ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీ డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రైవేటు డెయిరీలు పాల ఉత్పత్తి దారులను ఆకర్షించే చర్యలను తీసుకోవడంతోపాటు పాల ధరలను ఎప్పటికప్పుడు మార్కెట్‌కు అనుగుణంగా పెంచుతున్నారు. ఈ విషయాలలో ఏపీ డెయిరీ చాలా వెనుకబడి ఉంది.
పతి సందర్భంలో ప్రైవేటు డెయిరీల తర్వాతే ధరను పెంచుతోంది. క్షేత్రస్థాయిలో రైతులతో చర్చించి పాలసేకరణను ప్రోత్సహించే అధికారులే కరువయ్యారు. గత ఏడాది వరకు జిల్లా వ్యాప్తంగా ఏపీ డెయిరీ రోజుకు 60వేల లీటర్ల వరకు పాలను సేకరించింది. ప్రస్తుతం 14వేల లీటర్లకు పడిపోయింది. జిల్లాలోని ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో ఏపీ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా తొండూరు, వేంపల్లి, సింహాద్రిపురం, లింగాల, సుండుపల్లి, ఒంటిమిట్ట, రైల్వే కోడూరు తదితర ప్రాంతాల్లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఎంసీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం చాలా కేంద్రాల నుంచి పాల సేకరణ సక్రమంగా జరగడం లేదు.
వేల లీటర్ల పాలను సేకరించే బీఎంసీలు కూడా నేడు వందల లీటర్లకు చేరాయి. ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు ఎప్పటికప్పుడు గ్రామాలకు వచ్చి పాల ఉత్పత్తిదారులతోపాటు రైతులతో చర్చించి పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో ఏపీ డెయిరీ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో మహిళా సంఘాలకు శిక్షణా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తుండేవారు. ప్రస్తుతం ఇలాంటివి లేకపోవడంతో ఏపీ డెయిరీకి గ్రామాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. మరో వైపు పాల ధరల్లో కూడా పూర్తిగా వ్యత్యాసం కనిపిస్తోంది. ఏపీ డెయిరీ అధికారులు రాష్ట్రంలోని ప్రాంతాలను బట్టి ధరలను చెల్లిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో ప్రైవేటు డెయిరీల నిర్వాహకులు వెన్నశాతాన్ని బట్టి లీటర్ పాలను రూ.49లతో కొనుగోలు చేస్తుండగా ఏపీ డెయిరీ మాత్రం రూ.45 మాత్రమే చెల్లిస్తోంది. వాస్తవానికి రూ.49 కూడా తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఏపీ డెయిరీ మాత్రం నిద్రమత్తు నుంచి ఇంకా తేరుకోవడంలేదు. జిల్లాలో సుమారు 40 ప్రైవేటు డెయిరీలు ఉండగా మైదుకూరు, జమ్మలమడుగు ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి.
వెనక్కెనక్కి..
Published Sat, Feb 22 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement