venkateshwarara swamy
-
రేపు తిరుమల ఆలయం మూసివేత
తిరుమల: చంద్రగ్రహణం కారణంగా 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 28వ తేదీ తెల్లవారు జామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బుధవారం తెలిపారు. శుక్రవారం రాత్రి 11.54కు చంద్రగ్రహణం ప్రారంభమై శనివారం ఉదయం 3.49 వరకు ఉంటుంది. గ్రహణం సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. శనివారం ఉదయం 4.15కు సుప్రభాతంలో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేసి పుణ్యహవచనం నిర్వహిస్తారు.అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం, అర్చనసేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. 27న ఆర్జిత, గరుడ సేవలు రద్దు.. చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవనూ టీటీడీ రద్దు చేసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి తిరుమలలో అన్నప్రసాద వితరణ కూడా నిలిపివేస్తున్నారు. తిరిగి శనివారం ఉదయం 9గంటల నుంచి అన్నప్రసాదాలు పునఃప్రారంభం కానున్నాయి. భక్తుల సౌకర్యార్థం ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదాల విభాగం ఆధ్వర్యంలో 20వేల పులిహోర, టమోటా అన్నం ప్యాకెట్లను సాయంత్రం 3 నుంచి 5 వరకు పంపిణీ చేయనున్నారు. తిరుమలలోని ఐదు అన్నప్రసాదాల వితరణ కేంద్రాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్, నాదనీరాజన వేదిక ప్రాంగణంలో అన్నదానం నిర్వహిస్తామన్నారు. మరోవైపు తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు, స్లాట్ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. -
గడువు పూర్తయినా ఏర్పాటు కాని ఆలయ పాలకమండళ్లు
పై ఫొటో ప్రొద్దుటూరులోని ముక్తిరామలింగేశ్వర ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన పాలకమండలి గడువు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తయింది. అయితే ఇంత వరకు దేవాదాయ శాఖాధికారులు ఆలయ నూతన పాలకమండలిని నియమించలేదు. ఆలయ పరిపాలన కష్టతరంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో అధికారులు అవస్థలు పడుతున్నారు. రోజువారి ధూప, దీప నైవేద్యాలకు కూడా సమస్యలు ఏర్పడుతున్నాయి. చివరికి ఆలయానికి సంబంధించిన విద్యుత్ బిల్లులను కూడా కార్యనిర్వహణాధికారి డీవీ రమణారెడ్డి ప్రస్తుతం చేతి నుంచి చెల్లిస్తున్నారు. అదే పాలకమండలి ఉండివుంటే ఆలయాభివృద్ధికి సంబంధించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని సమస్యలను పరిష్కరించేవారు. ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు పట్టణంలోని మోడంపల్లె యల్లమ్మ దేవాలయం, మైదుకూరు రోడ్డులోని పాండురంగస్వామి దేవాలయం, బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం, తాళ్లమాపురంలోని ఆలయం ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని అనేక ఆలయాల్లో పాలక మండలుల నియామకం జరగలేదు. నిబంధనల ప్రకారం ప్రతి ఆలయ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు మాత్రమే. అనేక ఆలయాలకు సంబంధించి పాలకమండళ్ల గడువు పూర్తయినా కొత్తవారిని నియమించలేదు. జిల్లాలో రూ.2లక్షల ఆదాయం లోపుగల వాటికి కర్నూలులోని డిప్యూటీ కమిషనర్, రూ.2లక్షల నుంచి రూ.25లక్షల ఆదాయం ఉన్న వారికి కమిషనర్, రూ.25లక్షల నుంచి రూ.కోటి ఆదాయం ఉన్న ఆలయాలకు ధార్మిక పరిషత్, రూ.కోటికిపైగా ఆదాయం ఉన్న ఆలయాలకు ప్రభుత్వం నూతన పాలకమండళ్లను నియమించడం ఆనవాయితీ. గతంలో సంబంధిత అధికారులే నిబంధనల ప్రకారం పాలకమండళ్లను నియమించేవారు. కాగా ప్రస్తుతం ఇందులో రాజకీయ జోక్యం పెరిగింది. తన అనుమతి లేనిదే పాలకమండళ్లను నియమించవద్దని దేవాదాయశాఖ మంత్రి సీ.రామచంద్రయ్య స్వయంగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. పైగా ఏదైనా ఆలయానికి సంబంధించి పాలకమండలి నియామకానికి ప్రతిపాదనలు వస్తే తనకు ఎండార్స్ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా అనేక ఆలయాలకు సంబంధించిన పాలకమండళ్ల నియామకం జరగలేదు. ఉదాహరణకు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే లింగారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌పార్టీలో ఉన్నా మంత్రి రామచంద్రయ్యతో సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఈ కారణంగానే నియోజకవర్గం నుంచి ఏ ప్రతిపాదనలు వెళ్లినా మంత్రి మోకాలడ్డుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే పాలకమండళ్ల నియామకం జరగలేదని సంబంధిత అధికారి ఒకరు న్యూస్‌లైన్‌కు తెలిపారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్నా తనకు అనుకూలమైన నేతలు లేకపోవడం, కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నేతలు ప్రజాప్రతినిధులుగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో ప్రధానంగా ఆదాయం వచ్చే ఆలయాలు 200కుపైగా ఉండగా ఇందులో 25 ఆలయాలకు మాత్రమే పాలకమండళ్లు ఉన్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈఓలు కూడా సమయానికి అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 16 మంది ఈఓలు పనిచేస్తుండగా ఇద్దరో ముగ్గురో మినహాయిస్తే మిగతా ఈఓలు వారు పనిచేస్తున్న ప్రాంతాలకు చుట్టపు చూపుగా వస్తున్నారనే విమర్శలున్నాయి. అటు పాలకమండళ్లు లేక, ఇటు అధికారులు అందుబాటులో ఉండక ఆలయాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. కర్నూలులోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి ఫోన్‌చేసి న్యూస్‌లైన్ ఈ విషయంపై వివరణ కోరగా ఆలయాల పేర్లు చెబితే వివరాలు చెబుతామని తెలిపారు. మంత్రి తమకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఇది ప్రొద్దుటూరు పట్టణ నడిబొడ్డున ఉన్న చెన్నకేశవస్వామి ఆలయం. ఈ ఆలయ పాలకమండలికి సంబంధించి చాలా రోజుల క్రితమే గడువు పూర్తయినా ఇంత వరకు నూతన పాలకమండలిని నియమించలేదు. ఆలయానికి సంబంధించి గతంలో ఉన్న ఆలయకమిటీ అధ్యక్షుడు లయన్ ఎంపీవీ ప్రసాదరావునే తాత్కాలికంగా కొనసాగిస్తున్నారు.