సచివాలయం ఐదో బ్లాక్ ముందు రోడ్డుపై బైఠాయించిన వృద్ధురాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రికి గోడు చెప్పుకోవడానికి వస్తే అధికారులు అవకాశం కల్పించలేదని ఓ వృద్ధురాలు సోమవారం సచివాలయం ఐదో బ్లాక్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తాను జీవించి ఉండగానే చనిపోయినట్టు కాగితాలు సృష్టించి తన కుమారులు ఆస్తి రాయించుకున్నారని తుళ్లూరు మండలం పెదపరిమికి చెందిన బత్తినేని నరసమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి స్థానిక రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా వీఆర్‌వో సహకరించాడని కన్నీటిపర్యంతమైంది.
వీఆర్‌వో, తన కుమారులు చేసిన మోసంపై ఆర్‌డీవోకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని, తన పాస్‌బుస్ కూడా ఇవ్వడం లేదని విలపించింది. తహసీల్దార్ కూడా తన కుమారులకే మద్దతు తెలుపుతున్నారని, పోలీసులను ఆశ్రయించినా నిరాశే ఎదురైందని ఆవేదన చెందింది. ఈ వయసులో తనకు కనీసం ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేదని, తన కుమారులు రాయించుకున్న 71 సెంట్ల భూమే ఆధారమంటూ వెల్లడించింది. ముఖ్యమంత్రిని కలిసి తన గోడు చెప్పుకోవడానికి వస్తే అధికారులు అవకాశం కల్పించలేదని తెలిపింది. సచివాలయం ముందు వృద్ధురాలు బైఠాయించడంతో భద్రతా సిబ్బంది వెంటనే ఆమెను పంపించి వేశారు.
Comments
Please login to add a commentAdd a comment