ప్రొద్దుటూరు/ ఎర్రగుంట్ల, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు మండలం కానపల్లెలో సుమారు 3వేలకు పైగా పశువులు ఉన్నాయి. కొందరు కర్మాగారాలకు పాలు తరలిస్తుండగా అనేకమంది రైతుల ద్వారా సేకరించి ద్విచక్రవాహనాలలో పట్టణాలలో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని సత్యనారాయణరెడ్డి అనే ఏజెంట్ ఈడాది ఏప్రిల్ నెలలో 15 రోజులకు 3389 లీటర్ల పాలు సేకరించారు. అక్టోబర్‌లో 795 లీటర్లు మాత్రమే సేకరించాడు. పాలదిగుబడి పడిపోవడానికి గాలికుంటు వ్యాధి ప్రభావమే ప్రధాన కారణమని పాడిరైతులు తెలుపుతున్నారు. రోజూ 10 లీటర్ల్లు పాలు పోసే రైతు ప్రస్తుతం అందులో సగం కూడా పోయలేని పరిస్థితి. దీంతో వీరి జీవనం దుర్భరంగా మారింది. కేసీ కెనాల్‌కు గత ఏడాది సాగునీరు విడుదల చేయకపోవడంతో జిల్లాలో వరిపంట సాగు చేయలేదు. ఈ కారణంగా పశుగ్రాసం కొరత ఏర్పడింది.
దీనికి తోడు ఈ ఏడాది కూడా వర్షాలు ఆలస్యంగా కురిశాయి. దీంతో కరువు పరిస్థితుల కారణంగా రైతులకు పశుపోషణ భారంగా మారింది. పచ్చి గడ్డిలేని కారణంగా పోషకులు ఎంత ఖర్చుపెట్టినా, చివరగా భారీ వర్షాలు పడినా నెలరోజులు పశువులు మేయలేని పరిస్థితి ఏర్పడిందని ప్రొద్దుటూరు మండలం కానపల్లె గ్రామానికి చెందిన మహిళా పాడిరైతు ‘న్యూస్‌లైన్’కు తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు నెల 1 నుంచి 15వ తేదీ వరకూ, రెండో విడతగా వచ్చే ఫిబ్రవరి 15 నుంచి నెలాఖరు వరకూ గ్రామాల్లో గాలికుంటువ్యాధి నివారణకు టీకాలు వేయాల్సి ఉంది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న సిబ్బంది చాలాచోట్ల సకాలంలో స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మేత తినలేని పరిస్థితుల్లో వ్యాధి ప్రబలి గ్రామాల్లో పశువులు మృత్యువాత పడ్డాయి.
సమస్య తీవ్రతను గుర్తించిన ఉన్నతాధికారులు ఉద్యమంతో సంబంధం లేకుండా వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. అయితే కొన్నిచోట్ల ఈ ఆదేశాలను సిబ్బంది ఖాతరు చేయకపోగా మరికొన్నిచోట్ల స్పందించే సమయానికి పుణ్యకాలం కాస్తా దాటిపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వ్యాధి నివారణ కోసం టీకాలు వేస్తే సాధారణంగానే పాడి ఉత్పత్తి సగానికి తగ్గిపోతుంది. పశువైద్యాధికారులు స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రామాభివృద్ధి సమాఖ్య జిల్లా డిప్యూటీ డైరక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ అనేక కారణాల వల్ల గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 50 శాతం పాలదిగుబడి తగ్గిన మాట వాస్తవమేనన్నారు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉందన్నారు
చిన్నదండ్లూరును దెబ్బతీసిన గాలికుంటు
ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరు గ్రామం వ్యవసాయానికి, పాడిపరిశ్రమకు పెట్టిందిపేరు. ఫ్యాక్షన్ గ్రామమైన చిన్నదండ్లూరులో ప్రస్తుతం గ్రామస్తులందరూ వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమతో అభివృద్ధి చెందుతున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి లో సుమారు 5 నుంచి 10 దాక గేదెలు ఉన్నాయి. గాలికుంటు వ్యాధిసోకి వారం రోజుల్లోనే 50 గేదెలు మృతి చెందాయని పాడిరైతులు వాపోతున్నారు. వ్యాధి సోకడంతో పశువులు నడవలేకపోతున్నాయన్నారు.
వ్యాధి నివారణకు సరైన మందులు దొరకడం లేదన్నారు. ఇంత జరుగుతున్నా పశువైద్యులు గ్రామానికి వచ్చిన పాపాన పోలేదన్నారు.
ఉత్పత్తి తగ్గిపోయింది
పలు కారణాల వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గింది. పాడి రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదు.
- గుమ్మళ్ల సత్యనారాయణరెడ్డి, ఏజెంటు
గాలికుంటు వ్యాధి తీవ్రంగా ఉంది
ఎక్కడ చూసినా గాలికుంటు వ్యాధి ఉంది. గతంలో 3.5 లీటర్ల పాలుపొస్తుండగా ప్రస్తుతం అర లీటరు మాత్రమే పోస్తున్నాను. పాల ధరలు కూడా రైతులకు గిట్టుబాటు కావడం లేదు.
-భైరవేశ్వరుడు
మా పశువులకు సోకింది
మా ఇంటిలోని పశువులకు కూడా గాలికుంటు వ్యాధి సోకింది. ఎలాగోలా కష్టపడి టీకాలు వేయించాం. పాల దిగుబడి తగ్గింది. పశువులు బాధపడుతుంటే చూడలేకపోతున్నాం.
- సుబ్బమ్మ
వ్యాధి నిరోధక టీకాలు వేస్తాం..
గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉన్నాయి. గ్రామాలలో పశువైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించాం.
-వెంకట్రావు, జేడీ, జిల్లా పశుసంవర్థక శాఖ
‘గాలికుంటు’తో బెంబేలు
Published Sat, Nov 16 2013 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement