నిధులలేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం...వెరసి లక్షలు ఖర్చుచేసి నిర్మించిన భవనాలు కొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. మరి కొన్నిచోట్ల ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వం, అధికారులు వీటివైపు కన్నెత్తి చూడటం లేదు. అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటే వీటి వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. లేదంటే ఇలా అలంకారప్రాయంగా మిగిలిపోకతప్పదు.
సాక్షి, కడప: జిల్లాలో పలుచోట్ల అంగన్‌వాడీ భవనాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. పంచాయతీ భవనాలదీ ఇదే దారి. స్త్రీ శక్తి భవనాల పనులు మూడేళ్లుగా మందకొడిగానే సాగుతున్నాయి. కొన్నిచోట్ల స్థల సమస్య, మరికొన్నిచోట్ల నిధుల లేమితో అసంపూర్తిగా నిలిచిపోయాయి. భవనాలు పూర్తయినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కొన్నిచోట్ల ప్రారంభానికి నోచుకోలేదు. మొత్తం మీద ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు కొద్దిమేర దృష్టి సారించి నిధులు కేటాయించి ఉంటే భవనాలెప్పుడో పూర్తయ్యేవి.
స్త్రీ శక్తి భవనాల నిర్మాణం తీరు ఇదే
జిల్లాలో 2010లో 50 స్త్రీ శక్తి భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కొక్క దానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 25 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. కేటాయించిన నిధులు సరిపోకపోవడంతో కొన్నిచోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 17 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. కలసపాడు, బద్వేలు, రైల్వేకోడూరు ప్రాంతంలో పనులు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. పెద్దముడియం, పులివెందుల, సింహాద్రిపురం, తొండూరులలో పనులు చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు ముందుకు రాలేదు. లింగాలలో స్థల సమస్యతో పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యంగా వీటిపైన ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించకపోవడం వల్లనే ఎనిమిదిచోట్ల పనులు ఆగిపోయే దుస్థితి నెలకొంది.
అయితే 50 స్త్రీ శక్తి భవనాలకుగాను 42 చోట్ల మాత్రమే ప్రారంభం కాగా, మిగిలినవి బేస్‌మెంట్ లెవెల్‌లో 2, లింటల్ లెవెల్‌లో 2, రూఫ్ లెవెల్‌లో 4, శ్లాబ్ పూర్తయినవి 9, పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకోనవి 8 ఉండటం గమనార్హం.
పంచాయతీ భవనాలకు సంబంధించి వీటిని 2010లో ప్రారంభించినప్పటికీ ఇందులో కేవలం 141 మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇందులో 97 భవనాలు పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఆగిపోయాయి.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరంలో స్త్రీ శక్తి భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. జమ్మలమడుగులో ఆర్‌డబ్ల్యుఎస్ భవన నిర్మాణాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలుచోట్ల అంగన్‌వాడీ భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. బద్వేలు నియోజకవర్గంలో దాదాపు ఏడు మండలాల్లో స్త్రీ శక్తి భవనాలు పూర్తి కాలేదు. నియోజకవర్గంలో దాదాపు 20 పాఠశాలల అదనపు తరగతి గదుల నిర్మాణాలు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. వీటి గురించి ఎస్‌ఎస్‌ఏ పట్టించుకోలేదు. కాశినాయన మండలంలో 29 పాఠశాలలకు వంట గదులు మంజూరైనా నిర్మాణానికి మాత్రం నోచుకోలేదు.
రైల్వేకోడూరులో పలుచోట్ల అంగన్‌వాడీ భవనాలు నిధుల లేమితో శ్లాబ్ వరకు పూర్తయినా అసంపూర్తిగానే ఉన్నాయి. శిలాఫలకం దశలోనే స్త్రీ శక్తి భవనం పని ఆగిపోయింది.
రాయచోటిలో రూ. 3 కోట్లతో సెంట్రల్ హాస్టల్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టినా స్థల సమస్యతో ఆగిపోయింది. సుండుపల్లెలో స్త్రీ శక్తి భవనం ప్రారంభానికి నోచుకోలేదు. రాయచోటిలో పాలిటెక్నిక్ కళాశాల భవనాలను కలెక్టర్ ప్రారంభించినా పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఇంకా తలుపులు తెరుచుకోలేదు. మున్సిపల్ భవనాల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
కమలాపురంలో పలుచోట్ల అంగన్‌వాడీ భవనాలు నిర్మాణం మధ్యలోనే ఆగిపోయాయి. స్త్రీ శక్తి భవన్, షాదీఖానా పనులు పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు.
రాజంపేట నియోజకవర్గంలోని సిద్దవటం, రాజంపేటలలో స్త్రీ శక్తి భవనాలు అసంపూర్తిగానే ఉన్నాయి. రాజంపేటలో గ్రంథాలయం, కొత్త మాధవరం, ఒంటిమిట్టలో పాఠశాల అదనపు గదుల నిర్మాణాలు అసంపూర్తిగానే నిలిచిపోవడం గమనార్హం.
పులివెందుల నియోజకవర్గంలో స్త్రీ శక్తి భవనాల పనులు పలుచోట్ల ప్రారంభానికి నోచుకోలేదు.
ఇలా జిల్లా వ్యాప్తంగా వందలాది సంఖ్యలో భవనాల పనులు ప్రారంభమైనప్పటికీ పూర్తి కాకుండానే అసంపూర్తిగా నిలిచిపోయి కోట్లాది రూపాయల నిధులు నిరుపయోగంగా మారాయి.
నిర్లక్ష్యం
Published Wed, Dec 25 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
Advertisement