలేర్లు తమకు వేతనాలు పెంచాలని చేసిన ఉద్యమానికి మల్లోజుల కోటేశ్వరరావు, లచ్చిరెడ్డితో కలిసి నాయకత్వం వహించారు. తర్వాత 1973లో రామగుండం మండ లం గుడిపెల్లి జయ్యారంలో టీచర్‌గా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు. ఆక్కడినుంచి రాఘవాపూర్, పాత రామగుండం, వెన్నంపల్లి, కరీంనగర్ దగ్గరి కొత్తపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉద్యమాలలో కీలకంగా పనిచేస్తున్నాడని, ఆయనను ఇబ్బందులకు గురి చేయడానికి టీడీపీప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీకి బదిలీ చేశారు. అప్పటినుంచి హైదరాబాద్‌లోనే నివాసముంటున్నారు. ఉద్యమాల చరిత్ర భూమయ్య ఇప్పటి మావోయిస్టు పార్టీ దళపతి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతితో కలసి భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. తపాలాపూర్ జంట హత్యలు, జగిత్యాల జైత్రయాత్రలో ఆయన పాత్రను విప్లవాభిమానులు మర్చిపోరు. విప్లవ భావజాలంతోనే కుటుంబ జీవనంవైపు మళ్లి, ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ తన అభ్యుదయ భావాలను నలుగురిలో నూరిపోశారు. సమాజంలో జరిగే రుగ్మతలు, అవినీతి అక్రమాలను ప్రశ్నించే బాధ్యత ఉపాధ్యాయులకు ఉందని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్)ను స్థాపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఏపీటీఎఫ్ జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి 1992 వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఉపాధ్యాయుల్లోని ఏపీటీఎఫ్ సభ్యులను ప్రభుత్వం మావోయిస్టు పార్టీ (అప్పటి పీపుల్స్‌వార్) సానుభూతిపరులుగా గుర్తించడంతో అనేకసార్లు పోలీసుల నుంచి వేధింపులకు గురయ్యారు. రహస్యంగా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే కారణంతో భూమయ్యను అరెస్టు చేశారు. యువకుడిగా ఉన్న తరుణంలో గణపతి, కిషన్‌జీ, రాజిరెడ్డి, రమణారెడ్డి, లచ్చిరెడ్డి, ఆదిరెడ్డి లాంటి వారితో సంబంధాలు ఉన్నాయని గుర్తించిన పోలీసు లు.. ఆయన కదలికలపై నిఘా కొనసాగించారు. దీంతో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు ఆ సంఘంపై నిఘా కొనసాగించడంతో ఏర్పడ్డ విభేదాల మధ్య డీటీఎఫ్‌కు పురుడుపోశారు. తెలంగాణ ప్రాంతానికి పరిమితం చేసి డీటీఎఫ్ (డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్) అధ్యక్షుడిగా పనిచేస్తూ.. తెలంగాణ ప్రజల ప్రాంతీ య సమస్యలతోపాటు ఉపాధ్యాయ, విద్యార్థుల సమస్యలపై గళం విప్పారు. మళ్లీ డీటీఎఫ్తోపాటు దానికి మద్దతు పలుకుతున్న వ్యక్తులు, కార్యకలాపాలపై పోలీసులు నిఘాపెట్టారు. అయినా భూమయ్య తన కర్తవ్యాన్ని విస్మరించకుండా తెలంగాణ ప్రాంతంలో విద్యా మహాసభల పేరిట సదస్సులు నిర్వహి స్తూ ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, పోలీసుల, రాజ్యహింసను ప్రశ్నించారు. 1994 నుంచి తీవ్ర నిర్బం ధం మధ్య ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యలపై ఉద్యమించారు. వారిలో చైతన్యం తెచ్చారు. డీటీఎఫ్ బాధ్యతల మధ్య తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా 2001లో తెలంగాణ జనసభను స్థాపించారు. దానికి రాష్ర్ట అధ్యక్షుడిగా పనిచేశారు. ఈ ప్రాంతంలో నక్సలైట్లపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న తరుణంలో విచ్చలవిడి ఎన్కౌంటర్ల మధ్య ఆ పార్టీ నష్టపోతున్నా.. తెలంగాణ జనసభను పోలీసులు పీపుల్స్‌వార్ పార్టీ లీగ ల్ సంఘంగా ప్రచారం చేశారు. జనసభ సానుభూతిపరుల్లో న్యాయవాదులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు భూమయ్యతో కలసి జైలుకు సైతం వెళ్లారు. జైలు జీవితంలో సైతం తెలంగాణ వాదాన్ని వినిపించిన భూమయ్య.. రిటైర్డు అయ్యాక కూడా తెలంగాణ ఉద్యమానికి అంకితమయ్యారు. జనసభపై పోలీసు నిర్బంధం పెరగడంతో గద్దర్ సారథ్యంలో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాఫ్రంట్‌కు అధ్యక్షులుగా ఉంటూ వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు మద్దతు పలికారు. ఆయా పార్టీల బూర్జువా విధానాలు, ఎత్తుగడలనూ ప్రశ్నించారు. వరంగల్ ఎన్కౌంటర్లో తప్పించుకున్న భూమయ్య.. తెలంగాణ ప్రాంతంలో ఇటు ప్రత్యేక రాష్ట్ర సాధన, అటు రాజ్యహింసపై భూ మయ్య ఏకకాలంలో తన బాణీ వినిపిం చారు. ఈక్రమంలో భూమయ్యను హతమార్చేందుకు గుర్తుతెలియని వ్యక్తులు అనేకసార్లు ప్రత్నించారు. నాలుగేళ్ల క్రితం వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమ అంశాలపై చర్చించేందుకు మావోయిస్టు పార్టీ నాయకులను కలి సేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు దళంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు దళ సభ్యులు చనిపోయారు. ఆ సమయంలో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడితోపాటు ఆకుల భూమయ్య సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నారు. రెండు కిలోమీటర్ల వరకు పోలీ సులు వెంబడించడంతో భూమయ్య గ్రామానికి చేరుకుని తాను ఆకుల భూమయ్యనని గ్రామస్తులను పరిచ యం చేసుకున్నారు. సురక్షితంగా పోలీసుల బారినుంచి తప్పించుకున్నా రు. భూమయ్య, అరవై ఏళ్ల కాలంలో దాదాపు నలబై ఏళ్లు జనజీవనంలోని మావోయిస్టుగానే ప్రభుత్వం చూసింది. తన స్వగ్రామం పదిరోజుల క్రితం ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆరుగురు సోదరులతో తమ జీవితచరమాం కంలో ఉమ్మడి కుటుంబంగానే గ్రామానికి ఆదర్శంగా నిలిచిపోవాలని భారీ ఇంటినిర్మాణానికి పూనుకున్నారు. ఇంతలోనే ఆయన చనిపోవడం విషాదం. -
అన్నం మీది.. పప్పు మాది
పెద్దపల్లి, న్యూస్‌లైన్ : అంగన్వాడీవాడీ కేంద్రాల్లో పిల్లల కడుపులు మాడుతున్నాయి. రెండు నెలలుగా బియ్యం సరఫరా లేక చిన్నారలకు పౌష్టికారం అందడంలేదు. ఈ దుస్థితి పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో రెండు నెలలుగా కొనసాగుతోంది. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో ఉన్న సుమారు ఆరువందల కేంద్రాలకు బియ్యం సరఫరా నిలిచిపోయింది. దీంతో పిల్లలు ఇళ్ల నుంచి అన్నం తీసుకొచ్చుకుంటే.. అంగన్వాడీ కేంద్రాల్లో పప్పు మాత్రమే వడ్డిస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా నడుస్తున్న అంగన్వాడీల్లో అన్నం పెట్టకపోవడంతో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో మూడు వేలకు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ఒకపూట భోజనానికి బదులు బాలామృతం ప్యాకెట్లు ఇచ్చేందుకు శిశు సంక్షేమ శాఖ కొద్దికాలం క్రితం నిర్ణయించిన విషయం తెల్సిందే. అయితే అవి కూడా అరకొరగా సరఫరా చేస్తున్నారు. దీంతో ఇటు భోజనం.. అటు బాలామృతం( పౌష్టికాహార ప్యాకెట్లు) రెండింటికీ నోచుకోకుండా పోతున్నారు చిన్నారులు. కేంద్రాల్లో మిగులుగా ఉన్న పప్పును ఉడికించి పిల్లలు అన్నం తెచ్చుకుంటే తోడుగా వేస్తున్నారు. కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న గర్భిణులకు నెలనెలా ఇవ్వాల్సిన బియ్యం, పప్పు, నూనెలు రెండు నెలలుగా అందడం లేదు. చిన్నపిల్లలకు బియ్యం, పప్పు, నూనె నిలిపివేసి బాలామృతం ఇస్తామని చెప్పిన అధికారులు.. దానిని సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఇంటినుంచే సద్దిపట్టుకునే వెళ్లాల్సి వస్తోంది. ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో 100 నుంచి 120 మంది పిల్లలు బాలామృతం ప్యాకెట్ల కోసం పేరు నమోదు చేసుకోగా 40 మందికి కూడా సరిపడా సరఫరా చేయడం లేదు. వచ్చిన ప్యాకెట్లను ఎవరికి అందించాలో తెలియక కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 385 అంగన్వాడీ కేంద్రాలకు పేరు నమోదు చేసుకున్న ఒక్కో గర్భిణికి కిలో చొప్పున పప్పు మాత్రమే చేరిందని కార్యకర్తలు అంటున్నారు. పప్పు పంపిణీ చేయడం ద్వారా తాము బియ్యం, నూనె స్వాహా చేశామని మహిళలు అనుమానం వ్యక్తం చేస్తున్నారని వాపోతున్నారు. ఈ విషయమై పెద్దపల్లి, సుల్తానాబాద్ ఐసీడీఎస్ సీడీపీవోలు శాంతకుమారి, సరస్వతిని ప్రశ్నించగా బియ్యం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు.