పోలీసుస్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే లొంగుబాటు
‘పచ్చ’నోట్లు పట్టుబడిన కేసులో విజయరమణారావుకు బెయిల్
హైదరాబాద్, ‘పచ్చ’నోట్ల కట్టలు పట్టుబడిన కేసులో నిందితుడైన టీడీపీ ఎమ్మెల్యే విజయరమణారావు మంగళవారం బొల్లారం పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. 12 రోజుల నుంచి పరారీలో ఉన్న ఆయన తె ల్లవారుజాము 5.30 గంటలకు పీఎస్‌లో ప్రత్యక్షమయ్యారు. లొంగిపోయిన గంటలోపే విజయరమణారావు బెయిల్ పొందారు. ఆ తర్వాత ఎవరి కంటపడకుండా పెద్దపల్లికి వె ళ్లిపోయారు. ఇదే కేసులో మరో నిందితుడు నాగరాజు మంగళవారం సికింద్రాబాద్ కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 10న బొల్లారం సమీపంలో ఎన్నికల అధికారులు కరీంనగర్ బస్సులో తనిఖీ చేస్తుండగా కోరుట్లకు చెందిన రాజమౌళి రూ. 89.87 లక్షల నగదు, టీడీపీ స్టిక్కర్లు ఉన్న బ్యాగుతో పట్టుపబడిన సంగతి తెలిసిందే. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఎమ్మెల్యే విజయరమణారావు పాత్ర వెలుగులోకి వచ్చింది.
ఈ నగదును విజయరమణారావు ఆదేశంతో బేగంపేట్ వద్ద నాగరాజు నుంచి తీసుకుని కరీంనగర్ టీడీపీ కార్యాలయానికి తీసుకువెళుతున్నట్లు రాజమౌళి పోలీసులకు వివరించారు.ఈ కేసులో పోలీసులు నిందితులపై సెక్షన్లు 171(ఈ), 171(బి), 41, 102లను నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఎమ్మెల్యే స్టేషన్‌లో లొంగిపోగా, నాగరాజు కోర్టులో లొంగిపోయారు.అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే: విజయరమణారావు ఎప్పుడు లొంగిపోయేదీ తెలుసుకున్న బొల్లారం పోలీసులు ముందస్తుగానే బెయిల్ పత్రాలు సిద్ధం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలోనే అతను తెల్లవారుజామున 5.30 గంటలకు స్టేషన్‌కు చేరుకునే సరికి ఇన్‌స్పెక్టర్‌తో సహా స్టాఫ్ రెడీగా ఉన్నారు. అతను స్టేషన్‌కు చేరుకున్న గంట లోపే ష్యూరిటీలను సమర్పించి 7 గంటల కల్లా పెద్దపల్లికి బయలుదేరిన విధానం పోలీసుల తీరును ప్రశ్నిస్తోంది.