డబ్బుల్ పని!
కడప కార్పొరేషన్ : ‘తొందరపడి ఓ కోయిల ముందే కూసింది’ అని ఓ సినీ కవి అన్నట్లు రోడ్లు భవనాలశాఖ కార్యాలయంలో ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు టెండరుకు ముందే తొందర పడ్డారు. టెండర్లు నిర్వహించిన తర్వాత చేయాల్సిన పనులను ముందే కానిచ్చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక పని చేయాలంటే ప్రతిపాదనలు తయారు చేసి, టెండర్లు పిలిచి, లెస్ వేసిన కాంట్రాక్టర్‌తో అగ్రిమెంటు చేసుకుని ఆ పనిని అప్పగించాలి. ఈ మేరకు జిల్లాలో దె బ్బతిన్న ఆర్‌అండ్‌బి రోడ్లతోపాటు కడప నగరంలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు ప్యాచ్‌వర్క్ చేయడానికి ఈనెల 5వ తేదీ ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచారు.
దానికి ఈ నెల 22వ తేదీ వ రకూ సమయముంది. ఆ తర్వాత వాటిని ఓపెన్ చేసి లెస్ వేసిన వారికి పనిని అప్పగించాలి. అయితే టెండర్లు పూర్తికాకముందే ఆ ఇంజనీరు నిబంధనలు తుంగలో తొక్కి తన సిబ్బందితోనే మరమ్మతులు చేయిస్తున్నారు. సాధారణంగా ఏ శాఖలోనైనా అత్యవసరమైన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిపై చేయాల్సి ఉంటుంది. రూ. 50 వేలలోపు మాత్రమే ఆ నామినేషన్ పనులకు ఖర్చు చేయాలి.
అత్యవసరం కాకపోయినా సుమారు రూ.6 లక్షల పనులను టెండరు కాక ముందే చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా వర్షాకాలం పూర్తయ్యేనాటి కి రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిని ఉంటాయి. అప్పుడు ఈ ప్యాచ్ వర్క్స్ చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. వర్షాలు ఇంకా పూర్తిగా మొదలే కాలేదు, వర్షాలు వస్తే ఇప్పుడు వేసిన ప్యాచ్‌లు కూడా దెబ్బతింటాయి. మరి ఈ ప్యాచ్‌లు దేనికోసం వేశారో అధికారులకే తెలియాలి. ఉన్నతాధికారులు ప్రశ్నిస్తారనే జంకు లేకుండా పనులు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అసలు కథ వేరే...
టెండరుకు ముందే ఇంజనీరే కాంట్రాక్టర్ అవతారం ఎత్తి పనులు చేయడం వెనుక పెద్ద రహస్యమే దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంజనీరు తన సిబ్బందితో సగం పనులు మాత్రమే చేయించి అందుకు సంబంధించిన మొత్తాన్ని బిల్లుల రూపంలో కాకుండా టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్ ద్వారా రాబట్టుకొంటారని తెలుస్తోంది. తాను చేయాల్సిన పనిని అధికారులు ముందే కొంత పూర్తిచేసినందున ఎంతో కొంత సమర్పించుకొంటే అటు తనకు లాభముంటుందని ఏ కాంట్రాక్టరైనా ఈ డీల్‌కు ఒప్పుకొనే అవకాశం ఉంది. అలాగే మిగిలిన సగం పనులు చేయడానికి కాంట్రాక్టర్ వద్దనుంచి మళ్లీ కమీషన్ తీసుకునే సౌలభ్యం అధికారులకు ఉంటుంది. ఇలా రెండు విధాలుగా కమీషన్లు దండుకోవడానికే అధికారులు ఇలా ముందే పనులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కూడా సదరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ఇలాగే పనులు చేసి కమీషన్లు దండుకున్నట్లు తెలుస్తోంది.
ఆ పనులకు బిల్లులు పెట్టుకోం : డీఈఈ
తమ సిబ్బందితో చేయించిన పనులకు బిల్లులు పెట్టుకోబోమని ఆర్‌అండ్‌బీ డీఈఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. టెండర్లు పూర్తికాకుండానే నిర్వహించిన పనులపై ఆయన ను వివరణ కోరగా పై విధంగా స్పందించారు. వర్షాలు పడటంతో రోడ్లు పాడయ్యాయని, అందుకే ప్యాచ్ వర్క్స్ చేయించామన్నారు. టెండర్ లేకుండా తమ శాఖలో రూ. 10వేల పని కూడా జరగదన్నారు.