ఆధార్ మార్ఫింగ్ చేసి.. ఫోర్జరీ సంతకాలతో భూమి కొట్టేసి.. రూ.కోట్లు కొల్లగొట్టాలనుకున్న కంత్రీగాళ్లను పోలీసులు కటకటాలకు పంపారు. కేసులో ఐదుగురు నిందితులు హనుమంతాచారి అలియాస్ హనుమంతు, వేణుగోపాల్, రమేష్ రామ్మోహన్‌రెడ్డి, వడ్డే రాముడును రుద్రంపేట వద్ద అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరిపై 420, 467, 468, 470, 471, 120 బీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఎక్సైజ్ కోర్టులో న్యాయమూర్తి ఓంకార్ ఎదుట హాజరుపరిచారు. ఆయన వారికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వెల్లడించారు.
సాక్షి అనంతపురం: అనంతపురంలోని వక్కలం వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వెంకటసుబ్బయ్యకు వెంకటరమణ, నందకిషోర్ సంతానం. వెంకటసుబ్బయ్యకు వివిధ ప్రాంతాల్లో రూ కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అందులో భాగంగా రాచానపల్లి సర్వే నంబర్ 127లో 14.96 ఎకరాల భూమి ఉంది.
రూ.45 కోట్లు విలువ చేసే ఈ భూమిపై అంపగాని శ్రీనివాసులు (పక్ష పత్రిక ప్రతినిధి)పై కన్నుపడింది. ఇతని సమీప బంధువు, వరుసకు బావ అయిన సత్యమయ్య (అంపగాని శ్రీనివాసులు బినామీ), వివిధ టీవీ చానళ్లలో పని చేసే హనుమంతాచారి అలియాస్ హనుమంతు, వేణుగోపాల్, రమేష్ రామ్మోహన్‌రెడ్డితో ముఠాగా ఏర్పడ్డారు.
భూ‘మాయ’ మొదలైందిలా..
వెంకటసుబ్బయ్య స్థిరాస్తిని కాజేయడానికి అంపగాని శ్రీనివాసులు ముఠా పలు దఫాలు ప్రయత్నాలు చేసింది. మొదట వెంకట సుబ్బయ్య కుమారుడైన వెంకటరమణ ఆధార్‌ను బుక్కరాయసముద్రం చెన్నంపల్లికి చెందిన తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫొటోతో మార్చాలని చూశారు. వెంకటరమణ అడ్రస్‌కు తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫొటోతో కూడిన ఆధార్ వెళ్లడంతో వారు అప్రమత్తమై వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 21న తాతిరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
రెండో ప్రయత్నంలో ముఠా సభ్యులు ఆర్‌కే నగర్‌కు చెందిన బత్తల శేఖర్, అచ్చుకట్ల ఇంతియాజ్ (తహసీల్దార్ కార్యాలయ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి), కర్తనపర్తి సురేష్ (ఆధార్ సెంటర్ నిర్వాహకుడు) సహాయంతో వెంకటసుబ్బయ్య ఆధార్‌లోని ఫొటోకు బదులుగా హకీం అబ్దుల్ మసూద్ అనే వ్యక్తి ఫొటోను అప్‌డేట్ చేశారు.
అప్‌డేట్ ఆధార్ కార్డు వెంకటసుబ్బయ్య అడ్రెస్‌కు వెళ్లడంతో ఏదో జరుగుతోందని భావించి.. కుటుంబ సభ్యులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శేఖర్, ఇంతియాజ్‌ను ఈ నెల 21న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
మూడో ప్రయత్నంలో ముఠా సభ్యులు విజయం సాధించారు. టీచర్స్ కాలనీకి చెందిన వడ్డే రాముడు ఆధార్ కార్డులో వడ్డే రాముడు పేరు బదులుగా వెంకటసుబ్బయ్య పేరు, అతని తండ్రి పేరును నవీకరించారు. అదే విధంగా వెంకటసుబ్బయ్య ఫోన్ నంబర్‌కు బదులుగా వడ్డే రాముడు ఫోన్ నంబర్‌నే ఆధార్‌లో పొందుపర్చారు. అడ్రస్ సైతం వడ్డే రాముడిదే ఉంచారు.
ఈ విధంగా వడ్డే రాముడినే వెంకటసుబ్బయ్యగా చూపుతూ ఈ నెల ఒకటో తేదీన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అంపగాని శ్రీనివాసులు బావ అయిన సత్యమయ్యకు 14.96 ఎకరాలు రిజి్రస్టేషన్ చేయించారు. అలా రిజిస్ట్రేషన్ చేయించిన భూమిని పెదవడుగూరుకు చెందిన ప్రస్తుతం నగరంలో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి దేవేందర్‌రెడ్డికి ఎకరా రూ.కోటి చొప్పున విక్రయిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. అందుకోసం దేవేందర్‌రెడ్డి అడ్వాన్స్ రూపంలో సదరు ముఠా సభ్యులకు కోటీ ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు.
పరారీలో రంగనాయకులు..
మూడో ప్రయత్నం సఫలమవడానికి హనుమంతాచారి అలియాస్ హనుమంతు ద్వారా సీన్‌లోకి వచ్చిన రంగనాయకులు అలియాస్ కేశవ (గోల్డ్ స్మిత్) ఆధార్ మార్పులో కీలకంగా వ్యవహరించాడు. ఆధార్ మార్చడానికి, వడ్డే రాముడును తీసుకువచ్చిన రంగనాయకులుకు అంపగాని శ్రీనివాసులు, సత్యమయ్య, హనుమంతు, వేణుగోపాల్, రమేష్, రామ్మోహన్‌రెడ్డి రూ.18 లక్షలు ముట్టజెప్పినట్లు విచారణలో తేలింది. ఆధార్ మార్పునకు సహకరించిన రంగనాయకులు పరారీలో ఉన్నాడు.
ఇలా వెలుగులోకి..
మార్పులతో వచ్చిన ఆధార్ కార్డులు ఇంటికి రావడంతో వెంకటసుబ్బయ్య కుటుంబీకులకు అనుమానం వచ్చింది. వెంకటసుబ్బయ్య కుమారుడైన నందకిషోర్(ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్) రిజి్రస్టేషన్ కార్యాలయానికి వెళ్లి చూడగా ఫోర్జరీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఏడో తేదీన డీపీఒలో జరిగిన ‘స్పందన’ కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పకు నందకిషోర్ ఫిర్యాదు చేశాడు. సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులును ఎస్పీ ఆదేశించారు. డీఎస్పీ లోతుగా విచారణ చేపట్టడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment