ఎంత కష్టం.. ఎంత నష్టం... | how much like | Sakshi
Sakshi News home page

ఎంత కష్టం.. ఎంత నష్టం...

Published Sat, Apr 18 2015 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

how much like

ఈ మహిళా రైతు పేరు సానె చంద్రమ్మ. ప్రొద్దుటూరు మండలం సీతంపల్లె గ్రామానికి చెందిన ఈమె 10 ఎకరాల్లో వరి పంట సాగు చేసింది. ఎకరాకు రూ.25 వేలు చొప్పున పంట సాగుకు రూ.2.50 లక్షలు ఖర్చు పెట్టింది. పంట పొట్ట దశకు చేరుకుంది. రేపోమాపో కోత కోయాల్సి ఉండగా అకస్మాత్తుగా వచ్చిన గాలి వానతో పంట మొత్తం నేలవాలింది. నాలుగు రోజులుగా అలాగే ఉండటంతో నేలవాలిన పంట నుంచి మోసులు వచ్చాయి. ‘పంట చేతికి వచ్చి ఉంటే రూ.4 లక్షల దాకా వచ్చేది. మోసులొచ్చి అంతా కుళ్లిపోయింది. పశుగ్రాసానికి కూడా పనికొచ్చేలా లేద’ంటూ ఆమె వాపోయింది.
 
 ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు మండలం సీతంపల్లెలో ఆదివారం గాలి వానకు 300 ఎకరాల్లో వరి పంట పాడైంది. వరికి ధర బాగా పలుకుతుండటంతో అందరూ 555 రకానికి చెందిన వరి ధాన్యాన్ని సాగు చేశారు. అకాల వర్షంతో పాటు భారీ స్థాయిలో వీచిన గాలులకు పంట నేల వాలింది. ఈ గ్రామం ప్రొద్దుటూరు మండల పరిధిలో ఉండగా, పొలాలు చాపాడు మండల పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామంలో రైతులంతా చాలా ఏళ్లుగా కర్బుజా పంటను సాగు చేస్తున్నారు. జనవరిలో రెండో పంటగా వరి సాగు చేశారు.
 
 గ్రామానికి చెందిన రైతులు కుందూ పరివాహక ప్రాంతాలైన కుచ్చుపాప, వెదురూరు, సన్నపల్లె తదితర గ్రామాలకు వెళ్లి.. పొలం కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకృతి విపత్తు కారణంగా అటు వరి, ఇటు కర్బుజా పంటలు నాశనం అయ్యాయి. భారీ నష్టం వాటిల్లినా ఇప్పటి వరకు అధికారులెవ్వరూ ఇటు వైపు తొంగి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఈమె పేరు జగతి వెంకటమ్మ. సీతంపల్లె గ్రామానికి చెందిన ఈమె కుటుంబం తొమ్మిది ఎకరాల్లో వరి పంట, ఐదు ఎకరాల్లో కర్బుజా పంటను సాగు చేశారు. గాలి వాన కారణంగా అటు వరి, ఇటు కర్బుజా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో ఈమె లబోదిబో మంటోంది. చేతికొచ్చిన పంటలు ఇలా ఎన్నడూ దెబ్బతినలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
 
 ఆరు ఎకరాల్లో నష్టపోయా
 ఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేసి నష్టపోయాను. గతంలో ఎప్పుడు మా గ్రామంలో ఇలా జరగలేదు. మిగతా గ్రామాలకంటే ముందుగా పంటను సాగు చేయడంతో ఎక్కువ నష్టం జరిగింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
 - పేట చెండ్రాయుడు, సీతంపల్లె
 
 కోలుకోలేని దెబ్బ
 ఇటీవల వర్షం, గాలితో మా గ్రామం కోలుకోలేని విధంగా దెబ్బ తినింది. రైతులంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. నేను ఆరు ఎకరాల్లో వరి, 12 ఎకరాల్లో కర్బుజా పంట సాగు చేశాను. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోయాను. అధికారులు పరిశీలనకు కూడా రాలేదు.
 - జగతిపుల్లయ్య, సీతంపల్లె
 
 రెండు మండలాల్లో ఉన్నాం
 ప్రొద్దుటూరు మండలంలో నివాసం ఉన్న రైతుల పొలాలు చాపాడు మండల పరిధిలోకి వస్తాయి. గ్రామంలో కూడా రెండు మండలాల వారు కలిసి ఉంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పంటకు ఇలా మోసులు రావడం ఈ ప్రాంతంలో ఎన్నడూ చూడలేదు.
  - వరికూటి నాగన్న, సీతంపల్లె
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement