ఆకుల భూమన్న.. అమర్ రహే.. | Akula.Bhumanna passes away | Sakshi
Sakshi News home page

ఆకుల భూమన్న.. అమర్ రహే..

Published Fri, Dec 27 2013 3:53 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Akula.Bhumanna passes away

పెద్దపల్లి, న్యూస్‌లైన్: దోపిడీ రహిత సమాజం, ప్రజాస్వామిక తెలంగాణ సాధనే ధ్యేయంగా జీవితాంతం పోరాడిన యోధుడు ‘ఆకుల భూమన్న అమర్ రహే’ అంటూ విప్లవాభిమానులు, ఉద్యమకారులు, హక్కుల సంఘాల నాయకులు, బంధుమిత్రులు పిడికితెల్తి నివాళులర్పించారు. మంగళవారం హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భూమన్న అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన జూలపల్లి మండ లం కాచాపూర్‌లో జరిగాయి. భౌతికకాయంపై ఎర్రజెండాలు కప్పి, కంజర డప్పుచప్పుళ్ల మధ్య గురువారం తన ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర మూడు కిలోమీటర్ల వరకు కొనసాగింది.

బాల్యమిత్రులు, ఉద్యమ సహచరులు, అభ్యుదయవాదులు తమ మిత్రుడి అంతిమయాత్రలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చారు. భూమయ్య పార్థివదేహాన్ని తన ఆరుగురు సోదరులతోపాటు గ్రామస్తులు తమ భుజాలపై ఎత్తారు. ముందు వరుసలో ఎర్రదండాలు.. ఎర్రై దండాలు భూమన్న.. పోరుబాట నడిపిన భూమన్న.. అన్నా చార్‌బాటల నడిచిన భూమన్న.. అంటూ విప్లవగీతాలతో గ్రామం ఒక్కసారి నాటి రోజులను గుర్తు చేసింది. ఎర్రజెండాలతో కాచాపూర్ ఎరుపెక్కింది. నక్సలైట్ ఉద్యమకాలం నాటి అనుభవాలను, జ్ఞాపకాలను అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ మిలిటెంట్‌లు, విప్లవోద్యమం నుంచి వైదొలగిన మాజీ మిత్రులు నెమరేసుకున్నారు. వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొని భూమన్న మృతదేహంపై పూలదండలు వేసి జోహార్లు అర్పించారు.
 
 తీవ్రమైన నిర్భంధం మధ్య విప్లవ కార్యాచరణ నుంచి దూరమై మళ్లీ తెలంగాణ ఉద్యమం పేరిట కలిసిన పాత మిత్రులు ఐదారేళ్లుగా మళ్లీ భూమన్నతో కరచాలనం చేశామని, ఆయన ఇంట్లో భోజనం చేశామని ఒక్కొక్కరు తమ అనుభవాలను పంచుకున్నారు. గ్రామంలో మూడు గంటల పాటు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం చితి వద్ద మరో రెండు గంటలు వివిధ హక్కుల, ప్రజా, ప్రజాస్వామిక సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ కేంద్ర రీజినల్ కమిటీ కార్యదర్శి కటుకం సుదర్శన్ ఉరఫ్ ఆనంద్.. గ్రీన్‌హంట్‌లో భాగంగానే భూమన్న హత్యజరిగిందంటూ పంపిన లేఖను విరసం నేత వరవరరావు చదివి వినిపించారు. పలువురు ప్రజాసంఘాల, పౌరహక్కుల సంఘాల, ప్రజాప్రతినిధులు భూమన్న మరణంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
 
 పలువురి నివాళి
 భూమన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన వారిలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు రాంలింగారెడ్డి, బిరుదు రాజమల్లు, చాడ వెంకట్‌రెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, హక్కుల సంఘాల నాయకులు రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్, నందిని సిద్దారెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మణ్, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉస్మానియా జేఏసీ నాయకుడు రాకేశ్, దళిత బహుజన నేత భూషణ్‌రావు, కిషోర్, హమీద్, పద్మకుమారి, నర్సన్న, విజయ్, కోట శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ శంకర్‌ముదిరాజ్, మాధవి, ఖాసిం, జగన్, రవీందర్, నర్సింహారెడ్డి, రాఘవాచారి, డాక్టర్ లక్ష్మణ్, ఏనుగు మల్లారెడ్డి, రమేశ్, రియాజ్, డాక్టర్ ప్రసాద్, హుస్సేన్, వెంకట్‌రెడ్డి, భూమన్న, దాసరి మనోహర్‌రెడ్డి, అర్జున్‌రావు, వెంకటస్వామి, రఘువీర్‌సింగ్, నల్లమనోహర్‌రెడ్డి, చల్ల నారాయణరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, రామరాజు, ఆర్.మోహన్ తదితరులున్నారు.
 
 కాచాపూర్ పులిబిడ్డకు జోహార్లు
 ఉద్యమాల పురిటిగడ్డ కాచాపూర్ పులిబిడ్డగా ఉద్యమానికి ఊపిరి పోసిన భూమన్న మరణంతో ఏర్పడ్డ ఖాళీ భర్తీ చేయలేనిది. ఆయన కలలుగన్న ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం పీడిత ప్రజలు పోరాడాల్సిన అవసరముంది.
 -విరసం నేత వరవరరావు
 
 రాజ్యం హక్కుల కోసం గొంతెత్తి ప్రశ్నించేవారిని హతమార్చడానికి కొత్తరకం కుట్రలు చేస్తోంది. అందులో భాగంగానే భూమన్నను లారీ ప్రమాదం పేరిట హత్య చేయించింది. ప్రజల పక్షాన పోరాడే వారిని హతమార్చడం ద్వారా తమ దోపిడీ విధానాన్ని కొనసాగించవచ్చని పాలకులు వేసిన ఎత్తుగడలే భూమన్న ప్రాణాలు తీశాయి.
 - తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ వేదవ్యాస్, కార్యదర్శి నలమాసు కృష్ణ
 
 రాజ్యం చేసిన హత్యగానే భూమయ్య మరణాన్ని చూడాల్సి వస్తోంది.
 - న్యూడెమొక్రసీ నేత చలపతిరావు
 తమ కాళ్లకింది పీఠం కదిలిపోతుందన్న భయంతోనే సీమాంధ్రులు భూమన్నను లారీ ప్రమాదం పేరిట హత్య చేయించారు.
 -టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement