ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: వ్యవసాయ రుణాలపై రైతులు తీసుకున్న రుణాలపై వడ్డీ రాయితీని ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలా ఏళ్ల నుంచి రైతులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్ అధికారులు వడ్డీలో 6 శాతం రాయితీ ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది రైతులకు వడ్డీ రాయితీ అమలు కాలేదు.
రాజుపాళెం మండలంలోని పీ. టంగుటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ పరిధిలో రైతులకు 90 ట్రాక్టర్లను మంజూరు చేశారు. ఈ మేరకు ప్రతి రైతు అసలుతోపాటు పూర్తి వడ్డీని కూడా చెల్లించాల్సి వస్తోంది. వడ్డీ రాయితీ ఎందుకు కల్పించలేదని సొసైటీ సీఈఓ వెంకటేశ్వరరెడ్డిని న్యూస్‌లైన్ వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డబ్బు వసూలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకారం జిల్లా వ్యాప్తంగా వందల మంది రైతులు ప్రభుత్వం నిర్వాకం కారణంగా నష్టపోతున్నారు.
మార్చి 1వ తేదీ లోపు బకాయిలు చెల్లించాలని సొసైటీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నోటీసులను చూసిన రైతులు చాలా మంది బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయమై న్యూస్‌లైన్ ఆరా తీయగా 6శాతం వడ్డీ రాయితీకి సంబంధించి ప్రభుత్వం ఈ ఏడాది జీఓ విడుదల చేయలేదని తెలిసింది. చాలా సంవత్సరాలుగా వడ్డీ రాయితీని అమలు చేస్తుండగా ఈ ఏడాది మాత్రమే మినహాయించారు. కొన్ని చోట్ల సొసైటీ సీఈఓలు మీరు పూర్తి డబ్బు చెల్లిస్తే ప్రభుత్వం తిరిగి ఇస్తుందని చెబుతుండటంతో అధికారుల మాటలు నమ్మి రైతులు డబ్బు చెల్లిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో డబ్బు చెల్లించలేమని చెబుతున్నారు. మొత్తానికి వ్యవసాయ రుణాలపై ప్రభుత్వం ఏటా అమలు చేస్తున్న వడ్డీ రాయితీ ఈ ఏడాది అమలు చేయకపోవడంతో రైతులపై అదనపు భారం పడినట్లయింది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే
వసూలు చేస్తున్నాం
దీర్ఘకాలిక వ్యవసాయ రూణాలపై అసలులోతోపాటు పూర్తి వడ్డీ మొత్తాన్ని చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్రకారమే వసూలు చేస్తున్నాం. 6 శాతం వడ్డీ రాయితీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. జిల్లాలో 66 సహకార సంఘాలు ఉన్నాయి.
- మనోహర్, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఇన్ చార్జి మేనేజర్
రాజుపాళెం గ్రామానికి చెందిన ఈ రైతు పేరు నారపురెడ్డి వెంకటరమణారెడ్డి. ఈయన పీ.టంగుటూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్‌లో ట్రాక్టర్ కొనుగోలుకు రూ.4లక్షలు రుణం పొందారు. దీర్ఘకాలిక రుణం కింద 2011 జూన్‌లో కొనుగోలు చేసిన ట్రాక్టర్‌పై 13.25శాతం ప్రకారం ప్రతి ఏడాది వడ్డీతోపాటు అసలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఈ రైతుకు రూ.22,459లు వడ్డీ రాయితీ అమలు కావాల్సి ఉంది. అయితే అధికారులు ఈ ఏడాది వడ్డీ రాయితీ అమలు కాలేదని మీరు అసలు రూ.29,078లతోపాటు వడ్డీ రూ.49,598 కలిపి మొత్తం రూ.78,676ను చెల్లించాలని నోటీసు ఇచ్చారు. దీంతో కంగుతిన్న రైతు ఇన్నేళ్లపాటు సొసైటీలో అమలవుతూ వచ్చిన వడ్డీ రాయితీ ఈ ఏడాది ఎందుకు అమలు కాలేదని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం లేదు.
రాయితీ ఏదీ!
Published Wed, Feb 26 2014 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:05 AM
Advertisement
Advertisement