ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో నిర్మించిన ఇందిరమ్మ కాలనీలో అక్రమాలపై పీడీ సాయినాథ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్యలు చేపట్టారు ఇందిరమ్మ కాలనీ ఫేజ్-1, 2 అర్బన్ పరిధిలో 524, రూరల్ పరిధిలో 129 గృహాల్లో లబ్ధిదారులు లేకపోవడంతో జనవరి 10వ తేదీన పీడీ నోటీసులు జారీ చేశారు.
ఇచ్చిన వారంలోపు లబ్ధిదారులు వారి రికార్డులను సంబంధిత హౌసింగ్ ఈఈ కార్యాలయంలో చూపించి వెంటనే గృహాల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉలిక్కి పడ్డ లబ్ధిదారులు ఉరుకులు పరుగుల మీద ఇందిరమ్మ కాలనీలో మరమ్మతులు ప్రారంభించారు. అయితే 193 మంది లబ్ధిదారులు హౌసింగ్ అధికారులకు ఎలాంటి రికార్డులు సమర్పించలేదు. నెల దాటినా కూడా లబ్ధిదారుల్లో ఎలాంటి స్పందన లేదు.
కలెక్టర్‌కు నివేదిక ఇచ్చిన పీడీ..
దీంతో హౌసింగ్ శాఖలో కదలిక వచ్చింది. స్పందించని లబ్ధిదారుల గృహాలను అక్రమార్కులు ఆక్రమించినట్లు నిర్ధారించుకున్న పీడీ కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. దీంతో కలెక్టర్ 193 గృహాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హౌసింగ్ కార్పొరేషన్ శాఖ అధికారులు ఈ గృహాలను గురువారం నుంచి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు.
రికార్డులను పరిశీలించిన పీడీ, రూ.కోటి దాకా రికవరీకి చర్యలు..
ఈ విషయంపై పీడీ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు ప్రొద్దుటూరు హౌసింగ్ ఈఈ కార్యాలయంలో ఉండి రికార్డులను పరిశీలించారు. రద్దు చేసిన ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు ఆర్‌సీ వరకు మంజూరు చేసిన సుమారు రూ.కోటి దాకా బిల్లులను రికవరీ చేస్తున్నట్లు పీడీ తెలిపారు. 585 ప్లాట్లు మార్పులు జరిగాయని తహశీల్దార్ ఇచ్చిన నివేదికను పరిశీలించినట్లు తెలిపారు. ఇందులో 466 గృహాలకు బిల్లులు కూడా మంజూరు చేశామని, మరో 14 గృహాలకు బిల్లులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. వీరందరికీ తహశీల్దార్ ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్స్‌ను కూడా పరిశీలిస్తున్నామన్నారు. కొందరు అక్రమార్కులు స్పీకింగ్ ఆర్డర్స్‌కూడా నకిలీవి తయారు చేసి గృహాలు అమ్ముతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
అక్రమార్కులకు చెక్!
Published Thu, Mar 6 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
Advertisement
Advertisement