ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు పట్టణంలోని 14వ రేషన్ షాపు డీలర్‌కు 94.20 క్వింటాళ్ల బియ్యం, 3.30 క్వింటాళ్ల చక్కెర, 660 లీటర్ల పామాయిల్, 600 కిలోల కందిపప్పును పౌరసరఫరాల శాఖ అధికారులు అందించాల్సి ఉంది. ఈ మేరకు డీలర్ డబ్బును కూడా ముందుగా చెల్లించాడు. అయితే ప్రభుత్వం మాత్రం డీలర్‌కు 80.71 క్వింటాళ్ల బియ్యం, 2.81 క్వింటాళ్ల చక్కెర, 568 లీటర్ల పామాయిల్, 559 కిలోల కందిపప్పు మాత్రమే సరఫరా చేసింది.
అలాగే ప్రొద్దుటూరు మండలంలోని 126వ చౌకదుకాణానికి సంబంధించి 69.76 క్వింటాళ్ల బియ్యం, 2.49 క్వింటాళ్ల చక్కెర, 499 లీటర్ల పామాయిల్‌ను సరఫరా చేయాల్సి ఉండగా 59.35 క్వింటాళ్ల బియ్యం, 2.12 క్వింటాళ్ల చక్కెర, 429 లీటర్ల పామాయిల్ మాత్రమే సరఫరా చేశారు. పట్టణంలోని ఓ డీలర్‌కు 418 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ ప్రకారం ప్రతి నెల ఈ డీలర్‌కు 63 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేస్తుండగా ఈనెలలో 53 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు. వీటిని వినియోగదారులకు ఎలా పంపిణీ చేయాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా డీలర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది జిల్లాలోని పలు రేషన్ షాపు డీలర్ల పరిస్థితి. జిల్లాలోని ప్రతి చౌక దుకాణానికి 85 శాతం మాత్రమే సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వం గతనెల 31న ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో రేషన్ షాపు డీలర్లు 15 శాతం మందికి సరుకులు పంపిణీ చేయడం కుదరదు. ఈ నిబంధనల ప్రకారం చూస్తే రేషన్ షాపునకు వెళ్లి ముందు వరుసలో ఉన్నవారికే తప్ప అందరికి సరుకులు అందని పరిస్థితి. ప్రతి నెల 18, 19 తేదీలలో డీలర్లు బ్యాక్‌లాగ్ చూపిస్తే, 22, 23 తేదీలలో జిల్లా అధికారులు రేషన్‌ను కేటాయించేవారు. వెంటనే డీడీలు చెల్లిస్తే 30వ తేదీ లోగా ఆయా రేషన్ షాపుల పరిధిలోని గోదాముల నుంచి అధికారులు రేషన్ షాపులకు సరుకులు పంపిణీ చేసేవారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి డీలర్లు వినియోగదారులకు సరుకులు అందించేవారు. ఏ కారణంగానో ఈ నెల మాత్రం రేషన్ కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది.
గతంలో పండుగలకు అదనపు కోటా ఇచ్చే వారు. ప్రస్తుతం దీపావళి పండుగ గడిచిపోయినా ఇంత వరకు వినియోగదారులకు సాధారణంగా ఇచ్చే సరుకులు అందని పరిస్థితి. జిల్లాలోని 51 మండలాల్లో తెల్లరేషన్ కార్డులు, ఏఏవై, ఏపీ మొత్తం 7,72,449 కార్డులు ఉన్నాయి. ప్రొద్దుటూరు పౌరసరఫరాల శాఖ గోదాము పరిధిలో ప్రొద్దుటూరు మండలంలో 138 రేషన్ షాపులు, రాజుపాళెం మండల పరిధిలో 23 రేషన్ షాపులు, చాపాడు మండల పరిధిలో 32 రేషన్ షాపులు ఉన్నాయి. కాగా సోమవారం వీటిలో కేవలం 5 రేషన్ షాపులకు మాత్రమే గోదాము నుంచి సరుకులు వెళ్లాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది.
పైగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్‌కోటాలో 15 శాతం కోత విధించిన ప్రభుత్వం ఇందుకు కారణాలు కూడా వెల్లడించడం లేదు. దీంతో సరుకులు ఏవిధంగా పంపిణీ చేయాలి, మిగతా వారికి ఏం సమాధానం చెప్పాలని డీలర్లు తర్జనభర్జనలు పడుతున్నారు. ఏఏవై, ఏపీ కార్డులకు మాత్రం 100 శాతం బియ్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మిగతా అన్ని కార్డులకు బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులను కూడా 85 శాతం ప్రకారం సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ప్రభాకర్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే సరుకులు కేటాయించామని తెలిపారు.
ఎప్పుడూ ఇలా జరగలేదు
ఇంత వరకు ఎన్నడూ ఇలా రేషన్‌లో కోత విధించలేదు. వినియోగదారులకు ఎలా అందించాలో అర్థం కావడం లేదు. అందరికి సరుకులు ఇవ్వకపోతే వినియోగదారు లు మాపై కస్సుబుస్సుమంటారు.
- వీరయ్య, డీలర్
వినియోగదారులకు సర్దిచెప్పడం కష్టం
ఇలా తక్కువగా సరుకులు కేటాయిస్తే వినియోగదారులకు తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. వారికి సర్దిచెప్పడం సమస్యే. మిగతా వారికి ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదని ఒత్తిడి చేస్తారు.
- ఫాసిం జగన్, డీలర్