కుప్పకూలిన జీవితాలు
జమ్మలమడుగు/మైలవరం,న్యూస్‌లైన్: తమ గ్రామానికి చెందిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే విషయం తెలుసుకుని అతని మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులు తరలివెళ్లారు. అయ్యో పాపం.. అంటూ విచారవదనంతో నిల్చుని చూస్తున్నారు. అంతలోనే ఉన్నట్లుండి వారు నిల్చున్న ఇంటిపై కప్పు(సన్‌షేడ్) కుప్పకూలింది. దాని కింద నిల్చున్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో మృతి చెందారు. మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన వారు మృత్యువాత పడటంతో ఆగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మైలవరం మండలం నవాబు పేట గ్రామానికి చెందిన సంజీవరాయుడు అనే వ్యక్తి సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని అంత్యక్రియలకు మంగళవారం ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన వారిలో కొందరు అక్కడే ఉన్న ఓ మిద్దెపైకి ఎక్కి సన్‌షేడ్‌పై నుంచి అంత్యక్రియల ఏర్పాట్లను చూస్తున్నారు. ఉన్నట్లుండి సన్‌షేడ్‌తో పాటు దానికి ఆనుకుని ఉన్న పిట్టగోడ కూలిపోయింది. కింద నిల్చుని ఉన్న వ్యక్తులపై గోడ పడటంతో ముగ్గురు అకమ్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఓ చిన్నారి కూడా ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న బూచిగాళ్లసంజమ్మ, శేషమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకుతరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మంది ప్రాణాలను పొగొట్టుకున్నారు.
తల్లీ కూతురు మరణంతో శోకసంద్రమైన కుటుంబం.
గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి పెద్దక్క, కూతురు నవితలు ప్రమాదంలో మృతిచెందారు. భార్య,కూతురును పొగొట్టుకున్న భర్త హరి రోదన వర్ణనాతీతంగా మారింది. తల్లి, చెల్లి మర ణించడంతో షాక్‌కు గురైన కుమారుడు తల్లిని చూసి అమ్మా.. లేవమ్మా అంటూ ఏడుస్తుంటే చూస్తున్న ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిళ్లాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలోని ప్రజలందరూ వారి మృతదేహాలను చూసి కన్నీరు కార్చారు.
అంత్యక్రియలకు వచ్చి..
పొన్నంపల్లె గ్రామానికి చెందిన మడ్డిమారెమ్మ సోమవారం రోడ్డుప్రమాదంలో మృతిచెందిన బంధువు సంజీవరాయుడు అంత్యక్రియలకు వచ్చింది. అయితే అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందింది.
మృతులంతా మహిళలే..
నవాబ్‌పేటలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారిలో అందరు మహిళలే. వీరిలో ఓ బాలిక ఉంది. మృతిచెందిన వారిలో పొన్నంపల్లె గ్రామానికి చెందిన మడ్డిమారెమ్మ(50) నవాబుపేట గ్రామానికి చెందిన శీలం సంజమ్మ(52) రోడ్డవెంకటమ్మ(60) మీనుగ రామాంజనమ్మ(55) సంగపట్నం పెద్దక్క(32) సంగపట్నం న విత(10) భూపతి గురప్ప(50)బూసిగాళ్ల సంజమ్మ(50), శేషమ్మ(50) ఉన్నారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
ఎమ్మెల్యే ఆది
జమ్మలమడుగు,న్యూస్‌లైన్: మైలవరం మండలం నవాబుపేట గ్రామంలో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన న్యూస్‌లైన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సన్‌షేడ్ కూలి 8 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కొలుకునే విధంగా మెరుగైన చికిత్స అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా వచ్చేలా కృషి చేస్తానన్నారు.
నేతల పరామర్శ..
నవాబుపేట గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది గ్రామస్తులు మృతిచెందడంతో బాధితులను పరామర్శించేందుకు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు వచ్చారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ బి.నారాయణరెడ్డి, కాటిరెడ్డి, మైలవరం జెడ్పీటీసీ సుబ్బిరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శివనాథరెడ్డి, కొమెర్ల మోహన్‌రెడ్డి, టీడీపీ నాయకులు లక్ష్మీదేవమ్మ, గిరిధర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, వేమనారాయణరెడ్డి, లక్షుమయ్య యాదవ్, ఏఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఆర్డీఓ జి.రఘునాథరెడ్డి, డిప్యూటి తహశీల్దార్ సాయినాథ్ రెడ్డి తదితరులు పరామర్శించారు.