కొత్తపేట(ప్రొద్దుటూరు) : ప్రొద్దుటూరు మండలం పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ఉన్న కొత్తపేట గ్రామంలో ఆదివారం భారీ ఎత్తున పెద్దమ్మతల్లి దేవర మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 1000 ఓట్లు గల ఈ గ్రామంలో ఈ ఉత్సవాల నిర్వహణకు గ్రామస్తులు రూ.కోటికిపైగా వెచ్చిస్తున్నారు. వివరాలిలావున్నాయి. ప్రొద్దుటూరు పట్టణానికి కూతవేటు దూరంలో జమ్మలమడుగు రోడ్డులో కొత్తపేట గ్రామం ఉంది. పూర్వం గ్రామంలో ప్రతి ఏటా పెద్దమ్మతల్లి దేవరను నిర్వహించేవారు. అయితే గ్రామ పరిస్థితుృ దష్ట్యా దేవరను నిలిపివేశారు. 1958లో చివరగా ఈ ఉత్సవం నిర్వహించారు.
కాగా గ్రామస్తులంతా చర్చించుకుని మళ్లీ గ్రామంలో ఈ ఉత్సవాలను నిర్వహించాలని ప్రయత్నించారు. మూడేళ్లుగా ఈ విషయం నానుతోంది. అయితే ఎన్నికల నేపథ్యంలో రెండేళ్లుగా ఉత్సవాన్ని పోలీసుల సూచన మేరకు నిలిపివేశారు. ఏది ఏమైనా ఈ మారు నిర్వహించాలని పూనుకున్నారు. ఈ మేరకు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయానికి సున్నాలు వేశారు. ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవానికి హాజరు కావాలని గ్రామంలోని పలువురు ఆహ్వాన పత్రాలను కూడా పంచిపెట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఊరంతా పందిళ్లు వేసి ఏర్పాట్లు చేశారు. ఇంటింటా అమ్మవారికి సమర్పించేందుకు పొట్టేళ్లు సిద్ధం చేసుకున్నారు. 10 పొట్టేళ్లను కూడా ఏర్పాటు చేసుకున్న వారు ఉన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి 500కుపైగా పొట్టేళ్లను గ్రామానికి తీసుకురాగా మొత్తం ఖర్చు కోటి రూపాయలకుపైగా వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. బంధుమిత్రుల రాకతో ప్రతి ఇంటా సందడి నెలకొంది.
ప్రముఖుల రాక
దేవర ఉత్సవానికి హాజరు కావాలని గ్రామస్తులు ప్రముఖులను ఆహ్వానించారు. ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఆదినారాయణరెడ్డి, రఘురామిరెడ్డి, అంజాద్‌బాష, రవీంద్రనాథ్‌రెడ్డితోపాటు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, టీడీపీకి సంబంధించి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లేల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి తదితరులు హాజరు కానున్నారు.
ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఉత్సవం నిర్వహించారు
తాను ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజిలో ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో గ్రామంలో చివరగా దేవర ఉత్సవాన్ని నిర్వహించారు. 1958 నుంచి దేవర నిర్వహించలేదు. చాలా కాలం తర్వాత నిర్వహిస్తుండటంతో అంతా సందడిగా ఉంది.
- గుద్దేటి వెంకటసుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్
విదేశాల్లో ఉన్నవారు సైతం వచ్చారు
గ్రామానికి సంబంధించి పలువురు విదేశాల్లో ఉద్యోగ రీత్యా స్థిరపడ్డారు. ఎందరో హైదరాబాద్‌లాంటి నగర ప్రాంతాల్లో ఉన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటివారు తమ కుటుంబ సభ్యులను, బంధుమిత్రాదులను ఆహ్వానించారు. విదేశాల్లో ఉన్న వారు సైతం వచ్చారు.
- వెల్లాల కుమార్‌రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్
అందరినీ ఆహ్వానించాం
దేవర మహోత్సవానికి హాజరు కావాలని ఇరు పార్టీల వారిని ఆహ్వానించాం. గ్రామస్తులంతా బంధు మిత్రులను పిలుచుకున్నారు. గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. అందరూ ఆహ్వానితులే.
- రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి,
గ్రామ కమిటీ సభ్యుడు
గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది
దేవర మహోత్సవంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. చాలా రోజులుగా ప్లాన్ చేసి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వాహనాల పార్కింగ్‌కు కూడా ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేశాం.
-కృష్ణారెడ్డి
ఊరంతా పందిళ్లు.. ఇంటింటా సందడి
Published Sun, Apr 19 2015 3:31 AM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM
Advertisement
Advertisement