ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దొంగలు పడ్డారు.. రూ. లక్షలు విలువ చేసే జనరేటర్‌తో పాటు ఏసీని మాయం చేశారు. దీనిపై పోలీసు కేసు నమోదు చేయాలని స్వయంగా అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే మున్సిపల్ చైర్మన్‌ను కోరుతున్నారు. అయితే నిర్ణయం తీసుకునే విషయంలో చైర్మన్ తటపటాయిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
పట్టణంలోని గురువయ్యతోటలో నివాసం ఉంటున్న శివనాగప్రసాదరెడ్డి ఇంటిపై (26/284-25) రిలయన్స్ సెల్ టవర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2008లో ఇందుకు సంబంధించి రిజిష్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే అప్పట్లో చుట్టుపక్కల వారు ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అనుమతి లేకుండా ఎలా టవర్ నిర్మిస్తారని మున్సిపల్ అధికారులు టవర్ దగ్గర ఏర్పాటు చేసిన జనరేటర్‌తోపాటు ఎయిర్ కండీషన్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని అంచనా. అప్పటి నుంచి ఇవి మున్సిపల్ కార్యాలయ ఆవరణంలోనే ఉండేవి. అప్పటి కౌన్సిలర్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి, ప్రస్తుత కౌన్సిలర్ మార్కాపురం గణేష్‌బాబు వీటిని క్రేన్ సహాయంతో మున్సిపల్ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది.
కొత్తగా పాలకవర్గం ఏర్పాటు కావడంతో తన సమస్యను శివనాగప్రసాదరెడ్డి సతీమణి రాజేశ్వరి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ల ద్వారా విన్నవించారు. శివనాగప్రసాదరెడ్డి తనకు సహచరుడు కావడంతో 32వ వార్డు కౌన్సిలర్ కోనేటి సునంద భర్త భాస్కర్‌రెడ్డి కొద్ది రోజుల కిందట మున్సిపల్ అధికారులను కలిసి జనరేటర్, ఏసీ మిషన్‌లను అప్పగించాలని కోరారు. అందుకు సంబంధించిన పత్రాలు వెతికి అప్పజెప్పుతామని టౌన్‌ప్లానింగ్ సెక్షన్‌లోని నాగేంద్ర తెలిపారు. ఈ విషయంపై ఈనెల 2వ తేదీన రాజేశ్వరి మున్సిపల్ చైర్మన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అయినా సమస్యను నాన్చుతుండటంతో భాస్కర్‌రెడ్డి స్వయంగా చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కార్యాలయ ఆవరణంలో ఉన్న జనరేటర్, ఏసీ మిషన్లు కన్పించడంలేదని సిబ్బంది చైర్మన్‌కు తెలిపారు. విషయం తెలుసుకున్న అధికార పార్టీ కౌన్సిలర్లు ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేయాలని స్వయంగా చైర్మన్‌కు విన్నవించారు. నేడో రేపో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డిని వివరణ కోరగా జనరేటర్, ఏసీ మిషన్లు కనిపించని మాట వాస్తవమేనన్నారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దొంగలు పడ్డారు
Published Thu, Dec 11 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement
Advertisement