సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఐదేళ్లుగా దుర్భిక్షం తాండవమాడుతోంది. వరుణుడు ముఖం చాటేయడంతో ఏటా సాగు విస్తీర్ణం పడిపోయింది. కొద్దోగొప్పో నీరున్న బోర్లలో కూడా ఏళ్లకు ఏళ్లు చినుకు జాడలేక నీళ్లు పాతాళంలోకి ఇంకిపోయాయి. పంటల సాగు, బోర్ల కోసం చేసిన అప్పులు తడిసిమోపెడయ్యాయి. తమ దుస్థితిని తలచుకుని బయటపడే మార్గం కానరాక రైతన్నల కళ్లు చెమర్చుతున్నాయి. కూలీలతో కలిసి సన్న, చిన్నకారు, పెద్ద రైతులు కూడా బతుకుదెరువు కోసం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు.
అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి పెరుగుతున్న వలసలు దయనీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మరోపక్క అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సాగు ఇంత సంక్షోభంలో కూరుకుపోయినా సర్కారు చేష్టలుడిగి చూస్తోంది. కాయలు మంచి ధర పలుకుతున్న సమయంలో రాయలసీమలో బొప్పాయి, బత్తాయి తోటలు నీళ్లు లేక నిలువునా ఎండిపోతున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి దుస్థితే ఉంది. బోర్లు ఇంకిపోవడం, కొత్తవి తవ్వినా నీటి చుక్క జాడ లేకపోవడంతో ఎండిపోతున్న తోటలను చూసి రైతులు పడుతున్న ఆవేదన మాటలకు అందని విధంగా ఉంది.
పంటలు కోల్పోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిన సర్కారు విపత్కర పరిస్థితుల్లో మొండిచేయి చూపుతోంది. 2018 ఖరీఫ్, రబీ సీజన్లలో దుర్భిక్షం వల్ల పంటలు కోల్పోయిన రైతులకు నేటికీ నయాపైసా కూడా పెట్టుబడి రాయితీ విదల్చలేదు. గత ఏడాది ఖరీఫ్‌లో 450 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులున్నా 316 మండలాలనే ఆ జాబితాలో చేర్చి చేతులు దులుపుకొంది. ఎక్కడైనా సరే వర్షాభావ పరిస్థితులుంటేనే పంటల సాగు విస్తీర్ణం పడిపోయి పొలాలు బీళ్లుగా మారతాయి.
కానీ మన రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయినా వ్యవసాయ రంగం ప్రగతి బాట పట్టిందంటూ సర్కారు ప్రచారం చేసుకుంటోంది. పైర్లు ఎండిపోయి రైతులు నష్టపోతే వ్యవసాయ రంగం బాగుందని చెప్పడంపై నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ) ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం కరువును దాచిపెడుతోందని పేర్కొంటున్నారు.
ఎటుచూసినా ఎండిన పంటలే...
రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనుచూపు మేరలో బీడు భూములు, ఎండిన పైర్లే కనిపిస్తున్నాయి. బొప్పాయి, బత్తాయి, అరటి తదితర పండ్ల తోటలు నీరందక మాడిపోతుండటంతో రైతులు కుమిలిపోతున్నారు. తినడానికి మేత దొరక్క పశువులు బక్కచిక్కిపోతున్నాయి. వాటి అవస్థ చూడలేక కబేళాలకు విక్రయిస్తున్నారు.
పాతాళంలో నీళ్లు..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,550 గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. 11 నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో ఎద్దడి తీవ్రంగా ఉంది. వైఎస్సార్, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితి ఆందోళన రేపుతోంది. గత ఏడాది మార్చి 10వతేదీతో పోల్చితే ఈ ఏడాది అదే తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సగటు భూగర్భ జలమట్టం 6.59 అడుగులు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఇక రాయలసీమలో సగటున 20.04 అడుగుల మేర భూగర్భ జలమట్టం తగ్గింది. చిత్తూరు జిల్లాలో ఏకంగా 31.20 అడుగుల మేర నీటి జాడ తగ్గడంతో పాతాళానికి పడిపోయాయి.
రైతుల బిల్లులు రూ.12,630 కోట్ల పెండింగు
విలాసవంతులకు ఉద్దేశించిన అయిదు నక్షత్రాల హోటళ్లకు, విమాన ప్రయాణాలకు రాయితీలు ఇస్తున్న చంద్రబాబు సర్కారు రైతులను వారి ఖర్మకు వదిలేస్తోంది. గత రెండేళ్లలో ప్రకృతి విపత్తుల బారిన పడ్డ వారికి చెల్లించాల్సిన పెట్టుబడి రాయితీ 2018 –19 రబీతో కలిపి చూస్తే రూ. 2800 కోట్లు పైగా బకాయిలు ఉన్నాయి. 2018 –19 ఖరీఫ్, రబీ సీజన్లలో పంటలు కోల్పోయిన రైతులకు నయాపైసా కూడా పెట్టుబడి రాయితీ చెల్లించలేదు.
రుణమాఫీకి రెండు విడతల బకాయిలు రూ.8,830 కోట్లు, వ్యవసాయ పరికరాల బిల్లులు రూ.800 కోట్లు, మొక్కజొన్నలకు రూ.200 కోట్లు కలిపి రైతులకే రూ.12,630 కోట్ల బిల్లులను సర్కారు పెండింగులో పెట్టింది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి పెట్టుబడి రాయితీ బకాయిలు రూ.2,350 కోట్లుంది. కానీ ఇది తన హయాంలోకి రాదంటూ చంద్రబాబు సర్కారు ఎగనామం పెట్టింది. మరి ఈ సర్కారు హయాంలో రూ.2800 కోట్లు పైగా పెట్టుబడి రాయితీ చెల్లించకుండా ఎందుకు పెండింగులో పెట్టారని రైతు సంఘాల ప్రతినిధులు నిలదీస్తున్నారు.
రూ.లక్షకు పైగా నష్టపోయా...
‘ఎకరం రూ.10 వేల చొప్పున 9 ఎకరాలు కౌలుకు తీసుకుని మొదట వాము పంట వేశా. రూ.40 వేలు పెట్టుబడి పెట్టినా వానల్లేక పంటంతా ఎండిపోయింది. ఆశ చావక మళ్లీ రూ.60 వేల దాకా పెట్టుబడి పెట్టి పప్పుశనగ సాగు చేశా. విత్తినప్పటి నుంచి చినుకు జాడ లేక పైరంతా ఎండిపోయింది. ఎన్నడూ లేని విధంగా కరువు ఉంది. ఈ ఏడాది నయాపైసా ఆదాయం రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కు తెలియడం లేదు.
– రామాంజినేయులు, కౌలు రైతు, గిరిగెట్ల, కర్నూలు జిల్లా
రూ. 2,350 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగవేత
టీడీపీ 2014లో అధికారంలోకి రాగానే అప్పటివరకు రైతులకు చెల్లించాల్సిన రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఎగ్గొట్టింది. ఈ అన్యాయం చాలదన్నట్లుగా 2014 ఖరీఫ్‌లో రూ.375 కోట్ల పెట్టుబడి రాయితీకి కోత పెట్టింది. ఆ ఏడాది 566 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నట్లు కలెక్టర్లు నివేదిక పంపగా ప్రభుత్వం కేవలం 238 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించినా తదుపరి భేటీలో రూ.692.67 కోట్లకు కుదించింది.
కుట్రను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’
2015 ఖరీఫ్‌లో పంటల సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయినా, సాగుచేసిన పంటలు ఎండిపోయినా తొలుత కేవలం 196 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, రైతు సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో చివరకు మరో 163 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఇక 2016లో 450కిపైగా దుర్భిక్ష మండలాలున్నప్పటికీ 301 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు తీవ్ర అన్యాయం చేసింది.
2017 ఖరీఫ్‌లో సాగు 35.92 లక్షల హెక్టార్లకే పరిమితమైనా, చినుకు జాడలేక ఇందులో సగం పంటలు ఎండిపోయినా కరువే లేదని బుకాయించింది. ఇలా ఐదేళ్లలో దుర్భిక్షం తక్కువ చేసి చూపించడం ద్వారా పెట్టుబడి రాయితీ ఎగవేత రూపంలో రైతులకు రూ. 6,550 కోట్లకుపైగా నష్టం కలిగించినట్లేనని స్పష్టమవుతోంది. 2016లో రూ. 600 కోట్ల పెట్టుబడి రాయితీ ఎగవేత కుట్రను ‘సాక్షి’ బట్టబయలు చేయడంతో మెమోను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
– లేబాక రఘురామిరెడ్డి, సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment