గన్‌మెన్‌ను సరెండర్ చేసిన ఎమ్మెల్యే!
సీఐని బదిలీ చేయలేదని కినుక
పోలీసు శాఖను తాకిన టీడీపీ వర్గపోరు
విశాఖపట్నం: జిల్లా పోలీసు శాఖలో టీడీపీ ప్రజాప్రతినిధుల పెత్తనం పతాకస్థాయికి చేరింది. టీడీపీలో వర్గపోరు సెగ జిల్లా పోలీసు శాఖకూ తగిలింది. తాము చెప్పినట్లుగా అధికారులను బదిలీ చేయకపోతే ఏకంగా పోలీసు ఉన్నతాధికారులను బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా ప్రజాప్రతినిధులు వెనుకాడటం లేదు. అందుకు తాజా నిదర్శనం యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తన ఇద్దరు గన్‌మెన్‌ను పోలీసులకు సరెండర్ చేయడం. ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఓ సీఐని బదిలీ చేయకపోవడమే ఇందుకు కారణం.
సీఐని బదిలీ చేయమన్న ఎమ్మెల్యే
యలమంచిలి సీఐ హెచ్.మల్లికార్జునరావును బదిలీ చేయాలని ఎమ్మెల్యే పంచకర్ల కొన్ని రోజుల క్రితం పోలీసు ఉన్నతాధికారులపై వత్తిడితెచ్చినట్లు సమాచారం. తన నియోజకవర్గంలో పనిచేస్తూ తన రాజకీయ ప్రత్యర్థి, డెయిరీ చైర్మన్ అడారి తులసీరావుకు సీఐ సన్నిహితంగా ఉండటమే ఆయన ఆగ్రహానికి కారణం. దాంతో ఆయనను బదిలీ చేయాలని ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు గట్టిగా చెప్పారు. కానీ ఆయన మాట చెల్లుబాటు కాలేదు. సీఐని ఉన్నతాధికారులు బదిలీ చేయలేదు. సరైన కారణం లేకుండా అధికారులను బదిలీలు చేసుకుంటూపోతే పోలీసు శాఖ మనోస్థైర్యం దెబ్బతింటుందని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. మరోవైపు ఈ విషయాన్ని ఎమ్మెల్యే పంచకర్ల మంత్రి గంటా దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆయన కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. దాంతో ఎమ్మెల్యే పంచకర్లలో ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది.
భగ్గుమన్న ఎమ్మెల్యే
తాను చెప్పిటన్లు సీఐని బదిలీ చేయకపోవడంపై ఎమ్మెల్యే పంచర్ల తీవ్రంగా స్పందించారు. తన మాట నెగ్గించుకునేందుకు ఆయన ఎదురుదాడికి దిగారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కల్పించిన ఇద్దరు గన్‌మెన్ తనకు అవసరం లేదని వారిద్దరిని సరెండర్ చేశారు. ఈమేరకు వారిని కొన్నిరోజుల క్రితం జిల్లా పోలీసు కార్యాలయానికి పంపించివేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కొన్నిరోజులుగా గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఈలోగా ఎమ్మెల్యే పంచకర్లకు సర్దిచెప్పాలని భావించారు. కానీ తాను చెప్పినట్లుగా సీఐని బదిలీ చేయకుంటే ఇద్దరు గన్‌మెన్ సేవలను ఉపయోగించుకోనని ఎమ్మెల్యే కరాఖండిగా చెబుతున్నారు. ఈ పరిణామం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఇబ్బందికరంగా మారింది. దీనిపై జిల్లా పోలీసు అధికారులు ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి సమాచారం అందించారు. ఈ వ్యవహారం ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో చూడాల్సిందే.