ఆధార్‌ మార్చి.. ఆస్తులు కాజేయాలని..  | Gang Wanted Change Aadhaar Card Steel Property Arrested | Sakshi
Sakshi News home page

ఆధార్‌ మార్చి.. ఆస్తులు కాజేయాలని.. 

Published Mon, Aug 22 2022 9:10 AM | Last Updated on Mon, Aug 22 2022 1:52 PM

Gang Wanted Change Aadhaar Card Steel Property Arrested - Sakshi

సాక్షి, అనంతపురం: ఆధార్‌ కార్డులో ఫొటో, ఇతర వివరాలు మార్పు చేసి స్థిరాస్తులను కాజేయాలనుకున్న ఓ‘ ముఠాను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ప్రింటర్, స్కానర్‌ తదితర 12 రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం అనంతపురం డీఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో త్రీటౌన్‌ సీఐ కత్తి శ్రీనివాసులు వెల్లడించారు.

ప్రస్తుతం అరెస్టు అయిన బత్తల శేఖర్‌ (ఆర్‌కేనగర్, అనంతపురం), అచ్చుకట్ల ఇంతియాజ్‌ (అనంతపురం తహసీల్దార్‌ కార్యాలయ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి, కళ్యాణదుర్గం రోడ్డులో నివాసం), కర్తనపర్తి సురేష్‌ (ఆధార్‌ సెంటర్‌ నిర్వాహకుడు, రామకృష్ణ కాలనీ, అనంతపురం) ముఠాలో సభ్యులు. ఈ ముఠాకు సూత్రధారి నగరంలోని ఆర్‌కే నగర్‌కు చెందిన అంపగాని శ్రీనివాసులు. ఇతను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. విలువైన భూములు, స్థలాలున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడేవాడు. నాల్గవ పట్టణ పీఎస్‌ పరిధిలో ఓ వ్యక్తికి సంబంధించిన 14 ఎకరాల స్థిరాస్తి కాజేయాలనుకున్న కేసులో ఈ నెల 12న పోలీసులు రిమాండ్‌కు పంపారు.  

ఇలా వెలుగులోకి.. 
ఈ ముఠా సభ్యులు అనంతపురంలోని సైఫుల్లా బ్రిడ్జి సమీపంలోని కామన్‌ సర్వీస్‌ పాయింట్‌లో ఆధార్‌లో మార్పులు చేసి అమాయకుల ఆస్తులు కొల్లగొట్టేందుకు యతి్నంచేవారు. ఇదే క్రమంలో త్రీటౌన్‌ పీఎస్‌ పరిధిలో ఉండే వృద్ధుడు వెంకటసుబ్బయ్య ఆస్తులపై కన్నుపడింది. వన్‌టౌన్, తదితర ప్రాంతాల్లో ఇతని పేరు మీద విలువైన స్థలాలు ఉన్నాయి. దీంతో శేఖర్‌ అనే టీ స్టాల్‌ నిర్వాహకుడి ద్వారా హకీం అబ్దుల్‌ మసూద్‌ను పావుగా వాడుకున్నారు. వెంకట సుబ్బయ్య ఆధార్‌ కార్డులో హకీం అబ్దుల్‌ మసూద్‌ ఫొటోను మార్చి, అదే అడ్రెస్సుతో కొత్త ఆధార్‌ కార్డుకు ఎన్‌రోల్‌ చేశారు.

ఆధార్‌లో వెంకటసుబ్బయ్య అడ్రెస్సు ఉండడంతో అతని ఇంటికి ఆధార్‌ వెళ్లింది. అప్రమత్తమైన వెంకటసుబ్బయ్య విషయాన్ని త్రీటౌన్‌ సీఐ కత్తి శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కేసు నమోదు చేసి లోతుగా విచారణ చేపట్టగా అసలు బాగోతం వెలుగు చూసింది. ఆదివారం నాల్గవ రోడ్డు ఎక్స్‌టెన్షన్‌లోని శాంతినగర్‌ బోర్డు వద్ద ముఠాలోని ముగ్గురు నిందితులను సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్‌ఐ వలిబాషు అరెస్టు చేశారు. అనంతరం కామన్‌ సరీ్వసు పాయింట్‌లో ఉన్న 12 రకాల వస్తువులను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా రిమాండ్‌కు ఆదేశించారు.  

ఆధార్‌ కార్డులో పేరు మార్పు..  వ్యక్తికి రిమాండ్‌ 
ఆధార్‌ కార్డులో పేరు మార్పు చేసిన కేసులో ఓ వ్యక్తిని వన్‌టౌన్‌ పోలీసులు రిమాండ్‌కు పంపారు. సీఐ రవిశంకర్‌ రెడ్డి తెలిపిన మేరకు...  బుక్కరాయ సముద్రం మండలం చెన్నంపల్లికి చెందిన తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎలాంటి పనులు చేయకుండా తిరిగేవాడు. ఈ క్రమంలో తన ఆధార్‌ కార్డును మార్చి పింఛన్‌ తీసుకునేందుకు కుట్ర పన్నాడు.

ఆధార్‌లో తన పేరు, తండ్రి పేరు, ఇంటి అడ్రస్సుకు బదులుగా నగరంలోని పాతూరుకు చెందిన వెంకటరమణ అనే వృద్ధుడు పేరుతో ఆధార్‌ సెంటర్‌లో దాఖలు చేయించాడు. కొత్త ఆధార్‌ కార్డు సంబంధిత వెంకటరమణ ఇంటికి వెళ్లగా అతను వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చీటింగ్‌కు పాల్పడ్డ తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆదివారం కలెక్టరేట్‌ సమీపంలో అరెస్టు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపారు.   

(చదవండి: తాత అంతిమయాత్రను అడ్డుకున్న మనవడు.. ‘లెక్క తేలేవరకు శవాన్ని ఎత్తనిచ్చేది లేదు’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement