తెగబడిన ఇసుకాసురులు | Municipal staff attack | Sakshi
Sakshi News home page

తెగబడిన ఇసుకాసురులు

Published Mon, May 19 2014 1:52 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Municipal staff attack

మున్సిపల్ సిబ్బందిపై దాడి
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఒక పక్క తాగునీటి సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు తిప్పలు పడుతుంటే, మరో పక్క ఇసుకాసరులు పెన్నానదిలోని బోర్ల వద్ద నుంచి ఇసుకను అక్రమరవాణా చేస్తు లక్షలు గడిస్తున్నారు. అడ్డుకుంటున్న మున్సిపల్ సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మున్సిపల్ వాటర్ వర్క్సు ఏఈ రాజేష్, సిబ్బంది మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి వస్తున్న నీటిని పరిశీలించేందుకు పెన్నానదిలోకి వెళ్లారు.
 
 మైలవరం దక్షిణ కాలువకు గండ్లు కొట్టకుండా వీరు పహారా కాస్తున్నారు. ఈ దశలో పెన్నానది నుంచి రెండు ఇసుక ట్రాక్టర్లు రావడం గమనించారు. ఒక ఇసుక ట్రాక్టర్‌ను ఆపి మున్సిపల్ కార్యాలయానికి తరలించేందుకు మున్సిపల్ సిబ్బంది హరిని ఏఈ ట్రాక్టర్‌లో ఎక్కించారు. అయితే ఇసుక రవాణా చేస్తున్న అక్రమార్కులు దాడులకు దిగబడ్డారు. ట్రాక్టర్‌పైన ఉన్న మున్సిపల్ సిబ్బంది హరిని కిందికి తోసేసి ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. ఈ ట్రాక్టర్ కొత్తదిగా ఉందని నెంబర్ కూడా లేదని సిబ్బంది చెప్పారు. మత్స్యకాలనీకి చెందిన కొండయ్యకు చెందిన మరో ట్రాక్టర్‌ను ఆపే ప్రయత్నం చేయడంతో సిబ్బందితో ఘర్షణకు దిగాడని సిబ్బంది చెప్పారు. దీంతో ట్రాక్టర్‌ను మున్సిపల్ కార్యాలయంలోకి తీసుకురావాలని చెప్పినా కొండయ్య వినిపించు కోకుండా సిబ్బందిని తోసి వేసి ట్రాక్టర్‌కు తీసుకెళ్లాడు. ఈ విషయంపై మున్సిపల్ ఏఈ రాజేష్, సిబ్బంది ఆదివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొండయ్యను స్టేషన్‌కు పిలిపించి విచారణ చేస్తున్నారు. కొండయ్య తనను కూడా సిబ్బంది కొట్టారంటూ పోలీసులకు చెప్పారు. అక్రమార్కులపై కూడా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది అంటున్నారు.
 
 వర్క్ ఇన్‌స్పెక్టర్ల దందా
 ఇసుక అక్రమ రవాణాదారులతో మున్సిపాలిటీ వర్క్ ఇన్‌స్పెక్టర్లు కుమ్మక్కై దందా కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు పెన్నా పరివాహక ప్రాంతాల్లో విధుల్లో లేకున్నా పహరా కాస్తూ ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.5వేలు వసూలు చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. ఒక్కో పాయింట్‌లో 10-15 ట్రాక్టర్లకు వర్క్ ఇన్‌స్పెక్టర్లు దగ్గరుండి ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ వారి నుంచి ప్రతి రోజు వేలాది రూపాయలు దండుకుంటున్నారు. కాంట్రాక్టుపై పనిచేస్తున్న వర్క్ ఇన్‌స్పెక్టర్లను తొలగించేందుకు కమిషనర్ చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement