ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికలో భాగంగా ప్రభుత్వం వారి సంక్షేమం కోసం పలు పథకాలను ప్రకటించింది. ఇందులో భాగంగా మూడవ విడత రచ్చబండ కార్యక్రమంలో ప్రత్యేకంగా 50 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారికి రుణ మాఫీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి వరకు బకాయిలు ఉన్న వారికి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఇక్కడే గందరగోళం ఏర్పడింది. ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే విషయంపై ఇప్పటి వరకు నిర్ధిష్టమైన సమాచారం విద్యుత్ అధికారులకు అందలేదు.
ప్రతి నెల నిరుపేదల నుంచి విద్యుత్ బిల్లులను ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో ఎక్కడా బకాయిలు కనిపించడం లేదు. సాధారణంగా ఒక్క ఫ్యాన్, ఒక బల్బు లేదా రెండు బల్బులు ఉన్న వారు మాత్రమే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులవుతారు. అయితే పట్టణాల్లో కాకుండా ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ కాలనీలో నివసించే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని మరో వైపు అధికారులు చెబతున్నారు. ఏది ఏమైనా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ పథకం అమలయ్యే పరిస్థితి ఉండదు. సంబంధిత అధికారే స్వయంగా ఈ విషయాన్ని ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 142 మంది అర్హులవుతారని, వీరికి రచ్చబండలో రుణ మాఫీ పత్రాలు ఇవ్వాలని అధికారులు తేల్చారు. తీరా విద్యుత్ సిబ్బంది పలు చోట్ల విచారణకు వెళ్లగా ఇతర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీటర్ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఎస్సీ పేరుతో ఉన్నా ప్రస్తుతం ఆ ఇళ్లల్లో ఇతర వర్గాల వారు నివాసం ఉండటంతో అధికారులు మాఫీని వాయిదా వేశారు. అమృతానగర్‌లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎక్కడా ఈ పథకం అమలుకు నోచుకోలేదు. రచ్చబండ కార్యక్రమంలో కేవలం ప్రచారం కోసం అధికారులు రుణ మాఫీ పత్రాలను తయారు చేసి పంపిణీ చేశారు.
ఈమె పేరు శ్రీరాముల బయమ్మ. ఈమె కూడా ఎస్టీ కాలనీలో నివసిస్తోంది. ప్రతి నెల విద్యుత్ బిల్లు రూ.50 తప్పక చెల్లిస్తోంది. బిల్లు వచ్చిన వెంటనే విద్యుత్ ఉద్యోగి ప్రసాద్ వచ్చి డబ్బులు తీసుకెళుతుంటాడు. వందరూపాయల విద్యుత్ బకాయి మాఫీ చేస్తున్నట్లు రచ్చబండలో అధికారులు పత్రం ఇచ్చారు. ప్రస్తుత నెలకు సంబంధించి రూ.50 బిల్లు చెల్లించాలని విద్యుత్ సిబ్బంది ఈమె ఇంటి వద్దకు బుధవారం రావడం గమనార్హం.
- శ్రీరాముల బయమ్మ
ఈయన పేరు వెంకటేశు. ఎస్టీకాలనీలోనే నివసిస్తున్న ఈయన ప్రతి నెల విద్యుత్ బిల్లును క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాడు. వీరి గుడిసెకు కూడా వంద రూపాయల బకాయి మాఫీ చేస్తున్నట్లు అధికారులు రచ్చబండలో పత్రం ఇచ్చారు. ప్రతి నెలా డబ్బు చెల్లిస్తున్నారు కదా పత్రం ఏమిటని వెంకటేశును ప్రశ్నిస్తే అధికారులు ఇస్తే తీసుకున్నాం తప్ప తమకేమీ తెలియదన్నాడు.
- వెంకటేశు
ఉత్తుత్తి మాఫీ
Published Sat, Nov 30 2013 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement