టీచర్లా... వీధిరౌడీలా !
ఎంఈవో సమక్షంలోనే చెప్పులతో దాడి
పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
మూడేళ్లుగా ఇదే తంతు
ఈ పంతుళ్లు మాకొద్దంటున్న గ్రామస్తులు
చెర్వుమాధవరం(జి.కొండూరు) : అంతర్గ విభేదాలు..ఆధిపత్య పోరు వెరసి చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు రోడ్డు కెక్కారు. సభ్య సమాజం తలదించుకునేలా ఒకరిపై ఒకరు శాపనార్థాలు, నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి చేరి..చివరకు చెప్పులతో కొట్టుకునే వరకు వచ్చారు. సోమవారం మండలంలోని చెర్వుమాధవరం ఎంపీయూపీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విచారణతో మొదలైన గొడవలు...
ప్రస్తుతం 130 మంది విద్యార్థులు, 9 మంది ఉపాధ్యాయులున్న ఈ పాఠశాలలో ఇటీవల ఏంపికయిన విద్యా కమిటీ ఏంపిక సక్రమంగా జరగలేదని, మధ్యాహ్న భోజనానికి సంబంధించి కేటాయిస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయంటూ గ్రామ సర్పంచిప్రసాద్ తోపాటు పలువురు గ్రామస్తులు శనివారం ఎంఈవో వీవీఎన్.రాజేంద్ర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఆయన పాఠశాలలో విచారణకు వచ్చారు.
దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న విభేదాలు బయటపడ్డాయి. హెచ్.ఎంకు మద్దతుగా కొంతమంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మద్దతుగా మరికొంత మంది మద్దుతుగా నిలిచి ఎంఈవోతో గొడవకు దిగారు. హెచ్.ఎం సక్రమంగా బోధించటం లేదని కొంత మంది, ఉపాధ్యాయుల సక్రమంగా బోధించటం లేదంటూ మరికొంత మంది తల్లిదండ్రులు ఎంఈవోకు ఫిర్యాదు చేయటంతో పాటు వారిలో వారే కొట్టుకునేస్థాయికి చేరుకున్నారు.
ఇదే సమయంలో విచారణలో ఉన్న హెచ్.ఎం విజయలక్ష్మీ తోపాటు విద్యా కమిటీ చైర్మన్ నాగమణి ఒక్కసారిగా బయటకొచ్చి సమీపంలో రహదారిపై గ్రామస్తులతో మాట్లాడుతున్న ఉపాధ్యాయుడు సుష్‌కుమార్‌ను చెప్పులతో కొట్టారు. దాదాపు మూడు గంటలకు పైగా ఉపాధ్యాయులు,హెచ్.ఎం, తల్లిదండ్రులు ఘర్షణ పడుతూనే ఉన్నారు.
ఈ లోగా ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఐ హెచ్.ఎం విజయలక్ష్మీతో పాటు ఉపాధ్యాయుడు సుష్‌కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. అయితే సుష్‌కుమార్ తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని, చెప్పలేని మాటలతో ఇబ్బంది పెడుతుండడం వల్లే చెప్పులతో కొట్టాల్సి వచ్చిందని హెచ్.ఎం విజయలక్ష్మీ ఎంఈవోతో పాటు విలేకరులకు తెలిపింది.
అయితే హెచ్.ఎంను ఏవరూ ఇబ్బందులకు గురిచేయడం లేదని మిగిలిన ఉపాధ్యాయులు సుష్‌కుమార్‌కు మద్దతుగా నిలిచి... ఏవరికి వారు గ్రూపులు ఏర్పడ్డారు. మరో వైపు స్టేషన్‌కు చేరిన పంతుళ్ల పంచాయితీతో విసిగిపోయిన పొలీసులు పిటి కేసు నమోదు చేసి ఇరువురినీ కోర్టుకు పంపించారు. దీనిపై ఎంఈవోను వివరణ కోరగా జరిగిన ఘటనకు సంబంధించిన నివే దికను డీఈవోకు పంపించనున్నట్లు తెలిపారు.
అయితే ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరుతో గత మూడు సంవత్సరాలుగా ఈ పాఠశాల వివాదాస్పందంగా నిలుస్తుంది. గతంలోనూ ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో మాజీ ఎంపీపీ లంకా శ్రీ గౌరి దేవి హయాంలో ఒకసారి పంచాయితీ జరిగింది. పాఠశాలలో ఉపాధ్యాయుల తీరు సరిగా లేదని, మొత్తం ఉపాధ్యాయులను మార్చి వేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.