చేయి చేయి కలిపారు...
ప్రొద్దుటూరు: రోడ్డులో కంకర రాళ్లను ఏరివేస్తున్న వీరంతా కూలీలు కాదు.. ప్రొద్దుటూరు మండలం మీనాపురం గ్రామస్తులు.. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ఆదివారం తమ గ్రామానికి చెందిన రోడ్డును బాగు చేసుకున్నారు. ప్రభుత్వం నంగనూరుపల్లె నుంచి ఈ గ్రామం మీదుగా గండ్లూరు కొట్టాలు వరకు రోడ్డు నిర్మించేందుకు గత ఏడాది రూ.30లక్షల నిధులు మంజూరు చేసింది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ రోడ్డు నిర్మాణానికి అధికారులు సిద్ధపడ్డారు. అయితే కాంట్రాక్టర్ ముందుగా మెటల్‌రోడ్డును నిర్మించి మధ్యలో వదిలేశారు. ఇందుకు గాను రూ.20లక్షల వరకు బిల్లు చేసుకున్నట్లు సమాచారం. తర్వాత ఈ రోడ్డు గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల బెడద కారణంగా మెటల్‌రోడ్డు దెబ్బతిని గులకరాళ్లు లేచాయి.
దీంతో నడవలేని పరిస్థితి. సైకిల్ ఎక్కడ పంచర్ అవుతుందోనని విద్యార్థుల ఆందోళన. ఆటోడ్రైవర్లు కూడా గ్రామానికి వచ్చే వారు కాదు. ప్రాధేయపడితే రూ. 200 డిమాండ్ చేసేవారు. గ్రామస్తులు ప్రత్యామ్నాయంగా పక్కనున్న రైతు పొలంలో దారి తయారు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రైతు పొలం సాగు కోసం రోడ్డును పూడ్చివేశాడు. ఇక లాభం లేదనుకుని గ్రామస్తులు ఒక్కసారిగా చేయి చేయి కలిపారు. ఆదివారం అందరూ ఏకమై కిలోమీటరు పొడవునా ఉన్న గులకరాళ్లను ఏరివేసి రోడ్డును బాగు చేసుకున్నారు.