
తిరుమల: చంద్రగ్రహణం కారణంగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ తెల్లవారు జామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బుధవారం తెలిపారు. శుక్రవారం రాత్రి 11.54కు చంద్రగ్రహణం ప్రారంభమై శనివారం ఉదయం 3.49 వరకు ఉంటుంది. గ్రహణం సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. శనివారం ఉదయం 4.15కు సుప్రభాతంలో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసి పుణ్యహవచనం నిర్వహిస్తారు.అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చనసేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
27న ఆర్జిత, గరుడ సేవలు రద్దు..
చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవనూ టీటీడీ రద్దు చేసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేస్తున్నారు. తిరిగి శనివారం ఉదయం 9గంటల నుంచి అన్నప్రసాదాలు పునఃప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదాల విభాగం ఆధ్వర్యంలో 20వేల పులిహోర, టమోటా అన్నం ప్యాకెట్లను సాయంత్రం 3 నుంచి 5 వరకు పంపిణీ చేయనున్నారు. తిరుమలలోని ఐదు అన్నప్రసాదాల వితరణ కేంద్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, నాదనీరాజన వేదిక ప్రాంగణంలో అన్నదానం నిర్వహిస్తామన్నారు.
మరోవైపు తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, స్లాట్ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment