కొన్నింటికి నిధులు లేక ఇక్కట్లు. మరికొన్ని పనులకు సొమ్ములు ఉన్నా అధికారుల ధోరణి వింతగా ఉంటుంది. అవి ఏ పద్దుకింద వచ్చిందో..దాని ఉద్దేశమేమిటో అధ్యయనం చేయరు. ఫలితంగా నిధులు మూలుగుతుంటాయి. ప్రగతి పనులు ఆగుతుంటాయి. ఇదే పరిస్థితి ఇప్పుడు ‘బీఆర్‌జీఎఫ్’ కు ఎదురైంది. దీనికింద జిల్లాకు భారీగానే కేటాయింపులు జరుగుతున్న దాని ఖర్చుకు యంత్రాంగం వెనకడుగు వేస్తోంది. అభివృద్ధికి ఆటంకమవుతున్నా మీనమేషాలు లెక్కిస్తోంది.
పాలమూరు, న్యూస్‌లైన్ : జిల్లాపరిషత్, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరద ప్రకటించిందని ఆనందం వ్యక్తమైనా ఆ సొమ్ములు ఖర్చుచేయక పోవడంతో అభివృద్ధి సాగడంలేదు. బీఆర్‌జీఎఫ్ కింద 2011-12లో సుమారు రూ.30 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్ర హైపవర్ కమిటీ చేసిన సిఫారసు మేరకు కేంద్రం 2017 వరకు ఈ పథకాన్ని కొనసాగిస్తారు.
ఇలా బీఆర్‌జీఎఫ్ రెండో విడత 2012-13 నుంచి 2016-17 వరకు అమలవుతుంది. తొలి విడత 2007-12 వరకు సుమారు రూ.155 కోట్లకు పైగా నిధులు జిల్లాకు సమకూరాయి. పెరిగిన జనాభా ప్రకారం రెండో విడతలో ఏడాదికి రూ.35 కోట్లకు పైగా కేటాయించారు. ఇందుకుగాను 2012-13 ఆర్థిక సంవత్సరానికి రూ.35కోట్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు చేపట్టడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటం ఇబ్బందిగా మారింది.
బీఆర్‌జీఎఫ్ నిధులతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి జిల్లా వ్యాప్తంగా 2,800 వరకు పనులు మంజూరుకాగా అందులో 40 శాతానికిపైగా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీనిపై జిల్లా స్థాయి సమావేశాల్లో చర్చించడం తప్ప పనుల పురోగతిపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. బీఆర్‌జీఎఫ్ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల ప్రహ రీలు, ఆస్పత్రి భవనాలు, సామూహిక భవనాలు, రోడ్లు, మురుగు కాలువలు ఇలా వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు సమృద్దిగా సమకూర్చినా.. మండల స్థాయిలోని అధికారులు పనులు ప్రారంభించ కుండా ఇప్పుడూ అప్పుడూ అంటూ కాలం గడిపేస్తున్నారు. దీంతో రూ.కోట్లు బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్నాయి.
2012-13 ఆర్థిక సంవత్సరానికి చెందిన బీఆర్‌జీఎఫ్ నిధులు రూ.35 కోట్లు ఏడాది మధ్యలో ఇవి జిల్లాకు వచ్చి 8 నెలలు గడుస్తున్నా.. గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లాపరిషత్, మున్సిపాలిటీల పరిధిలోని ఈ నిధుల ద్వారా పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అంచనాలు రూపొందించిన అధికారులు ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించడంపై దృష్టి పెట్టడం లేదు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ తక్కువ కాలంలో పనుల పురోగతిపై అధికారులు ఎటువంటి దృష్టిపెడతారో తెలియడం లేదు.
ప్రజా ప్రతినిధుల్లేకుండానే..!
బీఆర్‌జీఎఫ్ పనులు చేపట్టేందుకు జిల్లా ప్రణాళికా కమిటీ (డీపీసీ)లను ఏర్పాటు చేశారు. డీపీసీలో ప్రణాళికలు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర స్థాయిలో హైపవర్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆ తర్వాతే నిధులు విడుదలవుతాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేస్తూ రావడంతో డీపీసీ లేకుండా పోయింది. జెడ్పీకి స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న కలెక్టర్ ఆమోదంతోనే బీఆర్‌జీఎఫ్ పథకాన్ని కొనసాగించాల్సి వస్తోంది. అయితే జిల్లాకు కెటాయిస్తున్న నిధులను సకాలంలో వినియోగించి సద్వినియోగమయ్యేలా చూడాల్సిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ హెచ్చరించినప్పటికీ పనుల పురోగతి సాధ్యపడటం లేదు.
జిల్లాలో ఇలా...!
జిల్లాలోని 8 మున్సిపాలిటీల పరిధిలో బీఆర్‌జీఎఫ్ ద్వారా 85 పనులచేపట్టేందుకు నిధులు మంజూరు చేశారు. అందులో 49 పనులను ప్రారంభించనేలేదు. మిగిలిన పనులు ఇంకా పూర్తిచేయలేదు. కేవలం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 25 పనులకుగాను 21 పనులు ప్రారంభించలేదు. కొల్లాపూర్ 7, నారాయణపేట 6, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో అయిదు పనుల చొప్పున ప్రారంభానికి నోచుకోలేదు.
గ్రామపంచాయతీల పరిధిలో 1650 పనులకు గాను 1100 వరకు పనులు చేపట్టగా.. మిగిలిన పనులపై సంబంధిత విభాగాలు దృష్టి పెట్టాల్సి ఉంది. మండల పరిషత్ పరిధిలోనూ అదే పరిస్థితి నెలకొంది. రూ.9.69 కోట్లతో 660 పనులను చేపట్టాలని నిర్ణయించగా.. అందులో సగమే పూర్తయ్యాయి. జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో రూ.6.64 కోట్లతో మొత్తం 278 పనులను కేటాయించగా.. అందులో 107 పనులను మాత్రమే చేపట్టారు.
ఆ సొమ్ములేం చేస్తరో..!
Published Thu, Jan 16 2014 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement