మండలంలో రబీ సీజన్‌లో 14,247 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో బీపీటీ రకాన్ని 8,100 ఎకరాల్లో, 1010 రకాన్ని 6,147 ఎకరాల్లో సాగు చేశారు. 61 వేల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది.
వాకాడు, న్యూస్‌లైన్: మండలంలో రబీ సీజన్‌లో 14,247 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో బీపీటీ రకాన్ని 8,100 ఎకరాల్లో, 1010 రకాన్ని 6,147 ఎకరాల్లో సాగు చేశారు. 61 వేల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. పంటను అమ్ముకునే సమయంలో ధరలు పడిపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ధరలను శాసిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ ద్వారా రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ అధికారులు చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి.
ఇప్పటి వరకు 46.5 వేల టన్నుల ధాన్యాన్ని దళారులకు అమ్ముకొన్నామని రైతులు అంటున్నారు. మిగిలిన రైతులు ధరలు లేకపోవడంతో పెట్టుబడులకు వడ్డీ కూడా రాదనే ఉద్దేశంతో కొందరు ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ఇదిలా ఉంటే ధాన్యం నిల్వ ఉంచుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాకాడు ఏఎంసీ గోడౌన్‌లో ధనవంతులకు ప్రాధాన్య ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఇక్కడ పేద రైతులకు అన్యాయం జరుగుతోందని మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.