'విద్యార్థి దశ నుంచే వచ్చారని తెలుసుకోవాలి'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26 నుంచి గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేయనున్న నేపథ్యంలో దీక్ష స్థల ఎంపిక కోసం పార్టీ నేతలు సమాలోచన జరిపారు. ఈ సమావేశానికి పార్టీ నేతలు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఆర్కే, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై చైతన్యం తెచ్చేందుకు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
కానీ ప్రభుత్వం మాత్రం అణిచివేత దోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కూడా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చారనే విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం చోద్యం చూస్తోందని అన్నారు.
మంత్రి నారాయణను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రిశితేశ్వరి కేసులో ప్రిన్సిపల్ బాబురావుపై ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికే రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం రైతు భరోసా యాత్రలు అంటూ వెళ్లడం సిగ్గు చేటని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70శాతం భూములు పంటపొలాలు లేక ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ముందుగా రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే భరోసా యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు.