ఆరుగాలం కష్టపడుతున్న అన్నదాతలకు నష్టాలే వస్తున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేస్తే నిరాశే మిగులుతోంది. గాలివాన బీభత్సంతో అరటి నేలవాలితే.. మామిడి కాయలు రాలిపోయాయి. తమలపాకు తోటలు, ఆముదం పంటకు నష్టం వాటిల్లింది. గెలలతో ఉన్న అరటి చెట్లు నేలమట్టం అయ్యాయి. దిగుబడి వచ్చే సమయంలో నేలపాలు కావడంతో రైతులు తీవ్ర వేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
రైల్వేకోడూరు రూరల్, న్యూస్‌లైన్: రైల్వేకోడూరు మండలంలో మంగళవారం సాయంత్రం కురిసిన వానకు తోడైన పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. రైతులను కోలుకోకుండా చేశాయి. ఒక మోస్తారుగా వర్షం పడుతుందిలే అనుకుని సంతోష పడిన అన్నదాతలకు క్షణాలలో పెనుగాలుల రూపంలో విషాదాన్ని మిగిల్చాయి. కరెంటు కష్టాలను ఎదుర్కొని అరటి సాగు చేస్తే తీవ్ర నిరాశ మిగిలింది.
రైల్వేకోడూరు నియోజకవర్గం వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. వేల ఎకరాలలో అరటి సాగులో ఉంది. మండల పరిధిలోని చియ్యవరం, జంగిటివారిపల్లె, వెంకటరెడ్డిపల్లె, మారావారిపల్లె తదితర ప్రాంతాలలో అరటి తోటలు దెబ్బతిన్నాయి. కొందరి తోటలు పూర్తిగా నేలమట్టంకాగా.. మరి కొందరివి సగం మేర దెబ్బతిన్నాయి. అరటి దిగుబడికి మంచి రేట్లు ఉన్న సమయంలో ఇలా జరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
అదే విధంగా వేల ఎకరాలలో ఉన్న మామిడి తోటలలోని కాయలు నేలరాలాయి. గత వారం క్రితం ఒక రకంగా ఉన్న మామిడి రేట్లు సోమవారం నుంచి సగానికి తగ్గాయి. దీంతో మామిడి రైతులు రేట్లు వచ్చిన తర్వాత కోస్తే కాస్త ఆదాయం వస్తుందనుకున్నారు. అయితే పెనుగాలులు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. నష్టాలు తెచ్చిపెట్టాయి. నేల రాలిన కాయలు ఏరి మార్కెట్‌కు తరలిస్తే వచ్చే అరకొర డబ్బులు కూలీలకు, ట్రాక్టరు బాడుగకు కూడా సరిపోవని రాలిన కాయలను తోటలలోనే వదిలే స్తున్నారు.
చేనుగట్లపై సాగు చేసిన ఆముదం చెట్లు వేర్లతో సహా నేలకూలాయి. వెంకటరెడ్డిపల్లె పంచాయితీలో ఆకు తోటలు నేలకొరిగాయి. మొత్తం మీద రైల్వేకోడూరులో రైతులకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
గాలివాన బీభత్సం
Published Thu, May 29 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM
Advertisement