పొదలకూరు/రాపూరు, న్యూస్‌లైన్: ఏసీబీ అధికారులు మరో అవినీతి ఉద్యోగి భరతం పట్టారు. ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న రాపూరు సర్వేయర్ లాలి వెంకటేశ్వర్లును శనివారం పొదలకూరులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ నెల్లూరు డీఎస్పీ జె.భాస్కర్‌రావు కథనం మేరకు..రాపూరు మండలం గండూరుపల్లికి చెందిన రైతు గుడిగుంట బాలకృష్ణయ్య రెండు దశాబ్ధాలుగా ఏడెకరాల పొలాన్ని సాగుచేసుకుంటున్నాడు.
ఆ పొలానికి సంబంధించి తన కుటుంబంలోని నలుగురి పేర్లపై ఏడో విడత భూపంపిణీలో పట్టాలు పొందే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అందులో భాగంగా డిసెంబర్‌లో రాపూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో అధికారులకు అర్జీ సమర్పించాడు. పట్టాలు పొందేందుకు భూమిని సబ్‌డివిజన్ చేయాల్సి ఉండటంతో సర్వేయర్ వెంకటేశ్వర్లును కలిశాడు. ఆయన ఎకరాకు రూ.2,500 లంచం ఇవ్వాలని బాలకృష్ణయ్యను డిమాండ్ చేశాడు. చివరకు రూ.2,200 వంతున ఒప్పందం కుదిరింది.
అడ్వాన్స్‌గా రూ.10 వేలు చెల్లించాలని సూచించాడు. పొలాన్ని సబ్‌డివిజన్ చేయించుకునేందుకు లంచం ఇవ్వడం ఇష్టలేని రైతు బాలకృష్ణయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సర్వేయర్ వెంకటేశ్వర్లును సంప్రదించగా, పొదలకూరులోని తన ఇంటి వద్దకు రావాలని చెప్పాడు. పొదలకూరులోని నాగార్జున స్కూలు సమీపంలో తాను నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద బాలకృష్ణయ్య వద్ద రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.
వెంకటేశ్వర్లును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాపూరులో ఆయన విధులు నిర్వర్తించే కార్యాలయానికి తీసుకెళ్లారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్న అనంతరం నెల్లూరుకు తరలించారు. ఇదిలా ఉంటే భూ కొలతల్లో ఉత్తమ సేవలు అందించింనందుకు ఉత్తమ సర్వేయర్‌గా ఆయన 2012 ఏప్రిల్‌లో సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ కిషోర్, సీసీఎల్‌ఏ ఏకే మహంతి, ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా నుంచి అవార్డు అందుకోవడం గమనార్హం.
సమాచారమందిస్తే చర్యలు:
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగిన పక్షంలో తమకు కచ్చితమైన సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు తెలిపారు. రాపూరు తహశీల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 94404 46184, 94404 46185-189 నంబర్లలో తమను సంప్రదించవచ్చన్నారు. ఆయన వెంట ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీనివాసులు, సుధాకర్, ఖుద్దూస్, షపీ, ఫణి,సత్యనాథ్ తదితరులు ఉన్నారు.
- భాస్కర్‌రావు, డీఎస్పీ
విసిగిపోయా:
నేను సాగుచేసుకుంటున్న పొలాన్ని సబ్‌డివిజన్ చేయమని పలుమార్లు ప్రాధేయపడ్డాను. లంచం ఇవ్వనిదే చేయడం కుదరదని సర్వేయర్ తేల్చి చెప్పాడు. అంత పెద్దమొత్తం ఇచ్చుకోలేనని, తగ్గించాలని పదేపదే అడిగితే కొద్దిగా తగ్గించాడు. ఆయన తీరుతో విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది.
- బాలకృష్ణయ్య, రైతు
ఎవరో చేసిన దానికి
నేను బలయ్యా:
పొలాన్ని సబ్‌డివిజన్ చేయకుండా గతంలో పనిచేసిన సర్వేయర్లు వేధించినట్టు తెలుస్తోంది. వారు మాట్లాడుకున్న లంచం మొత్తాన్ని నాకు ఇవ్వడంతో నేను బలయ్యాను. రైతును నేను వేధించలేదు, తిప్పుకోనూ లేదు.
- వెంకటేశ్వర్లు, సర్వేయర్
ఏసీబీ వలలో అవినీతి చేప
Published Sun, Feb 2 2014 3:37 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement