ప్రొద్దుటూరు: దళారుల ప్రమేయం లేకుండా రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బును కూడా రైతులకు 48 గంటల్లో చెల్లించడం జరుగుతుందని స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ప్రస్తుతం పంట నూర్పిళ్ల సీజన్ ప్రారంభమైనా జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో గత్యంతరం లేక రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోతున్నారు. వారు చెప్పిన ధరలకు ధాన్యాన్ని అమ్మక తప్పడంలేదు. కనీసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వం గ్రామాల్లో రైతులకు ఇంతవరకు వెల్లడించలేదు. తమకు దళారులే దిక్కు అని రైతులు భావిస్తున్నారు.
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ఈ ఏడాది సరికొత్త నిబంధనలను అమలు చేసింది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ గత నెల 25న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రేడ్ ఏ ధర క్వింటాలు రూ.1400, కామన్ వెరైటీ ధర రూ.1360లుగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి నిర్ణయించింది. ఇందుకు సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో డ్వాక్రా సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 48 గంటల్లో ఆ రైతులకు డబ్బు ఇవ్వాలని నిబంధనలు విధించారు.
ఈ విషయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. అసలు నిబంధనలు ఎలా ఉంటాయో తెలియకపోయినా ఇప్పటి వరకు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మీరు అధైర్య పడాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా ఇచ్చేవారు లేరు. వాస్తవానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర రైతుకు గిట్టుబాటు కాకపోయినా ఈ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి ప్రభుత్వ ధర కన్నా మార్కెట్ ధరే అధికంగా ఉండేది. అయితే వ్యాపారులు క్రమేపి ధరలు తగ్గిస్తూ వస్తున్నారు.
వారం రోజుల క్రితం గ్రేడ్ ఏ ధాన్యం (జిలకర మసూర) 8 బస్తాల ధర రూ. 9,500 ఉండగా శుక్రవారం రూ.8,800లకు తగ్గించారు. ప్రస్తుతం వర్షం ప్రభావం కనిపిస్తుండటంతో రైతులు త్వరితగతిన పంట నూర్పిళ్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు, దళారులు ధాన్యం ధరలు తగ్గించారు. పైగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో దళారులు చెప్పిందే గ్రామాల్లో సాగుతోంది. గతంలో రైతులు చాలా మంది నేరుగా అమ్మకుండా నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో ధరలు పెరుగుతాయని రైతులు విశ్వసించడం లేదు. ఉన్న వరకు పండిన వెంటనే అమ్ముకోవడమే మేలని భావిస్తున్నారు.
జనవరి నెలాఖరులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
జిల్లాకు సంబంధించి 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తమ టెక్నికల్ సిబ్బంది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లకు వెళ్లారు. ఈనెలాఖరులో వారు తిరిగి వస్తారు. జిల్లాలో ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. వచ్చే నెలాఖరులో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.
- బుల్లారావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
దళారులను ఆశ్రయించాల్సిందే
అధికారులెవ్వరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పలేదు. గ్రామంలోకి దళారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నాలుగు ఎకరాల్లో పండిన ధాన్యాన్ని బస్తా రూ.1100లతో అమ్ముకున్నా. ధర గిట్టుబాటు కాక నష్టపోతున్నాం.
- గంజికుంట వెంకట సుబ్బారెడ్డి, రైతు
అడిగేవారు లేరని ...
ప్రస్తుతం పండించిన ధాన్యానికి డిమాండ్ లేదు. వ్యాపారులు పెద్దగా రావడం లేదు. దీంతో ఉన్న ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఒక్కో రోజు ఒక్కో ధరను మార్కెట్‌లో నిర్ణయిస్తున్నారు.
- సహదేవరెడ్డి, రైతు
అమ్మాలంటే.. పాతాళంలో
Published Sat, Dec 20 2014 2:47 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement