మిర్యాలగూడ, న్యూస్‌లైన్: రబీ సీజన్‌లో జిల్లా రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాగర్ ఎడమ కా లువకు రబీలో నీళ్లు విడుదల చేసినా చివరి భూములకు అందక ఎండిపోతున్నాయి. బోరుబావుల కింద సాగు చేసిన రైతులకు కరెంటు కోతలతో ఎండిపోతున్నాయి. రైతాంగానికి ఏడు గంట లపాటు విద్యుత్ సరఫరా ఉత్తమాటలుగానే మిగిలాయి. ఖరీఫ్‌లో దోమకాటుతోపాటు తుపాను కారణంగా పంటల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో రబీలోనైనా పంటలు పండుతాయని సాధారణ వరి సాగు కంటే అధికమొత్తంలో సాగు చేశారు. పంటలు ఎండిపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడులైనా వస్తా యో రావో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు గంటలే కరెంటు..
ప్రాజెక్టులలో పుష్కలంగా నీరు ఉన్నా.. సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా ఉత్తమాటే అయ్యింది. వ్యవసాయానికి రోజూ 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉన్నా మూడు గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
మిర్యాలగూడ మండలం తడకమళ్ల సబ్‌స్టేషన్ పరిధిలో మూడు రోజులుగా కేవలం రోజుకు మూడు గంటలపాటు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దాంతో జైకిసాన్ ఎత్తిపోతల పథకం కింది వరి పొలాలు ఎండిపోతున్నాయి. శుక్రవారం సబ్‌స్టేషన్ వద్దకు తడకమళ్ల, మొల్కపట్నం, సల్కునూరు గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన నిర్వహించారు.
వెంకటాద్రి పాలెం సబ్‌స్టేషన్ పరిధిలో రోజుకు కనీసం గంట పాటు కూడా విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల వాటర్ ట్యాంకుతండా, వెంకటాద్రిపాలెం సమీపంలో పొలాలు ఎండిపోతున్నాయి.
వారబందీతో ఎండుతున్న పంటలు..
ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో రబీలో నీటి విడుదల వారబందీ పద్ధతిలో ఉండడం వల్ల చివరి భూములకు నీరందక ఎండిపోతున్నా యి. కిష్టాపురం మేజర్ కాలువ పరిధిలో చివరి భూములకు నీళ్లు అందడం లేవని గూడూరు వద్ద స్థానిక ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కాలువలో కూర్చొని నిరసన తెలిపారు. అదే విధంగా మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల, ఊట్లపల్లి, శ్రీనివాస్‌నగర్, నందిపాడు క్యాంపు, రాఘవాపురం తండాలో పంట పొలా లు ఎండిపోతున్నాయి. దామరచర్ల మండలంలోని దామరచర్ల, రాజగట్టు, ముదిమాణిక్యం, అడవిదేవులపల్లి, బాల్నేపల్లి గ్రామాలలో నీళ్లందక వరి పంటలు ఎండిపోతున్నాయి.
రబీ.. అగమ్యగోచరం
Published Sat, Mar 1 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM
Advertisement