ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని ఆర్‌ఐపీఈ భానుమూర్తి రాజు అన్నారు. స్థానిక రాయలసీమ వ్యాయామ కళాశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన 59వ రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్-19 అథ్లెటిక్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమేనని, ఓటమికి కుంగిపోకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లి విజయం సాధించాలన్నారు. నిత్యం క్రీడా సాధన చేస్తూ నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు.
రాయలసీమ వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయన్నారు. రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి క్రీడా పోటీలలో ప్రతిభ చాటిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉందన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడా కారులను తీర్చిదిద్ది ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయాలన్నారు. ఈ పోటీలలో 22 జిల్లాలకు చెందిన 400 మందికిపైగా క్రీడాకారుల మధ్య 100, 400, 800 మీటర్లు, షాట్‌పుట్, జావిలిన్‌త్రో, లాంగ్‌జంప్, హైజంప్ తదితర విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఆద్యంతం ఈ పోటీలు ఆసక్తికరంగా జరిగాయి. ఈ పోటీలలో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను ఖమ్మం జిల్లా సాధించింది.
బాలుర విభాగంలో వ్యక్తిగత విభాగంలో చాంపియన్ షిప్‌ను కృష్ణా జిల్లాకు చెందిన యశ్వంత్ కుమార్, బాలికల విభాగంలో హైదరాబాద్‌కు చెందిన విశాలాక్షి సాధించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జూనియర్ కళాశాలల వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి వెంకటరెడ్డి, వ్యాయామ సంచాలకులు ఓబుళరెడ్డి, జోనల్ స్థాయి పాఠశాలల కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ సుబ్బరాజు, బాషా అథ్లెటిక్ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్‌బాషా, రాయలసీమ వ్యాయామ కళాశాల అధ్యాపకులు, వ్యాయామ అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
క్రీడా స్ఫూర్తిని అలవరచుకోవాలి
Published Thu, Dec 26 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement