ప్రొద్దుటూరు ధర్మాసుపత్రిలో అధర్మం రాజ్యమేలుతోంది. మానవత్వం మంటగలిసిపోతోంది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య సిబ్బంది పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పురిటినొప్పులతో ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన నిండుచూలాలిని నిర్దయగా గెంటేశారు. రాత్రి వేళ.. దిక్కుతోచని స్థితిలో అమ్మా.. నిరుపేదలం.. మాకు పెద్దాసుపత్రే దిక్కు.. పెద్ద మనసు చేసుకుని దయచూపండమ్మా అంటూ కాళ్లావేళ్లాపడినా వారి హృదయాలు కరగలేదు. యావత్ ప్రపంచం మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఓ అబల పురుడుపోసుకునేందుకు పడిన వేదన ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
ప్రొద్దుటూరు: పురిటి నొప్పులతో ప్రసవం కోసం వెళ్లిన నిండు చూలాలిని జిల్లా ఆస్పత్రి సిబ్బంది గెంటివేసిన హృదయ విదారక సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వీరపునాయునిపల్లి మండలం పాయసంపల్లె గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మకు పురిటి నొప్పులు రావడంతో అక్కడి ఆస్పత్రి సిబ్బంది సలహా మేరకు ప్రసవం కోసం 108 వాహనంలో శుక్రవారం రాత్రి జిల్లా ఆస్పత్రికి వచ్చారు. వీరిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది నిరాకరించారు. అవి పురిటి నొప్పులు కాదుపొమ్మన్నారు. పైగా ఇక్కడ డాక్టర్లు అందుబాటులో లేరని, ఉదయాన్నే రండి అచి చెప్పి వెనక్కు పంపారు. రాత్రి వేళలో సుమారు 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వెంకటలక్షుమ్మతోపాటు ఆమె భర్త, బంధువులు తీవ్ర ఆందోళన చెందారు. కడుపేదలమైన తాము ఎంతో నమ్మకంతో పెద్దాసుపత్రికి వచ్చామని.. తీరా ఇక్కడికి వచ్చాక తమను ఏమాత్రం పట్టించుకోకుండా బయటికి పంపితే ఎలా అని ప్రశ్నించారు.
ఈ రాత్రివేళ తాము ఎక్కడికి వెళ్లాలి.. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లేందుకు తమ వద్ద డబ్బులు కూడా లేవని ప్రాధేయపడ్డారు. వీరి మాటలను ఏమాత్రం పట్టించుకోని సిబ్బంది వారిని వార్డులో కూడా ఎక్కువ సేపు ఉంచకుండా బయటికి పంపారు. తొలి కాన్పు కావడంతో కుటంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఏమవుతుదోనని భయపడ్డారు. కనీసం కడప రిమ్స్‌కు వె ళ్లాలని సిద్ధపడినా ఆస్పత్రి వైద్యుల సంతకం లేనిదే వెళ్లలేమని 108 సిబ్బంది తెలిపారు. ఇలా చాలాసేపు తర్జనభర్జన పడ్డాక చివరకు ఆసుపత్రి ఉన్నతాధికారుల అనుమతితో రాత్రి 11 గంటల ప్రాంతంలో గ ర్భిణిని 108 వాహనంలో వల్లూరు దాటేంత వరకు తీసుకెళ్లి అక్కడినుంచి చింతకొమ్మదిన్నెకు చెందిన 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు.
శనివారం రాత్రి ఆమెకు సిజేరియన్ చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారని ఆమె వెంట వచ్చిన బంధువులు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ విషయంపై మెడికల్ సూపరింటెండెంట్ బుసిరెడ్డిని వివరణ కోరగా ఆస్పత్రిలో మొత్తం నలుగురు గైనకాలజిస్టులకు గాను ఇద్దరే పనిచేస్తున్నారన్నారు. ఇందులో డాక్టర్ భాగ్యమ్మ తమ పిల్లల పరీక్షల కోసం సెలవు పెట్టారన్నారు. ఉన్న ఒక్క డాక్టర్ పగలు ఆపరేషన్లు చేయడంతోపాటు ఓపీని చూస్తున్నారన్నారు.
చాలా దారుణం
ఎంతో నమ్మకంతో ప్రసవం కోసం మా గ్రామం నుంచి వచ్చాం. 108 సిబ్బంది ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఇక్కడి సిబ్బంది మమ్మల్ని వెళ్లిపోవాలని బయటికి పంపారు. రాత్రి వేళ ఇలా చేస్తే మాలాంటి పేదల పరిస్థితి ఏమిటి.
వెంకటేశు, బాధితురాలి భర్త
ఆడ ‘బిడ్డ’ను గెంటేశారు
Published Sun, Mar 8 2015 3:24 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement