పెద్దపల్లి, న్యూస్‌లైన్ : అభ్యుదయ భావాలకు ఆశా కిర ణం ఆకుల భూమయ్య ఇకలేరు. కరీంనగర్ జిల్లా ఉద్యమాల చరిత్రకు, ఉపాధ్యాయుల పోరాటాలకు దారిచూపిన భూమయ్య.. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఉద్యమకారులు విషాదంలో మునిగిపోయారు. జూలపల్లి మండలం కాచాపూర్‌కు చెందిన వెంకటయ్య, రత్నమ్మలకు ఏడుగురు కుమారుల్లో భూమ య్య పెద్దవాడు. 1948లో జన్మించారు. 6వ తరగతి వరకు కాచాపూర్‌లో, ఓల్డ్ హెచ్‌ఎస్‌సీ పెద్దపల్లిలో చదివారు. పీయూసీ కరీంనగర్‌లో పూర్తిచేసి, డిగ్రీ జమ్మికుంటలో చదివారు.
బీఈడీ చదివే సమయంలో రాడికల్ స్టూడెంట్ యూని యన్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా వ్యవహరించారు. అదే సమయంలో దొరలకు వ్యతిరేకంగా పాలేర్లు తమకు వేతనాలు పెంచాలని చేసిన ఉద్యమానికి మల్లోజుల కోటేశ్వరరావు, లచ్చిరెడ్డితో కలిసి నాయకత్వం వహించారు. తర్వాత 1973లో రామగుండం మండ లం గుడిపెల్లి జయ్యారంలో టీచర్‌గా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు. ఆక్కడినుంచి రాఘవాపూర్, పాత రామగుండం, వెన్నంపల్లి, కరీంనగర్ దగ్గరి కొత్తపల్లిలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉద్యమాలలో కీలకంగా పనిచేస్తున్నాడని, ఆయనను ఇబ్బందులకు గురి చేయడానికి టీడీపీప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీకి బదిలీ చేశారు. అప్పటినుంచి హైదరాబాద్‌లోనే నివాసముంటున్నారు.
ఉద్యమాల చరిత్ర
భూమయ్య ఇప్పటి మావోయిస్టు పార్టీ దళపతి ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఉరఫ్ గణపతితో కలసి భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నారు. తపాలాపూర్ జంట హత్యలు, జగిత్యాల జైత్రయాత్రలో ఆయన పాత్రను విప్లవాభిమానులు మర్చిపోరు. విప్లవ భావజాలంతోనే కుటుంబ జీవనంవైపు మళ్లి, ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ తన అభ్యుదయ భావాలను నలుగురిలో నూరిపోశారు.
సమాజంలో జరిగే రుగ్మతలు, అవినీతి అక్రమాలను ప్రశ్నించే బాధ్యత ఉపాధ్యాయులకు ఉందని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(ఏపీటీఎఫ్)ను స్థాపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ఏపీటీఎఫ్ జిల్లా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి 1992 వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. ఉపాధ్యాయుల్లోని ఏపీటీఎఫ్ సభ్యులను ప్రభుత్వం మావోయిస్టు పార్టీ (అప్పటి పీపుల్స్‌వార్) సానుభూతిపరులుగా గుర్తించడంతో అనేకసార్లు పోలీసుల నుంచి వేధింపులకు గురయ్యారు. రహస్యంగా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారనే కారణంతో భూమయ్యను అరెస్టు చేశారు. యువకుడిగా ఉన్న తరుణంలో గణపతి, కిషన్‌జీ, రాజిరెడ్డి, రమణారెడ్డి, లచ్చిరెడ్డి, ఆదిరెడ్డి లాంటి వారితో సంబంధాలు ఉన్నాయని గుర్తించిన పోలీసు లు.. ఆయన కదలికలపై నిఘా కొనసాగించారు. దీంతో ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు ఆ సంఘంపై నిఘా కొనసాగించడంతో ఏర్పడ్డ విభేదాల మధ్య డీటీఎఫ్‌కు పురుడుపోశారు. తెలంగాణ ప్రాంతానికి పరిమితం చేసి డీటీఎఫ్ (డెమొక్రటిక్ టీచర్స్ ఫ్రంట్) అధ్యక్షుడిగా పనిచేస్తూ.. తెలంగాణ ప్రజల ప్రాంతీ య సమస్యలతోపాటు ఉపాధ్యాయ, విద్యార్థుల సమస్యలపై గళం విప్పారు. మళ్లీ డీటీఎఫ్‌తోపాటు దానికి మద్దతు పలుకుతున్న వ్యక్తులు, కార్యకలాపాలపై పోలీసులు నిఘాపెట్టారు. అయినా భూమయ్య తన కర్తవ్యాన్ని విస్మరించకుండా తెలంగాణ ప్రాంతంలో విద్యా మహాసభల పేరిట సదస్సులు నిర్వహి స్తూ ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, పోలీసుల, రాజ్యహింసను ప్రశ్నించారు. 1994 నుంచి తీవ్ర నిర్బం ధం మధ్య ఉపాధ్యాయ, విద్యార్థి సమస్యలపై ఉద్యమించారు. వారిలో చైతన్యం తెచ్చారు. డీటీఎఫ్ బాధ్యతల మధ్య తెలంగాణ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా 2001లో తెలంగాణ జనసభను స్థాపించారు. దానికి రాష్ర్ట అధ్యక్షుడిగా పనిచేశారు.
ఈ ప్రాంతంలో నక్సలైట్లపై తీవ్ర నిర్బంధం కొనసాగుతున్న తరుణంలో విచ్చలవిడి ఎన్‌కౌంటర్ల మధ్య ఆ పార్టీ నష్టపోతున్నా.. తెలంగాణ జనసభను పోలీసులు పీపుల్స్‌వార్ పార్టీ లీగ ల్ సంఘంగా ప్రచారం చేశారు. జనసభ సానుభూతిపరుల్లో న్యాయవాదులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు భూమయ్యతో కలసి జైలుకు సైతం వెళ్లారు. జైలు జీవితంలో సైతం తెలంగాణ వాదాన్ని వినిపించిన భూమయ్య.. రిటైర్డు అయ్యాక కూడా తెలంగాణ ఉద్యమానికి అంకితమయ్యారు. జనసభపై పోలీసు నిర్బంధం పెరగడంతో గద్దర్ సారథ్యంలో ఏర్పడ్డ తెలంగాణ ప్రజాఫ్రంట్‌కు అధ్యక్షులుగా ఉంటూ వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న న్యాయమైన పోరాటాలకు మద్దతు పలికారు. ఆయా పార్టీల బూర్జువా విధానాలు, ఎత్తుగడలనూ ప్రశ్నించారు.
వరంగల్ ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న భూమయ్య..
తెలంగాణ ప్రాంతంలో ఇటు ప్రత్యేక రాష్ట్ర సాధన, అటు రాజ్యహింసపై భూ మయ్య ఏకకాలంలో తన బాణీ వినిపిం చారు. ఈక్రమంలో భూమయ్యను హతమార్చేందుకు గుర్తుతెలియని వ్యక్తులు అనేకసార్లు ప్రత్నించారు. నాలుగేళ్ల క్రితం వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమ అంశాలపై చర్చించేందుకు మావోయిస్టు పార్టీ నాయకులను కలి సేందుకు వెళ్లిన సమయంలో పోలీసులు దళంపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు దళ సభ్యులు చనిపోయారు. ఆ సమయంలో వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడితోపాటు ఆకుల భూమయ్య సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నారు. రెండు కిలోమీటర్ల వరకు పోలీ సులు వెంబడించడంతో భూమయ్య గ్రామానికి చేరుకుని తాను ఆకుల భూమయ్యనని గ్రామస్తులను పరిచ యం చేసుకున్నారు. సురక్షితంగా పోలీసుల బారినుంచి తప్పించుకున్నా రు. భూమయ్య, అరవై ఏళ్ల కాలంలో దాదాపు నలబై ఏళ్లు జనజీవనంలోని మావోయిస్టుగానే ప్రభుత్వం చూసింది. తన స్వగ్రామం పదిరోజుల క్రితం ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆరుగురు సోదరులతో తమ జీవితచరమాం కంలో ఉమ్మడి కుటుంబంగానే గ్రామానికి ఆదర్శంగా నిలిచిపోవాలని భారీ ఇంటినిర్మాణానికి పూనుకున్నారు. ఇంతలోనే ఆయన చనిపోవడం విషాదం.
అనంతతీరాలకు ఆకుల భూమయ్య
Published Wed, Dec 25 2013 2:16 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement