సాక్షి, హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ప్రణాళికాబద్ధ్దమైన పట్టణాలను తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపాలిటీల్లో ‘వార్డు ఆఫీసర్ల’ను నియమిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం కేటీఆర్ అధ్యక్షతన పురపాలక శాఖ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. పురపాలక శాఖ పరిధిలో 2,298 ఖాళీలను భర్తీ చేసేందుకు తుది నిర్ణయం తీసుకోవడంతో పాటు పోస్టుల భర్తీకి ముందు సంబంధిత పోస్టులు, ఉద్యోగులను రేషనలైజ్ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగాల భర్తీ ద్వారా పౌర సేవలతోపాటు పట్టణ ప్రగతి కూడా మరింత వేగవంతం అవుతుందన్నారు. ‘ప్రతీ వార్డుకు ఒక అధికారిని నియమించడం దేశంలోనే తొలిసారి. పురపాలక చట్టం నిర్దేశించిన పారిశుద్ధ్యం, హరితహారంతో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడం వార్డు ఆఫీసర్ల నియామకంతో సాధ్యమవుతుంది’అని మంత్రి చెప్పారు. పురపాలక శాఖ, ప్రజలకు మధ్య వారధిలా వార్డు అధికారులు పనిచేస్తారని తెలిపారు.
ఇక ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు..
పురపాలక శాఖ ఇంజనీరింగ్ పనుల్లో జరుగుతున్న అసాధారణ జాప్యాన్ని నివారించేందుకు ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ చెప్పారు. వీరికి సహాయకులుగా ఇద్దరు లేదా ముగ్గురు ఎస్‌ఈలు కూడా ఉండాలనే ప్రతిపాదనను ఆమోదించామన్నారు.
ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ
మున్సిపాలిటీల్లో ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పారదర్శక విధానంలో భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే పౌర సేవలను ప్రజలకు చేరువగా తీసుకెళ్లేందుకు మున్సిపల్ పోస్టులతో పాటు, కేబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీ అంశంపై గతంలో ఆరు పర్యాయాలు అంతర్గత సమావేశాలు నిర్వహించగా, శుక్రవారం జరిగిన సుదీర్ఘ బేటీలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment