సమావేశంలో మాట్లాడుతున్న జింకా వెంకటాచలపతి, షమీంఅస్లాం
– అధికారులను నిలదీసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు
– 24 గంటల్లో ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్
– ఉద్యోగులకు భద్రతకరువైందని ఆవేదన
మదనపల్లె: పట్టణంలోని మున్సిపల్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు, పాలక వర్గం పట్టించుకోకపోవడంపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో బుధవారం ఉదయం 11 గంటలకు చైర్మన్ కొడవలి శివప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, గుండ్లూరి షమీం అస్లాం, బాలగంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ స్థలాలపై నకిలీ డాక్యుమెంట్లు సష్టిస్తున్న వారిపై ఎందుకు తీసుకోవడం లేదని చర్యలు ప్రశ్నించారు. ఇదే తరహాలో పట్టణంలోని తూర్పుకొత్తపేటలోని మున్సిపాలిటీ స్థలాన్ని కొందరు వ్యక్తులు గత నెల 18న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. ఆ స్థలాన్ని పరిరక్షించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని గతనెల 31న జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానించినా ఎందుకు చేయలేదని అధికారులను నిలదీశారు. 24 గంటల్లో ప్రహరీ గోడ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికులపై వేధింపులు తీవ్రమయ్యాయని, దీంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. వారికి భద్రత కల్పించకల్పించాలని పేర్కొన్నారు. లేఔట్లు వేయకుండా నిర్మాణాలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కౌన్సిలర్లు మహ్మద్‌రఫి, జయమ్మ మాట్లాడుతూ పట్టణంలోని వీధులను తెలుపుతూ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు తమ వార్డులకు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అజెండాలోని అన్ని అంశాలకూ సభ్యులు ఆమోదం తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ మున్సిపల్ స్థలం చుట్టూ 24 గంటల్లో ప్రహరీ గోడ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్, కమిషనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.