గడువు పూర్తయినా ఏర్పాటు కాని ఆలయ పాలకమండళ్లు | Due to the governing body of the temple was completed | Sakshi
Sakshi News home page

గడువు పూర్తయినా ఏర్పాటు కాని ఆలయ పాలకమండళ్లు

Published Fri, Nov 1 2013 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

Due to the governing body of the temple was completed

పై ఫొటో ప్రొద్దుటూరులోని ముక్తిరామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన పాలకమండలి గడువు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తయింది. అయితే ఇంత వరకు దేవాదాయ శాఖాధికారులు ఆలయ నూతన పాలకమండలిని నియమించలేదు. ఆలయ పరిపాలన కష్టతరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో అధికారులు అవస్థలు పడుతున్నారు. రోజువారి ధూప, దీప నైవేద్యాలకు కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి. చివరికి ఆలయానికి సంబంధించిన విద్యుత్ బిల్లులను కూడా కార్యనిర్వహణాధికారి డీవీ రమణారెడ్డి ప్రస్తుతం చేతి నుంచి చెల్లిస్తున్నారు. అదే పాలకమండలి ఉండివుంటే ఆలయాభివృద్ధికి సంబంధించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని సమస్యలను పరిష్కరించేవారు.
 
 ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లె యల్లమ్మ దేవాలయం, మైదుకూరు రోడ్డులోని పాండురంగస్వామి దేవాలయం, బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం, తాళ్లమాపురంలోని ఆలయం ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని అనేక ఆలయాల్లో పాలక మండలుల నియామకం జరగలేదు. నిబంధనల ప్రకారం ప్రతి ఆలయ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు మాత్రమే. అనేక ఆలయాలకు సంబంధించి పాలకమండళ్ల గడువు పూర్తయినా కొత్తవారిని నియమించలేదు. జిల్లాలో రూ.2లక్షల ఆదాయం లోపుగల వాటికి కర్నూలులోని డిప్యూటీ కమిషనర్, రూ.2లక్షల నుంచి రూ.25లక్షల ఆదాయం ఉన్న వారికి కమిషనర్, రూ.25లక్షల నుంచి రూ.కోటి ఆదాయం ఉన్న ఆలయాలకు ధార్మిక పరిషత్, రూ.కోటికిపైగా ఆదాయం ఉన్న ఆలయాలకు ప్రభుత్వం నూతన పాలకమండళ్లను నియమించడం ఆనవాయితీ.
 
 గతంలో సంబంధిత అధికారులే నిబంధనల ప్రకారం పాలకమండళ్లను నియమించేవారు. కాగా ప్రస్తుతం ఇందులో రాజకీయ జోక్యం పెరిగింది. తన అనుమతి లేనిదే పాలకమండళ్లను నియమించవద్దని దేవాదాయశాఖ మంత్రి సీ.రామచంద్రయ్య స్వయంగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. పైగా ఏదైనా ఆలయానికి సంబంధించి పాలకమండలి నియామకానికి ప్రతిపాదనలు వస్తే తనకు ఎండార్స్ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా అనేక ఆలయాలకు సంబంధించిన పాలకమండళ్ల నియామకం జరగలేదు. ఉదాహరణకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే లింగారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌పార్టీలో ఉన్నా మంత్రి రామచంద్రయ్యతో సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఈ కారణంగానే నియోజకవర్గం నుంచి ఏ ప్రతిపాదనలు వెళ్లినా మంత్రి మోకాలడ్డుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే పాలకమండళ్ల నియామకం జరగలేదని సంబంధిత అధికారి ఒకరు న్యూస్‌లైన్‌కు తెలిపారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్నా తనకు అనుకూలమైన నేతలు లేకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలు ప్రజాప్రతినిధులుగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో ప్రధానంగా ఆదాయం వచ్చే ఆలయాలు 200కుపైగా ఉండగా ఇందులో 25 ఆలయాలకు మాత్రమే పాలకమండళ్లు ఉన్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈఓలు కూడా సమయానికి అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
 
 మొత్తం జిల్లాలో 16 మంది ఈఓలు పనిచేస్తుండగా ఇద్దరో ముగ్గురో మినహాయిస్తే మిగతా ఈఓలు వారు పనిచేస్తున్న ప్రాంతాలకు చుట్టపు చూపుగా వస్తున్నారనే విమర్శలున్నాయి. అటు పాలకమండళ్లు లేక, ఇటు అధికారులు అందుబాటులో ఉండక ఆలయాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. కర్నూలులోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ఫోన్‌చేసి న్యూస్‌లైన్ ఈ విషయంపై వివరణ కోరగా ఆలయాల పేర్లు చెబితే వివరాలు చెబుతామని తెలిపారు. మంత్రి తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు.
 
 ఇది ప్రొద్దుటూరు పట్టణ నడిబొడ్డున ఉన్న చెన్నకేశవస్వామి ఆలయం. ఈ ఆలయ పాలకమండలికి సంబంధించి చాలా రోజుల క్రితమే గడువు పూర్తయినా ఇంత వరకు నూతన పాలకమండలిని నియమించలేదు. ఆలయానికి సంబంధించి గతంలో ఉన్న ఆలయకమిటీ అధ్యక్షుడు లయన్ ఎంపీవీ ప్రసాదరావునే తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement