ఇష్టం ఉంటే పనిచేయండి.. లేకుంటే వెళ్లిపోండి..
♦ ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
♦ వైద్యసిబ్బందిపై తీవ్ర ఆగ్రహం
వికారాబాద్ రూరల్ : ‘ఇష్టం ఉంటే పని చేయండి.. లేకపోతే ఇక్కడినుంచి వెళ్లి పోండి’ అంటూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యసిబ్బందిపై ఎమ్మెల్యే సంజీవరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం ఉదయం తనిఖీ చేసిన ఆయన పరిసరాలను పరిశీలించారు. అనంతరం వైద్యసిబ్బంది రోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సరైన చికిత్స అందించడం లేదన్నారు. దూర ప్రాంతాలకు నుంచి ఇక్కడి వచ్చి విధులు నిర్వహిస్తున్నారని, ఎప్పుడు వచ్చి.. ఎప్పుడో వెళుతున్నారో ఎవరికీ తెలియడం లేదనీ, అలాంటివారు ఇక్కడికి విధులకు రావద్దనీ, ఇక్కడి నుంచి వెళ్లి పోవాలని మండిపడ్డారు.
చాలామంది నిరుపేదలు ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేని వారు చాలామంది ఉన్నారని, వారికి కనీస వైద్యం కూడా ఇక్కడి వైద్యసిబ్బంది అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులపట్ల నిర్లక్ష్యం వహించినా, రోగులకు సరైన చికిత్స అందించకపోయినా ఊరుకునే ప్రసక్తేఉండదని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.