‘పచ్చ’ నోట్ల కేసులో టీడీపీ ఎమ్మెల్యే పరారీ
హైదరాబాద్, ఆర్టీసీ బస్సులో రూ. 90 లక్షలు ‘పచ్చ’నోట్లు పట్టుబడిన కేసులో నిందితుడైన కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు (టీడీపీ) పరారీలో ఉన్నారు. ఆయనతో పాటు ఈ సొమ్ము వ్యవహారంలో ప్రమేయం ఉన్న నాగరాజు అనే వ్యక్తి కోసం గాలిస్తున్నామని బొల్లారం పోలీసులు తెలిపారు. గురువారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పోలీసుల తనిఖీతో విజయరమణరావు పీఏ రాజమౌళి వద్ద రూ. 90 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే. రాజమౌళికి నగదును అందించిన నాగరాజుతో పాటు విజయరమణరావును పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. రాజమౌళిని అరెస్టు చేశారు. నాగరాజుకు ఈ డబ్బు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి తెచ్చాడు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
రాజమౌళి వాంగ్మూలం: ‘‘పెద్దపల్లి ఎమ్మెల్యే రమణరావు తనకు బేగంపేట్‌లో ఉన్న నాగరాజు ఫోన్ నంబరు (9989396721) ఇచ్చి నగదు తీసుకురావాలని చెప్పాడు. దీంతో నేను గురువారం ఉదయం 9 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ జూబ్లీస్టేషన్‌కు 11.30 గంటలకు చేరుకున్నాను. ఆ తర్వాత నాగరాజుకు ఫోన్ చేశా. అతను నన్ను బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్దకు రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన నాకు నాగరాజు నగదుతో ఉన్న నీలం రంగు పోలో బ్యాగ్ ఇచ్చాడు. దానిని తీసుకుని జూబ్లీ బస్‌స్టేషన్‌కు వచ్చి 3.30 గంటలకు కరీంనగర్ బస్సు ఎక్కాను. ఈ నగదును ఎన్నికల నిధుల కింద కరీంనగర్ జిల్లా టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్తున్నాను...’’ అని రాజమౌళి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.