జిల్లాలో శనగ పంటను సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గోదాముల్లో బస్తాలు మూలుగుతున్నాయి. రైతుల కష్టాలను తీర్చాల్సిన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
చిన్నశెట్టిపల్లె (ప్రొద్దుటూరు),న్యూస్‌లైన్: ఇది రాజుపాళెం మండలం చిన్నశెట్టిపల్లె గ్రామంలో రైతులు సాగు చేసిన శనగ పంట. ఇక్కడ సుమారు 7వేల ఎకరాల మెట్ట పొలం ఉంది. ఎకరం కూడా మాగాణి పొలం లేదు. గ్రామంలో దాదాపు 200 గృహాలు ఉండగా ప్రతి ఇంటికి ఎంతో కొంత పొలం ఉంది. గతంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేసి నష్టపోయిన గ్రామ రైతులు క్రమేణా ఆ పంటలకు స్వస్తి పలికి శనగ పంటను సాగు చేయడం మొదలు పెట్టారు.
గత 15 ఏళ్లుగా శనగ పంటను సాగు చేస్తున్నారు. పంట సాగు కోసం యాంత్రీకరణ విధానాన్ని కూడా నేర్చుకున్నారు. మందుల పిచికారికి, పంట సాగుకు ఇంత చిన్న గ్రామంలో వంద ట్రాక్టర్లు ఉన్నాయంటే ఇక్కడ యాంత్రీకరణ ప్రభావం ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. శనగ పంట సాగు కారణంగా ఈ గ్రామం జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. వందల బస్తాల్లో పంట పండించే రైతులు కూడా గ్రామంలో ఉన్నారు. గ్రామంలో రెండు మూడు కుటుంబాలకు వంద ఎకరాలకు పైగా పొలం ఉమ్మడి ఆస్తిగా ఉంది. ఇలాంటి గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి మారుతోంది.
గిట్టుబాటు ధర ఏదీ..!
పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో శనగ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2012 సంవత్సరంలో క్వింటాలు శనగలను రూ.5,400 వరకు రైతులు అమ్మారు. గత ఏడాది వీటి ధర రూ.3,900లు మాత్రమే ఉండటంతో గ్రామంలో ఇంకా సుమారు 30 శాతం మంది రైతులు నష్టాలకోర్చుకోలేక పంట దిగుబడిని గోదాముల్లో నిల్వ చేశారు. ప్రతి ఏడాది ఎకరాకు 8 బస్తాల వరకు దిగుబడి వస్తుండగా గత ఏడాది 3, 4 బస్తాలకే పరిమితమైంది. అసలు దిగుబడి రాని రైతులు కూడా ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. కాగా ప్రస్తుతం శనగలను రూ.2,800లకు కూడా అడిగే నాధుడు కరువయ్యాడు. ఇదిలావుండగా ఇంకో వారం పది రోజుల్లో రబీ సీజన్‌లో సాగు చేసిన పంట దిగుబడి చేతికందుతుంది. గత ఏడాది పండించిన పంట దిగుబడినే అమ్ముకోలేక రైతులు నష్టపోతుండగా ప్రస్తుతం మళ్లీ పంట చేతికందుతుండటంతో గ్రామ రైతులు పునరాలోచనలో పడ్డారు.
ఈ విషయాని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గతంలో పంట సాగుకు ఖర్చులు తక్కువగా ఉండగా కూలీల కొరత కారణంగా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలు తగ్గడం పట్ల రైతులు నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఇప్పట్లో ధర పెరుగుతుందన్న నమ్మకం కనిపించడం లేదు. దీంతో ఇన్నేళ్లు శనగ పంటపైనే ఆధారపడిన వీరు ఈ ఏడాది పంట మార్పిడి చేయాలనే యోచనలో ఉన్నారు. గత ఏడాది జిల్లాలో 1,12,194 హెక్టార్లలో శనగ పంటను సాగు చేయగా, ఈ ఏడాది 94,904 హెక్టార్లలో సాగు చేసిన శనగ పంట చేతికందనుంది. ప్రస్తుతం జిల్లాలో శనగ పంట సాగు చేసిన రైతులంతా గిట్టుబాటు ధర లేక దిగాలుగా ఉన్నారు.
గిట్టదయ్యా!
Published Sun, Jan 19 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement