పెద్దపల్లి, న్యూస్‌లైన్ : ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. చేసిన పనులను ఎంబీ రికార్డు చేసేం దుకు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడో పంచాయతీరాజ్ ఏఈ.
సుల్తానాబాద్ మండలం తొగర్రాయిలో గ్రామంలోని గాంధీనగర్‌లో మాజీ సర్పంచ్ గుండా మురళి రూ.2లక్షల విలువైన సీసీ రోడ్డు నిర్మించారు. గత నెలలో పనులు పూర్తి కావడంతో బిల్లు కోసం అధికారుల చుట్టూ తిరగగా ఎంబీ రికార్డు చేసేందుకు పంచాయతీరాజ్ ఏఈ మంచాల శ్రీధర్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. తాను అంత ఇచ్చుకోలేనన్నా ఏఈ వినకపోవడంతో రూ.15 వేలు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మురళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం పెద్దపల్లిలోని ఈఈ కార్యాలయానికి వెళ్లిన మురళి ఏఈని కలిశాడు.
కార్యాలయం గేటు వద్ద మురళి నుంచి ఏఈ శ్రీధర్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగుల్లో అవినీతి పెరిగిపోయిందని, అరికట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, విద్యావంతులపై ఉందని చెప్పారు. మిగతా జిల్లాలతో పోల్చితే మన జిల్లాలో అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఇది మంచి పరిణామమని అన్నారు.
పనిచేస్తే ఏం మిగల్లేదు
- మురళి, బాధితుడు
ఎమ్మెల్సీ భానుప్రసాదరావు కోటా నిధుల నుంచి రూ.2 లక్షల విలువ గల సీసీ రోడ్డు డిసెంబర్‌లో మంజూరైంది. వెంటనే నిర్మాణం పూర్తి చేశా. బిల్లు కోసం నెల రోజులుగా తిరుగుతున్న. రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సహించలేకపోయా. మొత్తం పని చేస్తేనే రూ.20 వేలు కూడా మిగలలే. ఏసీబీ అధికారులను ఆశ్రయించా.
ఏసీబీకి చిక్కిన ఏఈ
Published Wed, Feb 12 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement
Advertisement